మా చిన్నప్పుడు ‘పెద్ద మనుషులు’ అనే మాట తరచుగా వినిపిస్తుండేది. పల్లెల్లో అప్పుడప్పుడూ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో.. పొలాల దగ్గర.. ఇంట్లో చిన్నచిన్న తగాదాలు జరుగుతుండేవి. అప్పుడు అందరూ.. ‘ఇగ పెద్దమనుషుల ముంగట్నే తేలాలె. ఉత్తగ ఇనెతట్టు లేరు’ అనుకునేది.
ఎక్కువగాఅన్నదమ్ములు, తండ్రి కొడుకుల ఆస్తి కొట్లాటలో, భూమి పంపకాలో, అమ్మకాలు – కొనుగోళ్లు జరిగినప్పుడు స్టాంపు కాగితం మీద ఒప్పందం రాయించుకోవడానికో మా నాన్న దగ్గరికి వచ్చేవారు. నాన్న పట్వారీ కనుక.. ఆయన మొత్తం రాశాక అక్కడున్న వాళ్లందరికీ వినిపించేలా ఆ ఒప్పంద పత్రాన్ని చదివేవాడు. ఆ సందర్భంగా కావి రంగు ధోతులు కట్టుకుని, పైన అంగీ కూడా లేకుండా చాలామంది వచ్చేవారు. వాళ్లు పాపం.. మా ఇంటి ముందు అరుగుల మీదనో, కిందనో కూర్చునేవారు.
కొందరు మాత్రం కాస్త తెల్లటి ధోతులు, తెల్లటి అంగీలో, కమీజులో వేసుకుని తలకు రుమాలు చుట్టుకుని ఉండేవారు. వాళ్లే ‘పెద్ద మనుషులు’ అని తరువాత తెలిసింది. వాళ్లు మా ఇంటి వరండాలో కర్ర బల్లల మీదనో, రాతి అరుగుల మీదనో కూర్చునేవారు. కొన్నిసార్లు వాళ్లంతా బయటే మాట్లాడుకుని వచ్చేవారేమో.. తొందరగానే రాయడం, చదివి వినిపించడం అయిపోయి సంతకాలు పెట్టేవారు. పదిమందిలో ఎనిమిది మందికి అక్షరాలు రాయడం కూడా రాదు. వాళ్లు వేలిముద్రలు వేసేవారు. పెద్ద మనుషులు సాక్షి సంతకం చేసేవారు.
ఇదంతా ఆదివారమో, సెలవు రోజునో అయితే మేము తలుపుల వెనుక నుంచి ఆసక్తిగా తొంగి చూసేవాళ్లం. కొన్నిసార్లు ఆడవాళ్లు కూడా వచ్చేవారు. వాళ్లు చీరను మోకాళ్ల కింది దాకా గోచి పోసి కట్టి రవిక తొడుక్కునేవారు. చాలామంది జుట్టు దువ్వుకోకుండానే ఊరికే సిగ చుట్టుకునేవారు. బాగా తయారవ్వాలనే శ్రద్ధ ఎవరికీ ఉండేదే కాదు. ఎవరైనా జడ వేసుకుంటే.. ‘అగొ.. సూసినవానవ్వా! జారు జెడేసింది. సోకులు జూడు!’ అని విమర్శించేవారు.
ఎవరెంత అరిచినా.. నాన్న మాత్రం నవ్వుతూ అందరి మాటలూ వినేవాడు. ఆడవాళ్లకు ఏమైనా ఫిర్యాదులుంటే చెప్పమనేవాడు. “మా ముసలాయిన ఉన్నకాడికి భూమిని ముగ్గురు కొడుకులకు పంచిండు. నన్ను ఒక్కమాట అడుగలే! అండ్ల మా అవ్వగారు నాకిచ్చిన ఎకురం భూమిసుత ఉన్నది. మరి రేపటికెల్లి మేము ఏడ ఉండాలె? ఏమి జెయ్యాలె? ఏమి తినాలె?!” అని ఒకసారి ఒకామె అడిగింది.“మేము లేమా అవ్వా?! నీకు, అయ్యకు బుక్కెడు బువ్వ పెట్టమా?!” అన్నాడు ఓ కొడుకు.
“ఆఁ.. పెడ్తరు! నీ పెండ్లం మా మొకాన పెండ నీళ్లు కొట్టకుంటె సాలు” అన్నదామె. నాన్న వెంటనే.. “ఏమయ్యా! మరి ఆమె అడిగింది కూడ న్యాయమే గద! ఆమె భూమి ఆమెకైన ఉంచండి. పెద్దమనుషులూ.. ఏమంటరు?!” అనడిగాడు. చివరికి ఆమె సొంత భూమి మినహాయించి మిగతాది మాత్రమే పంచేటట్టూ, ఆ ముసలాళ్ల తదనంతరం మాత్రమే ఆ భూమి సంగతి చూసేటట్టూ ఒప్పందం మార్చి రాసుకున్నారు. అంతా అయిపోయి వాళ్లు వెళ్లిపోయాక నాన్న లోపలికి వచ్చి.. “ఆడవాండ్లు బాగ మారుతున్నరు, ఆలోచిస్తున్నరు. మంచిదే!” అన్నాడు. నాకెందుకో ఆ మాట బాగా గుర్తుండిపోయింది.
