Parenting | పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. తమ కలలు పిల్లలు కనాలనుకుంటారు. ఈ క్రమంలో పరీక్షల్లో అనుకున్న స్థాయిలో మార్కులు తెచ్చుకోకపోయినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు నిరాశ చెందుతారు. అది కాస్తా కోపంగా పరిణమిస్తుంది. పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. పోటీ పరీక్షల ఫలితాలు వస్తున్న రోజులు ఇవి. తల్లిదండ్రులు సంయమనంతో వ్యవహరించకపోతే.. పిల్లలు విపరీత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. మార్కులు తక్కువగా వచ్చినా, అనుకున్న ర్యాంకు రాకపోయినా కొంపలు మునిగిపోయేదేం లేదు. అందుకు కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి. లోపం ఎక్కడుందో గుర్తించాలి. దానిని అధిగమించేలా పిల్లలను ప్రోత్సహించాలి. వారిని అనునయిస్తూ మరింత చదివేలా ప్రోత్సహించాలి. మంచి మార్కులు సాధించడానికి ఎలా కృషి చేయాలో సూచనలు చేయాలి.
కొత్త విషయాలు తెలుసుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించాలి. పరీక్షల సమయంలో పిల్లల మానసిక స్థితిని అంచనా వేయాలి. సరైన నిద్ర, పౌష్టికాహారం, వ్యాయామం పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే వీకెండ్ విహారానికి ప్లాన్ చేయండి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించండి. పిల్లలు ఇప్పటికే సాధించిన విజయాలను గుర్తు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పిల్లల్లో ఉండే నైపుణ్యాలను, ఆసక్తిని తెలుసుకుని ఆ దిశగా వారిని నడిపించాలి.