ఉద్యోగం అంటే ఏదైనా కంపెనీలో ఫుల్‌టైమ్ పని అనే చాలామంది భావన! కానీ, వర్క్‌కల్చర్ మారుతున్నది. ఈ జనరేషన్ ఆలోచనలు మారుతున్నాయి. అందుకే ఇప్పుడు గిగ్ ఎకానమీ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతున్నది. ‘గిగ్ వర్కర్స్’ అనే పేరు విన్నాం గానీ.. ఈ ‘గిగ్ ఎకానమీ’ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ అందరూ ఫ్రీలాన్స్ పనులు చేస్తారు. ఒక స్థిరమైన జీతం ఉండదు. మీ నైపుణ్యాలను ఆన్లైన్లో అమ్ముకోవడమే పని. నైన్ టు ఫైవ్ కొలువులు మాకొద్దు.. ఆఫీస్‌కు వెళ్లడం, బాస్ మాటలు ఫాలో అవ్వడం మాతో కాదు.. అనుకునే జెన్ జెడ్ గిగ్ ఎకానమీ ట్రెండ్‌ను ఎలా చూస్తుంది? కంపెనీలు దీన్ని ఎందుకు ఆదరిస్తున్నాయి? లెట్స్ సీ..
టెక్నాలజీ గ్లోబలైజేషన్ ఉపాధి మార్గాల్ని మార్చేశాయి. స్మార్ట్ఫోనో, ల్యాప్‌టాపో ఉంటే చాలు.. ఎక్కడినుంచైనా పనిచేయొచ్చు. దేశ సరిహద్దులు దాటి క్లయింట్లను చేరొచ్చు. అందుకేనేమో గిగ్ ఎకానమీ ఇప్పుడు డెలివరీ, రైడ్ షేరింగ్‌తో ఆగిపోలేదు. పెద్ద రంగాల్లోకి వ్యాపించింది. కంప్యూటర్, ఐటీ, ఫైనాన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఆర్ట్, డిజైనింగ్, క్రియేటివ్ రైటింగ్ రంగమేదైనా ఫ్రీలాన్సర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి పలు కంపెనీలు. ఫుల్‌టైమ్ ఉద్యోగులను భరించడం కన్నా.. ఫ్రీలాన్సర్లతో పని కానిచ్చేసుకోవడం సులభం అని ఫీలవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఉంటున్న రవి ఫైవర్లో గ్రాఫిక్ డిజైన్ చేస్తాడు. అమెరికాలోని తన క్లయింట్‌కు డిజైన్ పంపిస్తాడు. ఆ క్లయింట్ వెంటనే రవికి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇలా ఎల్లలు దాటి పనిచేసే సౌలభ్యం ఇప్పుడు టాలెంట్ ఉన్నవారికి అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా ‘నాకు నచ్చిన పని.. నచ్చిన టైమ్‌లో చేస్తా’ అని ఫిక్సవుతున్న ఈ తరానికి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది? అందుకే గిగ్ ఎకానమి మెగాస్పీడ్తో దూసుకెళ్తున్నది.
కంపెనీల ప్రోత్సాహం..
గిగ్ ఎకానమీ తమకు లాభదాయకం అని భావిస్తున్నాయి కంపెనీలు. ఫుల్‌టైమ్ ఉద్యోగులకు జీతాలతోపాటు అదనపు బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ, గిగ్ వర్కర్లతో ఆ ఇబ్బంది లేదు. స్థిరమైన పని గంటలూ ఉండవు. ఆఫీస్ ఉండదు, నిర్వహణ భారమూ పడదు. దీంతో కంపెనీల యాజమాన్యాలు దీన్ని తెగ ప్రమోట్ చేస్తున్నాయి. వర్క్ ఇచ్చామా, అనుకున్న సమయానికి పని పూర్తయ్యిందా ఇదే లెక్క! అయితే, ఈ కల్చర్ వల్ల కంపెనీలు కార్మిక చట్టాల నుంచి యథేచ్ఛగా తప్పించుకునే వీలుంది. ఈ సంప్రదాయేతర కొలువు విధానాన్ని ప్రభుత్వాలు సమీక్షించాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఫ్రీలాన్సర్లకూ హక్కులు, ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతలు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్వేచ్ఛగా పనిచేయొచ్చు
భద్రత అంతంత మాత్రమే ఉన్నా.. గిగ్ ఎకానమీపై ఈ తరం మనసు పారేసుకుంటున్నది. ఇంటినుంచే పనిచేయొచ్చు. ఆఫీస్ వాతావరణం ఇష్టం లేనివారికి ఇది మంచి ఎంపిక. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ.. సోలోగా టాలెంట్ నిరూపించుకోవచ్చు. దీంతో కస్టమర్లను త్వరగా అట్రాక్ట్ చేయొచ్చు. నైపుణ్యాలకు అనుగుణంగా డిమాండ్ చేసే అవకాశమూ ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇది వరం లాంటిది. అయితే, గిగ్ ఎకానమీలో స్థిర ఆదాయం ఉండదు. ఒత్తిడి తక్కువేం ఉండదు. నిరంతరం పని వెతకాలి. దాంట్లో భాగంగా ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వాల్సి వస్తుంటుంది.
ఈ ఒత్తిడి కుటుంబంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రమశిక్షణ, సహనం చాలా అవసరం. అలాగే, సంప్రదాయ వర్క్ కల్చర్‌లో ఉండే ప్రమోషన్లు, బోనస్‌లు, అప్రైజల్స్ ఇక్కడ ఉండవు. ఈపీఎఫ్, ఆరోగ్య బీమా లాంటి బెనిఫిట్స్ ఊసే ఉండదు. లాంగ్‌టర్మ్ కాంట్రాక్ట్‌లు దొరికినప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ, సాధారణ ఉద్యోగంతో పోలిస్తే ఇవి తక్కువనే చెప్పాలి. అయితేనేం.. గిగ్ ఎకానమీ కల్చర్ రోజు రోజుకూ విస్తృతం అవుతున్నది. ఇదొక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా మారుతున్నది. అయితే, చట్టపరమైన నియమాలు లేకపోవడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంట్లో పనిచేసేవారు ఎవరు? పని ఇస్తున్నది ఎవరు? ఇది ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగం? తదితర ప్రశ్నలకు సమధానాలు వెతకాలి! అప్పుడే గిగ్ ఎకానమీలో మీరెలా భాగస్వాములు అవ్వాలి అనేదానిపై స్పష్టత వస్తుంది.
హద్దుల్లేవ్..
గిగ్ ఎకానమీకి సాంకేతికత రెక్కలు తొడిగింది. ఇంటర్నెట్ వేగం, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సులభం చేశాయి. ఉబర్‌లో డ్రైవర్‌గా, అర్బన్ కంపెనీలో హెయిర్ స్టయిలిస్ట్‌గా, అప్వర్క్లో కంటెంట్ రైటర్‌గా ఎక్కడైనా ఫ్రీలాన్స్‌గా పనిచేయొచ్చు. ఇవి కేవలం డెలివరీ, రైడ్ షేరింగ్ దగ్గరే ఆగిపోలేదు. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లోనూ గిగ్ ఎకానమి చొచ్చుకొచ్చేసింది. భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ లాంటివి గిగ్ పనులను మరింత ఈజీగా మార్చనున్నాయి.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్