బియ్యం ఆరబెట్టుకోవాలి… పెసర్లు, పండు మిరపలు ఎండబెట్టాలి… డాబా మీద బోలెడు చోటు ఉంటుంది. కానీ, తీసుకెళ్లి ఆరబోసే ధైర్యమే ఉండదు. కారణం అక్కడ తిరిగే పక్షులే. హైదరాబాద్‌లాంటి నగరాల్లో ముఖ్యంగా పావురాల బెడద ఎక్కువ. అలాగని చేనులో రైతులా కాపలా కాయాలంటే కాసింత కష్టమే?! మరి, దీనికి పరిష్కారమే లేదా… అంటే, తప్పకుండా ఉంది. అవే ‘రీయూజబుల్ ఫుడ్ డ్రైయింగ్ మెష్’లు. నాణ్యమైన నూలు వస్త్రంతో చేసిన వీటి మీద పల్చటి నెట్ ఉంటుంది. ఈ రెండింటికీ కలుపుతూ చుట్టూ జిప్ వస్తుంది.
మనం ఏవైనా ఎండబెట్టాలనుకుంటే, పై పొరను తెరిచి కాటన్ వస్త్రం మీద వాటిని పరిచి, పైన నెట్ వేసి జిప్ పెట్టేయడమే. దీని గుండా చక్కగా ఎండ పడుతుంది కాబట్టి లోపల ఉన్నవి హాయిగా ఆరిపోతాయి. పురుగులు, పక్షుల్లాంటివి ముట్టుకుంటాయన్న బాధ లేదు. అంతేకాదు, దుమ్ము చేరే అవకాశమూ తగ్గుతుంది. పని అయ్యాక శుభ్రంగా ఉతికి, మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి చిన్నా పెద్దా సైజుల్లో ఇవి దొరుకుతున్నాయి. ఇక, అప్పడమైనా వడియమైనా ఆరబెట్టాలంటే ఆలోచనే అక్కర్లేదు!