ఇక విడాకులు, ఇళ్లల్లో పంచాయితులు, కొట్టుకోవడాలు, భార్యాభర్తల గొడవలు మాత్రం మా ఇంట్లోకి, నాన్న దాకా వచ్చేవి కావు. కానీ, చాలాసార్లు మా ఇంటి ముందున్న రెండు వేపచెట్ల అరుగుల మీద గుంపులు గుంపులుగా కూర్చుని తేల్చుకునేవారు. అప్పుడు కూడా ఇలాంటి పెద్ద మనుషులే వచ్చేవారు. ఎంత కష్టమైన గొడవైనా రెండు మూడు సిట్టింగుల్లో వాళ్లు తేల్చి వేసేవారు. అయితే ఈ గొడవ పడ్డవాళ్లు సాయంత్రం పెద్ద మనుషులను తీసుకెళ్లి కల్లు తాగించడం, మాంసం తినిపించడం, డబ్బులివ్వడం చేయాలనే విషయం ఎవరో చెబితే ఆశ్చర్యం వేసింది.
పెద్ద మనుషులంటే మరో అర్థం తెలిసింది.. నేను ఎనిమిదో, తొమ్మిదో క్లాసులో ఉన్నప్పుడనుకుంటా! తొమ్మిది, పదో తరగతుల్లో మా క్లాసులో అప్పుడొకరూ, ఇప్పుడొకరూ అమ్మాయిలు సడన్గా పదకొండు రోజులు మాయమయ్యేవారు. పన్నెండో రోజు ఎంతో బిడియపడుతూ, ఏదో తప్పు చేసినట్టు స్కూలుకు వచ్చేవారు. అంతలోనే క్లాసులో గుసగుసలు మొదలయ్యేవి. కొందరైతే మళ్లీ బడికి వచ్చేరోజు ఓణీలు వేసుకొచ్చేవారు. ఎవరైనా రెండు మూడు రోజులు దాటి రాకపోతే.. “హైమావతి ఎందుకొస్తులేదోయ్?!” అనడిగితే.. ఆమె క్లోజ్ ఫ్రెండో, ఇంటి పక్కమ్మాయో “ఏ.. పెద్దమనిషయింది గాదు!” అని చెప్పేది. ఓసారి అమ్మను అడిగి పెద్దమనిషి అవడం ఏమిటో తెలుసుకున్నాను. దాని ప్రకారం ఈ పెద్ద మనుషులయ్యే బాధ్యత, జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవహారం, దానికి సంబంధించిన కష్టం అంతా కూడా అమ్మాయిలకే ఉంటుందనే కఠిన వాస్తవం తెలిసొచ్చింది.
అయితే, ఇప్పట్లా ఫలానా అమ్మాయి పెద్దమనిషి అయిందని ఊరూవాడా తెలిసేలా ఎవ్వరూ గ్రాండ్గా ఫంక్షన్ చేసేవాళ్లు కాదు. ఏ కొద్దిమందో డబ్బున్నవాళ్లు ఓ నగ చేయించి, పట్టులంగా కుట్టించి, దగ్గరి బంధువుల్ని, ఒకరిద్దరు స్నేహితుల్ని పిలిచి ఫంక్షన్ చేసేవాళ్లు. పెద్దమనిషైన తరువాత అమ్మాయిలకు ఆటపాటల్లో అంతకుముందున్న స్వేచ్ఛ తగ్గిపోయేది. అబ్బాయిలతో కలివిడిగా ఉండటం అస్సలే ఉండకపోయేది.
అధిక సంతానం ఉన్నవాళ్లూ, మధ్య – దిగువ మధ్య తరగతివాళ్లూ అమ్మాయి పెద్దమనిషయిందంటే చాలా బెంగపడేవారు. ఎందుకంటే ఇక చుట్టుపక్కల వాళ్లంతా ‘అమ్మాయి పెళ్లెప్పుడు చేస్తరు?’ అని అడుగుతారని! మా దగ్గరి బంధువులకు ఆరుగురు అమ్మాయిలు. కొడుకు పుడతాడని చూస్తూ పోయారన్న మాట. ఆఖరమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు తల్లిదండ్రులతోపాటు అక్కలూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తరువాత అందరి పెళ్లిళ్లూ అయ్యాయనుకోండి. మొత్తానికి మగవాళ్లు అరవై దాటితే గానీ.. లేదా బాగా అనుభవం సంపాదిస్తే గానీ పెద్ద మనుషులు కాలేరు. అమ్మాయిలు పదిహేనేళ్లకే అవుతారు. అదన్నమాట.. పెద్ద మనుషుల సంగతి.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి