బీఎండబ్ల్యూలో బియ్యం కడిగిపెడితే, వోక్స్ వ్యాగన్లో వడియాలు వేయించుకుంటే, బెంజ్ మీద గంజి కాచుకుంటే… పోదూ.. అదిరిపోదూ..! అంతేకాదు, వెస్పాలో ఉప్మా చేసుకొని, రేంజ్ రోవర్లో రసం కాచుకుంటే… వాకిట్లోనే విహరించే ఈ వాహనాలన్నీ వంటింటి తలుపు తడితే…

ఎంత బాగుంటుందో. లగ్జరీకి మారుపేరుగా, లక్ష్మీ పుత్రులకు మాత్రమే అందుబాటులో ఉండే బండ్లు అమాంతంగా పాకశాలలో వస్తువులుగా ప్రత్యక్షమవడం అన్న ఊహే గమ్మత్తుగా ఉంది కదూ! వాహనాలను అమితంగా ఇష్టపడుతూ, భోజనాన్నీ ప్రేమించే డిజిటల్ క్రియేటర్లు ఇప్పుడిలా మోటార్ బండ్లను వంటింటి బండ మీదకు తీసుకొచ్చారు. తమకిష్టమైన కార్లలో తిరగడమే కాదు, తినాలనీ ఆశ పడుతున్నారు.
డిజిటల్ యుగంలో ఊహను కండ్ల ముందుకు తేవడం కడు కష్టమా చెప్పండి. అందుకే, వాటిలోనే వంట చేస్తున్నట్టు అనేకానేక డిజైన్లను సృష్టించి నెట్టింట ప్రదర్శిస్తున్నారు. దాని ఫలితమే ఇక్కడ మనకు కనిపిస్తున్న మెర్సిడెస్ ఇన్స్పైర్డ్ స్టవ్‌లు, రేంజ్ రోవర్ మోడల్ రైస్ కుక్కర్లు, ఫోక్స్‌వ్యాగన్ ఎయిర్ ప్రైయర్లు.
వాటి వాడకం నుంచి క్లీనింగ్ వరకూ, ప్రత్యేక ఫీచర్లు మొదలు పర్యావరణం మీద ప్రభావం వరకూ అన్ని విషయాలూ విశదీకరించి మరీ వెబ్సైట్లలో పెడుతున్నారు. ఇవి కనుక నచ్చి, తయారు చేయాలనుకునే ఔత్సాహికులు తమను సంప్రదించమనీ కోరుతున్నారు. కలలోనిది… నిజమైనది అని అప్పుడు అందరూ పాటకూడా పాడుకోవచ్చు!





