వేడివేడి సూర్యుడికి, చల్లని చంద్రుడికి సంబంధం ఏమిటి? అనుకోకండి. కాలేజీ డ్రాపవుట్ కుబేరుడిగా ఎదిగిన ఓ కథలో మండే సూర్యుడికి, చల్లని ఐస్‌క్రీమ్‌కి మధ్య పెద్ద అనుబంధమే ఉంది. ఆ ఐస్‌క్రీమ్ కంపెనీ పేరు అరుణ్, దాని వ్యవస్థాపకుడు చంద్రమోహన్. పుైల్లెస్ చంద్రగా ప్రయాణం మొదలుపెట్టి ‘ఐస్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ స్థాయికి చేరుకున్నారు అరుణ్ ఐస్‌క్రీమ్స్ వ్యవస్థాపకుడు ఆర్.జి. చంద్రమోహన్. ఎంబీయే సిలబస్‌లో లేని మేనేజ్మెంట్ పాఠమిది, ఐఐఎమ్‌లు చెప్పని విజయ రహస్యమిది.
మూడ్ బాగాలేకపోయినా..
మరీ సంతోషంగా అనిపించినా..
గెలుపు సొంతమైనా..
తీవ్ర పరాభవం ఎదురైనా..
ఆత్మీయులతో సమావేశానికైనా..
ఒంటరితనాన్ని వదిలించుకోడానికైనా..
మన ప్రతి ఉద్వేగంలోనూ ఐస్‌క్రీమ్ ఓ భాగం అవుతున్నది. నిజానికి ఓ ఐస్క్రీమ్ప్రెన్యూర్
తన వ్యాపార ప్రయాణంలో ఇలాంటి ఉద్వేగాలెన్నో అనుభవించాడు. ఆయన పేరు ఆర్.జి. చంద్రమోహన్.
శివకాశీకి దగ్గర్లోని తిరుతంగల్లో పుట్టి పెరిగారు చంద్రమోహన్. ఆ ప్రాంతం అగ్గిపెట్టెల తయారీకి ప్రసిద్ధి. చంద్రమోహన్ జీవితం మాత్రం కారు చీకట్లోనే గడిచింది. నాన్న చిన్న కిరాణకొట్టు నడిపేవాడు. తన కొడుకును బాగా చదివించాలని ఆరాటపడ్డాడు. చంద్రకు గణితం అంటే ఇష్టం. కానీ, ఇంటర్లో లెక్కల్లోనే తప్పాడు. మరో దారి తెలియక.. తండ్రి కొట్టులోనే కూర్చునేవాడు. అంతలోనే ఇరవై ఒకటి నిండాయి. ఆలోచనా పెరుగుతూ వచ్చింది. అంతకంటే మెరుగైన జీవితం కావాలనిపించింది. నాలుగు జతల బట్టలు సర్దుకుని చెన్నై నగరానికి బయలెల్లాడు.
అరుణోదయం
చెన్నైలోని రాయపురంలో ఓ చిన్న ఆవరణ అద్దెకు తీసుకున్నారు చంద్ర. తాతల కాలపు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.12 వేల అప్పు తీసుకున్నారు. మరికొంత జోడించి ఐస్‌క్రీమ్స్ బిజినెస్ మొదలుపెట్టారు. అలా 1970లో ‘అరుణ్ ఐస్‌క్రీమ్’ ప్రస్థానం మొదలైంది. కాలేజీ విద్యార్థులను ఆకట్టుకుంటేనే ఐస్‌క్రీమ్ వ్యాపారానికి మనుగడ ఉంటుందని చంద్ర ఆలోచన. కాలేజీల దగ్గర అమ్మడం కోసం రిక్షాలు, తోపుడు బండ్లు కొన్నారు. చిరు వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని వాళ్లతో అమ్మించేవారు. ఐస్‌క్రీమ్ వ్యాపారంలో ఫ్రాంచైజీ మాడల్ దిశగా అది తొలి అడుగు. కార్ఖానా సరిపోక.. తన పడక గదిలోనే రాత్రిపూట పదివేల ఐస్ క్యాండీలు తయారు చేసేవారు.
