శీతకాలం రాగానే కొందరిలో తెలియని నీరసం ఆవహిస్తుంది. ప్రతి చలికాలం ఇలానే జరుగుతుంటే.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (ఎస్ఏడీ)కు గురవుతున్నట్టు లెక్క. దీన్నే ఆంగ్లంలో ‘వింటర్ బ్లూస్’ అంటారు. ఈ రుగ్మత లక్షణాలు..
ఏమవుతుంది?
మనసులో అకారణ బాధ, నిరుత్సాహం, నిరాసక్తత, అతిగా తినడం, వేగంగా బరువు పెరగడం, అధిక కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలనే కోరిక కలగడం, అతి నిద్ర, అలసట.. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌ను సూచించేవే.
ఎందుకొస్తుంది?
చలికాలంలో సూర్యకాంతి తగ్గడం వల్ల శరీరంలోని జీవగడియారం పని తీరుకు అంతరాయం కలుగుతుంది. దీన్నొక కారణంగా చెప్పవచ్చు. ఎండ తక్కువగా తగలడం వల్ల రక్తంలో సెరటోనిన్‌గా పిలిచే ఫీల్‌గుడ్ హార్మోన్ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా నిరుత్సాహం, కుంగుబాటు ఆవహిస్తాయి. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది.
లోపం ఇదే..
ప్రధానంగా విటమిన్-డి తక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారు దీని బారిన పడతారు.
జాగ్రత్త పడాల్సిందే..
శీతకాలంలో వచ్చే ఈ సమస్యల్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారితీయవచ్చు. నలుగురిలో కలవ లేకపోవడం, ఆఫీసులో సరిగ్గా పనిచేయలేకపోవడం ప్రధాన లక్షణాలు. మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడవచ్చు. అకారణ దుఃఖం, ప్రతికూల ధోరణులు, ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతాయి.
ఏం చేయాలి?
విటమిన్-డి మాత్రలతో పాటు యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తారు. వివిధ థెరపీల ద్వారా వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాయామం, సమ తులాహారమూ ముఖ్యమే.