ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో.. అక్కడ దేవతలు నివసిస్తారని మన భారతీయ పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఏ దేశంలో మహిళలు సురక్షితంగా ఉంటారో, ఆ దేశమే నిజమైన అభివృద్ధి సాధించినట్లని ఆధునిక సర్వేలు తేలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ (డబ్ల్యూపీఎస్) ఇండెక్స్-2025 కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటం, వారికి రక్షణగా బలమైన చట్టాలు, సురక్షితమైన వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం లాంటి అంశాలు.. మహిళల భద్రతకు నిజమైన సూచికలని ఈ ఇండెక్స్ చెబుతున్నది. అనేక అధ్యయనాలు, సర్వేల ఫలితాలను బట్టి.. ఆడవాళ్లకు అనుకూలంగా ఉండే దేశాల జాబితాను ఇటీవల ప్రకటించింది.
0.939 ఇండెక్స్ స్కోరుతో.. మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, బలమైన మద్దతు లభిస్తున్నది. లింగవివక్ష, మహిళలపై హింస అనేది భూతద్దం పెట్టి వెతికినాకనిపించదు. ఇక అడుగడుగునా మహిళల భద్రత కనిపిస్తుంది.
మహిళలకు సేఫ్‌జోన్‌గా ఉండే మరో దేశం.. ఐస్లాండ్. ఇక్కడ ఆడవాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ మొదలుకొని అన్ని రంగాల్లోనూ సమానత్వం కనిపిస్తుంది. లింగ వివక్ష, గృహ హింసకు వ్యతిరేకంగా బలమైన చట్టాలు ఉన్నాయి. ఐస్లాండ్ దీర్ఘకాలికంగా నిర్వహిస్తున్న లింగ సమానత్వ విధానాలు, బలమైన సామాజిక విశ్వాసం కూడా.. మహిళలకు అండగా నిలుస్తున్నాయి.
0.924 స్కోరుతో.. నార్వే, స్వీడన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఇక్కడి రాజకీయాలు, న్యాయవ్యవస్థ, పరిపాలనలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. విస్తృతమైన సంక్షేమ ప్రయోజనాలు, సమాన వేతన చట్టం, బలమైన యూనియన్ల మద్దతు అందుకుంటున్నారు. గృహహింస తక్కువగా ఉండటం, మహిళల భద్రతకు పెద్దపీట వేయడం.. ఈ దేశాల్లో చూడొచ్చు. మహిళలపై జరిగే నేరాలకు తక్షణ శిక్షలు ఉంటాయి.
పార్లమెంట్, క్యాబినెట్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న ఫిన్లాండ్.. డబ్ల్యూపీఎస్ ఇండెక్స్-2025లో ఐదో స్థానంలో నిలిచింది. విద్యాసాధనలో మహిళలకు అపార అవకాశాలు కల్పించడంలో, లింగ ఆధారిత హింసను సమర్థంగా నియంత్రించడంలో ఈ దేశం ముందున్నది. సమాజ భద్రతకూ పెద్దపీట వేస్తారిక్కడ. పేరెంటింగ్ లీవ్స్, ఆరోగ్య సంరక్షణ సహా అనేక విషయాల్లో మహిళలకు దన్నుగా నిలిచే చట్టాలు కూడా అనేకం కనిపిస్తాయి.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లగ్జమ్‌బర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియాతోపాటు న్యూజీలాండ్ దేశాలు నిలిచాయి. ఇక స్త్రీని దేవతగా కొలిచే మనదేశం.. ఈ జాబితాలో 131వ స్థానంలో ఉన్నది. మహిళల రక్షణలో బలహీనమైన దేశాలుగా.. ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సూడాన్ దేశాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.