కఠినమైన చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలపై జరిగే అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లాలంటేనే యువతులు భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అతివలపై అకృత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఈ సమాజంలో మహిళలు వాళ్లకు వాళ్లు రక్షణ కల్పించుకోవడం కూడా చాలా అవసరం.
ఇందుకోసం ప్లే స్టోర్‌లో ఎన్నో సెక్యూరిటీ అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో ఒకటి షీ సేఫ్ (SHE Safe). అత్యవసర సమయాల్లో మహిళలకు భద్రత కల్పించే ఉద్దేశంతో.. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీస్ ఈ యాప్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ సమయాల్లో ఇందులోని ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేస్తే చాలు.. పోలీసులకు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. మీరు ఉన్న ప్రదేశం వివరాలు తెలిసిపోతాయి.
ఈ యాప్ ఉపయోగించాలంటే లొకేషన్ ఆన్‌లో ఉంచడం తప్పనిసరి. ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే కాదు.. ఇందులోని మార్గదర్శక్, సంఘమిత్ర, సేఫ్ స్టే, రేడియంట్ హైదరాబాద్, బీ అవేర్ తదితర ఆప్షన్స్‌ను మామూలు సమయాల్లోనూ వినియోగించవచ్చు. పోలీసు శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు కూడా చూసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటివరకు దాదాపు 10వేల మంది ఉపయోగిస్తున్నారు.