Sindhuja Srinivasan | ‘రా.. నువ్ కావాలయ్యా..’ అంటూ సాగే పాట ట్రాక్‌కు ఎక్కగానే తెలుగు సంగీతపు కీ బోర్డు.. దెబ్బకు మీటను హై పిచ్‌కు సవరించుకుంది. అందులోనిస్వరం టాలీవుడ్‌నే కాదు మాలీవుడ్నూ, బాలీవుడ్నూమత్తులో ముంచెత్తింది. మధువొలికించే ఆ గొంతుకను చెవులప్పగించి వింటున్నది సంగీత ప్రపంచం. ‘జైలర్’ సినిమాలో మెరిసిన ఈ గళం హైదరాబాదీ అమ్మాయిదే. అయితే, ఈ గొంతు అసలు పాటకే పనికిరాదన్నవారూ ఉన్నారంటూ తన స్వర ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారు సింగర్ సింధూజ శ్రీనివాసన్…
అవకాశాలెప్పుడూ చెప్పిరావు. విజయాలూ అంతే. మా రంగమే అంత. మిగతా ఉద్యోగాల్లా ఏడాదికో ఇంక్రిమెంటు, మూడేండ్లకో ప్రమోషన్ అన్నట్టు ఉండదు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాన్స్ వచ్చినప్పుడే నైపుణ్యం పెంచుకుంటానంటే కుదరదు. ఇచ్చిన పని కోసం ఏలోపం లేకుండా సాధన సాగాలి. ఇదే నా సిద్ధాంతం. నా గొంతు గొప్పగా ఉంటుందని నేనెప్పుడూ భావించలేదు. చిన్నప్పుడు ఎదురైన విమర్శలు ఇందుకు కారణం కావచ్చు. వాటిని అసలు పట్టించు కోలేదని చెప్పలేను కానీ, పాట మీద నాకున్న మమకారం సంగీతాన్ని వదలకుండా చేసిందని మాత్రం బలంగా చెప్పగలను. బాగుందో లేదో నాకు అనవసరం. పాడటం ఇష్టం కాబట్టి పాడుకుంటా. ఆ పట్టుదలే పాటను నా కెరీర్‌గా మార్చింది. హిట్ పాటలనూ ఇచ్చింది.
అమ్మ నుంచే..
మా ఇంట్లో సినీ రంగానికి చెందినవాళ్లు లేరు. అమ్మానాన్న ప్రభుత్వ ఉద్యోగులు. మా ముత్తాతలది తమిళనాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. నేను పుట్టిపెరిగిందంతా ఇక్కడే. చెల్లి ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నది. నేను సెయింట్ ఫ్రాన్సిస్‌లో ఇంటర్ చేశాను. సీఏ ఆర్టికల్‌షిప్ వరకూ వెళ్లాను. అమ్మ కర్ణాటక సంగీతం నేర్చుకుంది. బాగా పాడుతుంది. నాకు పాటలు, పద్యాలు స్వరబద్ధంగా నేర్పేది. నేను చక్కగా ఒడిసిపట్టేదాన్ని. దీంతో నాకు మంచి గురువు దగ్గర సంగీతం నేర్పాలని అనుకున్నారు. అంతేకాదు, అమ్మకు అంత బాగా వచ్చినా నలుగురిలో పాడేది కాదు. ఆ స్టేజ్ ఫియర్ నాకూ ఉండకూడదని అనుకున్నారు. ఎనిమిదో ఏట రామాచారి దగ్గర లలిత సంగీత విద్యార్థిగా చేరాను. గోమతి గోపాల కృష్ణన్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. అయితే చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
గొంతు గొప్పగా లేదన్నారు..
