విహారాలు పలు రకాలు. పుణ్యం కోసం తీర్థయాత్రలు. పురుషార్థం కోసం వినోద విహారాలు. ఎక్కడికి వెళ్లినా మానసిక సంతోషం గ్యారెంటీ! కానీ, శరీరం మాత్రం కాస్తో కూస్తో అలసిపోతుంది. మనోల్లాసంతోపాటు శారీరక బలాన్ని ఇచ్చే హెల్త్ టూరిజం ఇప్పుడు ట్రెండింగ్. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. అలాంటి విహార కేంద్రమే మహారాష్ట్రలోని గోవర్ధన్. సహ్యాద్రి పర్వత పాదాల చెంతన తీర్చిదిద్దిన గ్రామం ఇది. ముంబై నగరానికి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూల వనాలు, వ్యవసాయ క్షేత్రాలు, గోశాలలు, కుటీరాలు, జాజుతో అలికిన అరుగులు ఇలా పల్లెదనం పల్లవించే చోటిది.
ఇస్కాన్ నిర్వహిస్తున్న గోవర్ధన్ ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ఓ ప్రశాంతత కలుగుతుంది. కృష్ణ మందిరం నుంచి నిరంతరం లీలగా వినిపించే ‘హరే రామ.. హరే కృష్ణ’ భజనలు పర్యాటకులకు బృందావనంలో విహరిస్తున్నామన్న అనుభూతిని కలిగిస్తాయి. ఒకవైపు ప్రకృతి, మరోవైపు ఆధ్యాత్మికత కలగలసి గోవర్ధన్ గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగినా ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఓ పది రోజులు ఉండగలిగారా.. అద్భుతమైన జీవన విధానం అలవడుతుంది. ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది. పర్యాటక భక్తుల కోసం గోవర్ధన్ నిర్వాహకులు తరచూ యోగా క్యాంప్‌లు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఇలా ఎప్పుడూ ఏదో ప్రత్యేక ఉంటూనే ఉంటుంది. ఇక్కడున్నన్ని రోజులు వారు సూచించిన దినచర్యే పాటించాలి. యోగా, గోసేవ, భజనలు ఇలా సాగిపోతుంటాయి రోజులు. ఇక్కడ ఒక రోజు నుంచి 28 రోజుల వరకూ ఉండొచ్చు. బుకింగ్, ఇతర వివరాల కోసం www.ecovillage.org.in వెబ్‌సైట్‌ని చూడండి.
చేరుకునేదిలా: గోవర్ధన్ ఆశ్రమం ముంబై మహానగరానికి 108 కిలోమీటర్ల దూరంలో పాల్గఢ్కు వెళ్లే దారిలో ఉంటుంది. ముంబై నుంచి ట్యాక్సీల్లో ఆశ్రమానికి చేరుకోవచ్చు.