Sravana Masam | పూజలూ పునస్కారాలు, నోములూ వ్రతాలు, పెండ్లిళ్లూ పేరంటాలు… శుభకార్యం ఏం పెట్టుకోవాలన్నా శ్రావణానికే ఓటేస్తారు మనవాళ్లు. పసుపు దంపు చప్పుళ్లూ, వాయనాల ముచ్చట్లూ ఈ నెలలోనే వినిపిస్తాయి. ఆయా వేడుకలకు మరింత ఘనంగా మలిచే ఉద్దేశంతో అక్కడ వాడే రోలూ రోకళ్ల నుంచి వాయనాల బుట్టల దాకా వెండితో తయారు చేస్తున్నారు డిజైనర్లు.
పెండ్లి ముచ్చట మొదలయ్యేది పసుపు దంచడంతోనే. హల్దీ ఫంక్షన్గా పిలుస్తూ ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా జరుపుతున్నారు. ఈ వేడుకకు మరింత శోభను తెచ్చేలా రోలు, రోకళ్లతోపాటు విసురురాయినీ రజతంతో తీర్చిదిద్దుతున్నారు. పూర్తి వెండి రోళ్లతోపాటు, చెక్కవాటికి వెండి రేకులతో డిజైన్ చేసినవీ ఉంటున్నాయి ఇందులో. స్తోమతను, అవసరాన్ని బట్టి చేయించుకునేలా అరచేతిలో పట్టేంతవాటి నుంచి నిజమైన వస్తువులంత పెద్దవాటి వరకూ రూపొందుతున్నాయి.
శ్రావణ మాసం చేసే మంగళగౌరీ నోము, వరలక్ష్మీ వ్రతాలు లాంటివాటిలో తాటాకు బుట్టలో వాయనం పెట్టి ఇచ్చే ఆచారమూ కొన్నిచోట్ల ఉంది. ఇప్పుడు తాటాకు స్థానంలో డిజైనర్లు వెండితోనూ బుట్టల్ని అల్లుతున్నారు. అంతేకాదు, చేట వాయనాల కోసం వెండి చేటలనూ తయారు చేస్తున్నారు. అందులోనూ వెదురు అల్లికను పోలి తయారయ్యేవి కొన్నయితే, చేట లోపల లక్ష్మీదేవి, ఏనుగులు ఉండేవీ, పూలూ తీగల్లాంటి డిజైన్లు ఉన్నవీ మరికొన్ని రకాలు. చేట వాయనంలో పెట్టి ఇచ్చే తాంబూలాలూ, దువ్వెనల్లాంటివీ రజతంతోనే తీరుస్తున్నారు. చేటలను కూడా మన ఇష్టాన్నిబట్టి చిన్నాపెద్దా సైజుల్లో కొనుక్కోవచ్చు. ఇక, వ్రతాల సందర్భంలో పెట్టుకునే కలశాన్ని కూడా అచ్చంగా వెండితోనే చేస్తున్నారు. ఇంతకుమునుపు ఇందుకోసం అష్టలక్ష్మి చెంబులను వాడేవాళ్లం. ఈ నమూనాలోనూ కొబ్బరికాయ, పూలు, మామిడాకులు కూడా వెండితోనే చేసినవి పూర్ణకలశం రూపంలో దొరుకుతున్నాయి. వీటిలోనూ రాళ్లు, ఎనామిల్ ఉన్నవీ చూడచక్కగా గొలుసులు వేలాడేవీ వస్తున్నాయి. అంతేకాదు, అందమైన డిజైన్లు తీర్చి వాటిమీద బంగారు పోత పోసినవీ ఉంటున్నాయి. ఆయా పేర్లతో వెతికితే వీటిని చేసిపెట్టే ఆన్లైన్ జువెలరీ సంస్థలు కనిపిస్తాయి. కాదంటే వెండి, బంగారు షాపుల్లోనూ లభ్యమవుతున్నాయి. మీ అవసరాన్ని బట్టి నచ్చిన వస్తువులకు రజత పతకాన్ని అలంకరించండి మరి!