సత్యలక్ష్మి చేనేత మగ్గంపై అద్భుతాలు చేస్తారు. ఇక్కత్ చీరల నేతలో దిట్ట. కాబట్టే తనను అనేక పురస్కారాలు వరించాయి.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని నీర్మాల తన సొంతూరు. ఇంట్లో ఉన్న మూడు మగ్గాల మీద ఆమె మామ, భర్తతో పాటు తాను పనిచేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేతకు చేయూత కరువైంది. దీంతో అనేక కష్టాలు అనుభవించింది. ఆ తర్వాత స్వయం సహాయక బృందంలో సభ్యురాలై ఆర్థిక సమస్యలను అధిగమించింది. స్వయం ఉపాధిని సాధించింది. గ్రామంలో హరిత స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన సత్యలక్ష్మికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి చేయూత లభించింది.
బ్యాంకు లింకేజీ నుంచి పావలా వడ్డీపై రూ. 3 లక్షలు, స్త్రీనిధి నుంచి రూ. 1.15 లక్షలు రుణ సదుపాయం అందింది. దీంతో తానే స్వయంగా చీరల తయారీకి కావాల్సిన ముడిసరుకు కొనుగోలు చేసి పోచంపల్లి, ఇక్కత్, మద్దికాయ, ఫుల్డిజైన్ చీరలు నేస్తున్నది. తనే స్వయంగా విక్రయించుకునే స్థాయికి చేరింది. ఆ శ్రమను గుర్తించిన గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోత్సహించింది. దీంతో వివిధ రాష్ర్టాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్స్‌లో స్టాల్ ఏర్పాటు చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటుచేసే సరస్ (మార్కెటింగ్ వేదిక) ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా.. తెలంగాణ నుంచి సత్యలక్ష్మి స్టాల్ ఉండాల్సిందే. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తో పాటు అనేక రాష్ర్టాల్లో చేనేత చీరల ప్రదర్శనలో పాల్గొన్నది. సత్యలక్ష్మి ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2022లో శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసింది.
ఆనందంగా ఉన్నాం..
‘మాది పద్మశాలి కుటుంబం. చేనేత వృత్తి అంతరిస్తున్న దశలోనూ మా కుటుంబం మగ్గంపైనే ఆధారపడి జీవనం సాగించింది. మహిళా సంఘం సభ్యురాలిని కావడంతో ఐకేపీ సంస్థ నన్ను ప్రోత్సహించింది. బ్యాంకు రుణం లభించింది. దీంతో చేతి నిండా పెట్టుబడి సమకూరింది. ముడిసరుకు నేరుగా కోయంబత్తూరు నుంచి తెప్పిస్తాం. ఏ ఎగ్జిబిషన్‌కు వెళ్లినా.. రూ. 3లక్షల విలువైన చీరలు అమ్ముతాం. 25 శాతం వరకూ లాభాలు వస్తాయి. గతంతో పోలిస్తే మా కుటుంబం ఆనందంగా బతుకుతున్నది. నలుగురు పిల్లల్ని చదివిస్తున్నాం. ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే చీరల వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన ఉంది’ అని చెబుతున్నది సత్యలక్ష్మి.