రోజువారీ లైఫ్‌లో యాప్స్ లేకుండా ఉండలేం. చాటింగ్, ఎంటర్టైన్మెంట్, బిల్ పేమెంట్స్… అన్నింటికీ ఫోనే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అయితే, ఈ యూజ్-కేస్ వెనుక పెద్ద రిస్క్ దాగుంది. యాప్‌ని ఇన్స్టాల్ చేసేటప్పుడు, అవి అడిగే పర్మిషన్స్ మన డేటాను మామూలుగా ఊడ్చేయట్లేదు, ఏకంగా బ్రేక్-ఇన్ చేస్తున్నాయి. పర్మిషన్ అనేది ఒక చిన్న బటన్ కాదు, అది మన ప్రైవసీకి తాళం చెవి. కానీ చాలా యాప్స్… అవసరం లేని యాక్సెస్ అడుగుతున్నాయి. ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్ యాప్ మన కాంటాక్ట్ లిస్ట్‌ని ఎందుకు అడగాలి? ఒక గేమింగ్ యాప్ మన లొకేషన్ని ఎందుకు ట్రాక్ చేయాలి? ఇక్కడే అసలు ఫ్రాడ్ మొదలవుతుంది! యూజర్లమైన మనం ఎలో బటన్ నొక్కే ముందు ఆలోచించాలి. యాప్ డెవలపర్స్ కూడా ఎథిక్స్‌తో ఉండాలి. అవసరమైన యాక్సెస్ మాత్రమే అడగాలి.
మొబైల్లో వివిధ రకాల అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసినప్పుడు తెగ పర్మిషన్లు అడుగుతుంటాయి. అవేం పట్టించుకోకుండా చకచకా యాక్సెప్ట్ చేసేయడం చాలామందికి అలవాటు. కానీ, మనమిచ్చే పర్మిషన్స్ వల్ల యాప్ నిర్వాహకులు అందుకునే డేటాతో జరిగే క్రైమ్ లిస్ట్ చాలా పెద్దదే!పర్సనల్ డేటా ఫసక్: మనకు తెలియకుండానే కాంటాక్ట్ లిస్టులు, లొకేషన్ డేటా, సేవ్ చేసిన పాస్వర్డ్లు లాగేస్తాయి.
మాల్వేర్ అటాక్: కొన్ని యాప్స్ మన ఫోన్లో వైరస్లు, మాల్వేర్లను పంపిస్తాయి. ఆ తర్వాత, టోటల్ కంట్రోల్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్తుంది.ఖాతా ఖాళీ: దొంగలించిన డేటాతో యూజర్ల బ్యాంక్ ఖాతాలు కొల్లగొడుతున్నారు ఫ్రాడ్స్టర్లు!ఫిషింగ్ మాస్టర్స్: అనవసరమైన యాక్సెస్‌ను వాడుకుని, బ్యాంకుల్లాగా లేదా పెద్ద కంపెనీల్లాగా మనకు కాల్స్/మెసేజ్‌లు పంపి, మరింత సెన్సిటివ్ డేటాను లాగేస్తారు.
ర్యాన్సమ్వేర్ షాక్: ఫోన్లో ర్యాన్సమ్వేర్ను ఇన్స్టాల్ చేసి, మన ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తారు. ఆ తర్వాత, డబ్బు ఇస్తేనే కీ ఇస్తాం అంటారు.
స్పైయింగ్: మైక్రోఫోన్ లేదా కెమెరా యాక్సెస్ ఉంటే, యాప్స్ మనకు తెలియకుండానే మన మాటలు వినగలవు, స్పై చేయగలవు.
లొకేషన్ ట్రాకింగ్: లొకేషన్ పర్మిషన్ ఉంటే, మన ప్రతి కదలిక ట్రాక్ అవుతుంది. ఇది ప్రైవసీ బ్రీచ్ మాత్రమే కాదు, స్టాకింగ్ లేదా టార్గెటెడ్ క్రైమ్స్‌కి దారి తీయొచ్చు.
సేఫ్‌గా ఉండాలంటే…
కేవలం అఫీషియల్ స్టోర్స్: Google Play Store లేదా Apple App Store నుంచే యాప్స్ డౌన్లోడ్ చేయండి. APK ఫైల్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో
వెళ్లకూడదు.
చెక్ పర్మిషన్స్: యాప్ ఇన్స్టాల్ చేసే ముందు, అది అడిగే పర్మిషన్స్ దాని ఫంక్షన్‌కు మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి.
యాక్సెస్ రివ్యూ: మీరు ఇప్పటికే వాడుతున్న యాప్స్ మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో Exodus Privacy లాంటి టూల్స్‌తో చెక్ చేయండి.
https://reports.exodus-privacy.eu.org/en/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
వీటిని సీరియస్‌గా తీసుకోండి!
బ్రౌజింగ్ భద్రత కోసం..
Ulaa గోప్యతకు గ్యారెంటీ!
ఇప్పటిదాకా ఆన్లైన్ ప్రపంచమంతా క్రోమ్ కంట్రోల్లోనే ఉంది. కానీ, మన బ్రౌజింగ్ డేటాతో ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉంటుంది. మనం ఏ సైట్లో ఉన్నాం? ఏం వెతుకుతున్నాం? ఇదంతా ఎవరు ట్రాక్ చేస్తున్నారు? ఈ భయాల మధ్య, జోహో (Zoho) నుంచి కొత్తగా వచ్చిన ‘Ulaa’ బ్రౌజర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. Ulaa బ్రౌజర్ కేవలం క్లీన్ మాత్రమే కాదు, ప్రైవసీని పీక్స్‌కి తీసుకెళ్లే ఫీచర్స్‌తో లోడై వచ్చింది. ఇది Gen Z కోరుకునే స్పీడ్‌తో పాటు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభవాన్ని ఇస్తున్నది. ఇందులో బిల్ట్-ఇన్ యాడ్స్ బ్లాకర్ ఉంది. ఇది కేవలం పాప్-అప్‌లను ఆపడం మాత్రమే కాదు, ఇంటర్నెట్లో మనల్ని ట్రాక్ చేసే ట్రాకర్లను, మోసపూరిత ప్రకటనలను, మాల్వేర్ను కూడా నిరోధిస్తుంది. సైట్లో ఏం చేస్తున్నామో దాచి పెట్టడానికి ఇది ఒక పవర్ఫుల్ ఫీచర్. చాలా బ్రౌజర్లు మన సెర్చ్ హిస్టరీని, అలవాట్లను రికార్డ్ చేస్తుంటే, Ulaa మాత్రం మినిమల్ డేటా కలెక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నది. Android, iOS, Windows, macOS, Linux అన్ని రకాల పరికరాలలో ఇది పనిచేస్తుంది.
ప్రైవసీ చెక్
మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ప్రతి యాప్‌కు ఇచ్చిన పర్మిషన్స్‌ను (Permissions) చెక్ చేయండి. పనికిరాని యాక్సెస్‌ను వెంటనే ఆఫ్ చేయండి.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్