అదనపు సంపాదన కోసం కాలేజీ క్యాంటీన్లకు, ఓడ రేవులకు తినుబండారాలు సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఐస్‌క్రీమ్ తయారీకి అవసరమైన నాణ్యమైన పాల కోసం ఏకంగా పాల ఉత్పత్తి దారులతోనే నేరుగా వ్యాపారం సాగించారు. ఐస్‌క్రీమ్ వ్యాపారంలో వాడే ఫ్రిజ్‌లు, సరఫరా వాహనాలను సద్వినియోగం చేసుకుని పనీర్, జున్ను, వెన్న మొదలైన పాల ఉత్పత్తులూ మార్కెట్లోకి తెచ్చారు. అయినా, మార్కెట్లో నిలదొక్కుకోవడం ఏమంత సులభం కాలేదు. అప్పటికే క్వాలిటీ వాల్స్, జాయ్ మొదలైన కంపెనీలు పెత్తనం చేస్తున్నాయి. దీంతో వినూత్నమైన అస్ర్తాన్ని వదిలారు. అప్పటికే రైలు ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసే వ్యాపారం ఉండేది కాబట్టి, ప్రతి భోజనంతో కాంప్లిమెంటరీగా ఐస్‌క్రీమ్ ఇవ్వసాగాడు. అలా ప్రచారం పెరిగింది. అప్పటివరకూ ఎవరూ దృష్టిసారించని గ్రామీణ మార్కెట్లోకి చొచ్చుకు పోయారు.
అనేక సవాళ్లు
ఐస్‌క్రీమ్ తయారీ ఓ విచిత్రమైన వ్యాపారం.
ఉత్పత్తి పెరిగేకొద్దీ నష్టాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు నిలువ ఉండవు. శీతలీకరణ సౌకర్యం లేకపోయినా, ఆ యంత్రాలు పాడైపోయినా.. మొత్తం నీళ్ల పాలే. ఇదంతా అర్థం చేసుకోడానికి చంద్రమోహన్‌కు చాలా సమయమే పట్టింది. ఓపికగా, ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ వచ్చారు. తొలిదశలో హోటళ్లకు సరఫరా చేయడం ద్వారా వ్యాపారం పెంచుకోవాలని అనుకున్నానే కానీ, ఆ ప్రయత్నమూ సఫలం కాలేదు. హోటల్స్ బేరాలు చేస్తాయి. మార్జిన్ కోసం పట్టుపడతాయి. దీంతో ఓ దశలో నష్టపోవాల్సి వస్తుంది.
ఇవన్నీ పక్కనపెట్టి.. నేరుగా కస్టమర్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్ర. నేటి కాఫీడేలను తలపించేలా ఐస్‌క్రీమ్ పార్లర్లను ఆరంభించారు. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ కంపెనీగా అరుణ్ అవతరించింది. తమ సంస్థ నుంచే వచ్చిన ‘ఆరోక్య’ బ్రాండ్ పాల అమ్మకాలూ ఊపందుకున్నాయి.
చంద్రమోహన్‌లోని ఆంత్రప్రెన్యూర్ ఇంతటితో ఆగిపోలేదు. ఇబాకో పేరుతో ఐస్‌క్రీమ్ పార్లర్లను తెరిచారు. ‘అన్లిమిటెడ్ స్కూప్ ఆఫర్’తో కస్టమర్లకు గాలం వేశారు. ఐపీఓకు వెళ్లి అపారమైన నిధులు సమకూర్చుకున్నారు. ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’గా ప్రసిద్ధిచెందారు. భారతదేశంలోని తొలి వంద మంది కుబేరులలో చంద్రమోహన్ కూడా ఒకరు. వారసత్వ సంపద లేదు, ఉన్నతమైన విద్య లేదు. తెలివితేటలు, కష్టపడే గుణంతోనే చల్లని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన. ప్రస్తుతం రెండోతరం పగ్గాలు చేపట్టింది. బ్యాడ్మింటన్, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తున్నారు ఆ పెద్ద మనిషి.
జిహ్వ చాపల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చేవి.. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్. ఈ మూడు రుచులను కలగలిపి ఐస్‌క్రీమ్ కేక్స్‌ను మార్కెట్లో విడుదల చేసిన ఘనత మాదే. ఇలాంటి ప్రయోగాలే మా విజయానికి తొలి కారణం. ఫ్రాంచైజీలతో మా దీర్ఘకాలిక బంధం కూడా వ్యాపారాన్ని చాలా ముందుకు తీసుకెళ్లింది. ‘అరుణ్’ది సమష్టి విజయం.
-చంద్రమోహన్, వ్యవస్థాపకులు, అరుణ్ ఐస్‌క్రీమ్స్