ఆఫీస్ పనుల్లో ఈ-మెయిల్స్ పంపడం ఒక నిరంతర ప్రక్రియ. అయితే జీమెయిల్లో ఉండే చిన్న విండోలో మ్యాటర్ టైప్ చేయడం, ఫార్మాటింగ్ సెట్ చేయడం కొన్నిసార్లు చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా క్లయింట్లకు పంపే ప్రపోజల్స్, కాన్ఫిడెన్షియల్ మెయిల్స్ రాసేటప్పుడు ఎక్కడ తప్పులు దొర్లుతాయో?! అనే టెన్షన్ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారా? అయితే గూగుల్ డాక్స్‌లో వచ్చిన ఈ ‘ఈమెయిల్ డ్రాఫ్ట్’ ఫీచర్ మీ కోసమే! గూగుల్ తన బిల్డింగ్ బ్లాక్స్ సిస్టమ్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫీచర్‌ను పరిచయం చేసింది.
గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి ‘Insert’ లోకి వెళ్లి ‘Building blocks’ లోని ‘Email draft’ ఎంచుకుంటే చాలు. నేరుగా ఈ-మెయిల్ అడ్రస్, సబ్జెక్ట్ లైన్, బాడీ రాయడానికి ప్రత్యేక సెక్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఉన్న పెద్దప్లస్ పాయింట్ ఏంటంటే.. మీరు రాసిన మెయిల్‌ను మీ మేనేజర్లకు లేదా సహచరులకు షేర్ చేసి, వారి సలహాలు కూడా తీసుకోవచ్చు.
అన్నీ ఓకే అనుకున్నాక ‘Preview in Gmail’ బటన్ నొక్కితే చాలు.. మీ కంటెంట్ అంతా ఆటోమేటిక్‌గా జీమెయిల్‌కు బదిలీ అవుతుంది. ఇది కేవలం మీ సమయాన్ని ఆదా చేయడమే కాదు, టీమ్ మొత్తంతో కలిసి మెరుగైన ఈ-మెయిల్స్ పంపడానికి తోడ్పడుతుంది.