కళాకారులు గుర్తింపు కోరుకుంటారు. ముఖ్యంగా చిన్న వయసులో ఒక ప్రశంసే ఎంతో సంతోషాన్నిస్తుంది. అప్పట్లో పాటల రియాలిటీ షోస్ బాగా జరిగేవి. వాటిలో పాడాలని ఉండేది. సెలెక్షన్స్కూ వెళ్లేదాన్ని. బాగానే పాడేదాన్ని, కానీ ఎంపిక అయ్యేదాన్ని కాదు. చాలా నిరాశగా అనిపించేది. ‘పాప గొంతు పాటకు అంతగా సూటవ్వదు, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్పించండి’ అని చెప్పిన వాళ్లూ ఉన్నారు. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి. నేను కూడా అదే నిజమని అనుకున్నాను. కానీ నాకు పాడటమే ఇష్టం. అందుకే సంగీతాన్ని విడువకుండా సాధన చేశాను.
ఎవరు ఏమంటారో అనే ఆలోచన పక్కన పెట్టి, నేను బాగా పాడుతున్నానా లేదా అనే విషయం మీద ధ్యాస పెట్టాను. అలా నేను పాడుతూ వెళ్లేసరికి గుర్తింపు కూడా నా దారిలో రావడం మొదలైంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ‘జీ సరిగమప’. అప్పటికి నేను సీఏ ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. ఫైనల్ ఎగ్జామ్స్‌కు ఏడాది సమయం ఉండగా.. ఈ కార్యక్రమం మరో సీజన్ ప్రారంభమైంది. అందులో రన్నరప్‌గా నిలిచాను. దాంతో నా పాట నలుగురికీ తెలిసింది. దానికి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో ‘స్వరాభిషేకం’, ‘పాడాలని ఉంది’ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కోరస్‌తో పాటు, ఒక డ్యూయెట్ ఆయనతో కలిసి పాడాను. ఆ సమయంలో ఎమోషన్స్ ఎలా పలికించాలో నాకు చెప్పేవారు. పాటను బట్టి గొంతులో భావం వినిపించేందుకు అలాంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. గొంతులో అంత మత్తు ధ్వనించేలా ఎలా పాడగలిగారని చాలా మంది అడుగుతుంటారు.
Sinduja Srinivasa
నిజానికి శాస్త్రీయ బాణీలకూ నా గొంతు చక్కగా సూటవుతుంది. దీంతో ఏ పాటైనా సౌకర్యంగా పాడగలను. గత రెండేండ్లుగా పూర్తి స్థాయిలో సినిమా పాటలు పాడుతున్నా. 2021లో ఒక ఆల్బమ్ కోసం పాడిన ‘తట్టుకోలేదే…’ పాట బాగా హిట్ అయింది. ఇప్పటికీ మ్యూజిక్ ఆప్‌లలో టాప్‌ప్లేస్‌లో ఉంటుంది. కింగ్ ఆఫ్ కోత, శ్రీదేవి శోభన్‌బాబు లాంటి సినిమాల్లోని గీతాలూ గుర్తింపునిచ్చాయి. జైలర్ పాటకు అంత స్పందన రావడం ఇంకా బాగా చేయగలనన్న ధైర్యాన్నీ ఇచ్చింది. ఈ పాటను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ వెర్షన్లూ నేనే పాడా. నాలుగు చోట్లా బాగా హిట్ అయింది. సాధారణంగా స్త్రీ గొంతుకకు లీడ్‌లో ఉండే పాట రావడమే గొప్పంటే అదీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం మరీ అరుదు. ప్రస్తుతం, తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పాడుతున్నా. సినీ సంగీత కెరీర్‌కు సంబంధించి నాకంటూ గైడెన్స్ ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు. ఉండి ఉంటే కనుక.. నేను ఇంకా మెరుగైన స్థానంలో ఉండేదాన్నేమో. అందుకే, సంగీతంలో ఎదగాలనుకునే పిల్లలకు మెంటర్‌గా వ్యవహరించే ఆలోచన ఉంది. దానికి ఓ రూపం ఇవ్వబోతున్నాను.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి