‘ఆపరేషన్ దుర్గం చెరువు’లో మొదటి పిల్లాడిని కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర మిగతా నలుగురిని ఎలా రక్షించుకోవాలన్న దానిపై దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి టీ తీసుకొని..రుద్ర క్యాబిన్లోకి వచ్చాడు. అప్పటికి సీలింగ్‌ను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు రుద్ర
‘సార్ టీ తీసుకొచ్చాను’ అని అన్నాడు. దీంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చిన రుద్ర..
‘బాబాయ్.. అసలు ఆ సైకో ఎవరు? ఇంత తెలివిగా మనతో ఎలా ఆటలాడగలుగుతున్నాడు? ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఎవ్వరం అతన్ని పట్టుకోలేకపోవడం ఏంటి?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో రుద్రను సముదాయిస్తూ.. ‘సార్.. ఇన్నేండ్ల నా కెరీర్లో ఎంతోమందితో కలిసి పని చేశా. అయితే, మీలాంటి చురుకైన, తెలివైన ఆఫీసర్‌ను నేను ఎవ్వరినీ చూడలేదు’ అంటూ రామస్వామి తన మనసులో మాటను చెప్పాడు. ‘ఆ తెలివితేటలే.. ఈ సైకో ఇగోను హర్ట్ చేశాయి బాబాయ్. అందుకే అతని ముందు ఓడిపోవాలని ముందే నిర్ణయానికి వచ్చా. వాడి ఇగోను సంతృప్తిపరిచి, నా ఓటమిని ఒప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ, నేను ఓడిపోయిన మరుక్షణం.. ఆ పిల్లలందర్నీ వాడు చంపేస్తాడు’ అంటూ గద్గద స్వరంతో బాధపడిపోయాడు రుద్ర. ఇంతలో రుద్రకు ఓ ఇంటర్నెట్ కాల్ వచ్చింది. ఐడీ, సర్వర్ లొకేషన్‌ను డిటెక్ట్ చేయిమంటూ సిబ్బందిని పురమాయించిన రుద్ర.. కాల్‌ను రిసీవ్ చేసుకొన్నాడు.
‘వహ్వా.. ఏం రుద్ర సార్.. ఓడిపోవడానికి సిద్ధమయ్యారా? ఓటమిని ఒప్పుకోవడానికి మీకేం ఇబ్బంది లేదా?? కానీ, తప్పుగా ఆన్సర్ చెప్తే ఆ పిల్లలను ఎక్కడ చంపేస్తానోనని కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నారా? ఇక, ఆ ముసలోడు రామస్వామి ఏమన్నాడు? వాడి కెరీర్లోనే నీలాంటి తెలివైన ఆఫీసర్‌ను చూడలేదా? హహ్హా.. నీ తెలివి ఏ లెవల్లో ఉందో నేను చెప్పాలా?… నా కాల్‌ను ట్రేస్ చేయడానికి ఐడీ, సర్వర్ లొకేషన్‌ను డిటెక్ట్ చేయమని నీ బ్రహ్మాండమైన టీమ్‌ను పురమాయించావ్ చూడూ.. అదీ నీ తెలివి. కాసేపు, నీదీ, ఆ ముసలోడు రామస్వామి మధ్య భజన కార్యక్రమం ఆపేస్తే.. మ్యాటర్‌లోకి వద్దామా?’ ఫోన్లో సైకో మాటలను వింటున్న రుద్ర ఒళ్లంతా తడిచిపోయింది. ‘రుద్ర సార్.. ఒళ్లంతా తడిచిపోయినట్టు ఉందికదూ.. స్టేషన్‌కు రావడం కాదు.. నీ టేబుల్ మీద కొత్త వస్తువులు ఏం ఉన్నాయ్? ఏమేం రికార్డ్ అవుతున్నాయ్? వంటివి కూడా కొంచెం చూసుకోవాలి. సరే, ఇప్పుడు టేబుల్ మీద ఉన్న ఆ ఐటెమ్ ఎవరు తెచ్చారు అనే సిల్లీ ఇన్వెస్టిగేషన్‌ను ముందర వేసుకోకుండా పాయింట్‌కు వెళ్దాం. ఓకే నా?’ అంటున్న సైకో మాటలకు రుద్ర నుంచి ‘ఊ..’ అనే సమాధానమే వచ్చింది.
‘ఇక, నీతో ‘టామ్ అండ్ జెర్రీ’ గేమ్ ఆడటం నాకు బోరింగ్‌గా ఉంది. సో.. కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం. అలాగే నీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నా. నీకు పంచతంత్రం కథలంటే చాలా ఇష్టం కదూ.. అందుకే, నిన్ను ఓ 5 ప్రశ్నలను అడుగుతా. ఒక్కో ప్రశ్నకు 5 సెకండ్ల చొప్పున వెయిట్ చేస్తా, ఆలోపు ఆ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అలా అన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ చెప్తే.. నా దగ్గర ఉన్న నలుగురిలో ఇద్దరిని విడిచిపెడ్తా. 5 ప్రశ్నలకు 25 సెకండ్ల టైమ్‌ఫ్రేమ్ దాటినా.. ఒక్క ప్రశ్నకు కూడా తప్పు ఆన్సర్ చెప్పినా.. తెలుసుగా.. నలుగురి పిల్లల శవాలు హుస్సేన్ సాగర్‌లో తేలుతాయ్. జాగ్రత్త. ఇంకో విషయం.. నేను ఫేమ్ అవ్వాలని ఉంది. అయితే, కరెక్ట్ ఆన్సర్లు చెప్పి నువ్వు ఇంకా ఫేమస్ అవుతున్నావ్. ఈసారైనా నాకు ఛాన్స్ ఇవ్వొచ్చుగా ఫ్రెండ్.. హహ్హ..’ అంటూ సైకో కాల్ కట్ చేశాడు.
తనకు పంచతంత్ర కథలు ఇష్టమని సైకోకు ఎలా తెలుసు? తనను ఫ్రెండ్ అంటున్నాడేంటి? అంటూ రుద్రలో కొత్త ఆలోచనలు మొదలవుతుండగానే.. మరో కాల్ వచ్చింది. ‘హాయ్ రుద్ర.. నా ప్రశ్నలు-నీ జవాబులను ఇప్పుడు ఎఫ్ఎమ్లో లైవ్‌లో ప్రసారం చెయ్యి. సిటీ మొత్తం వినాలి. నీ ఓటమిని అందరూ గ్రహించాలి. నేను లైన్లోనే ఉంటా.. రెండు నిమిషాల్లో అన్ని ఎఫ్ఎమ్లలో లైవ్ షో కనెక్ట్ చేయించూ.. యువర్ టైమ్ స్టార్ట్ నౌ’ అంటూ ఫోన్ లైన్లోనే ఉంటూ ఉన్నాడు సైకో. ఇక చేసేదేమీలేక, కంట్రోల్‌రూమ్ సిబ్బంది సాయంతో సైకో లైవ్‌ను ఎఫ్ఎమ్లతో ప్రసారం చేయించాడు రుద్ర. ఈ సైకో గేమ్ గురించి టీవీల్లో అదివరకే చూసిన నగర ప్రజలందరూ ఏం జరుగుతుందోనని ఊపిరి బిగబట్టి వెయిట్ చేస్తున్నారు.
‘రుద్ర.. జాగ్రత్తగా విను.. ప్రశ్న పూర్తవ్వగానే 5 సెకండ్లపాటు వెయిట్ చేస్తా.. ఆలోపు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే, నెక్స్ ప్రశ్నకు వెళ్తా. తప్పు చెప్పావో.. ఇక్కడ పిల్లల ఊపిరితో పాటు నా పంచతంత్రం క్వశ్చన్లు కూడా ఆగిపోతాయి. రెడీయా’ అంటూ సైకో అనగానే.. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటూ సరేనన్నాడు రుద్ర.
‘మొదటి ప్రశ్న.. తీసుకొంటున్న కొద్దీ అంతకంతకూ పెరిగేది ఏమిటీ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. మబ్బులు ఏ రంగులో ఉంటాయో.. మంచు కూడా అదే రంగులో ఉంటుంది. మంచు ఏ రంగులో ఉంటుందో.. నిండు చందమామ కూడా అదే రంగులో ఉంటాడు.. అలాంటప్పుడు తెల్లగా ఉన్న ఆవు ఏం తాగుతుంది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. ‘మూడో ప్రశ్న.. ఒక పడవలో 10 మంది రైతులు, 4 గొర్రెలు, 5 గేదెలు ఉన్నాయి. బరువు కొంచెం పెరిగినా పడవ మునిగే పరిస్థితి. ఇలాంటి సమయంలో మూడు గేదెలు వరుసగా పేడ వేశాయ్. అప్పుడు పడవ మునుగుతుందా? లేదా? ఎందుకు?? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ, టూ..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు.
‘నాలుగో ప్రశ్న.. ఆ రోజు ఆదివారం, అమావాస్య, ఓ ఇరుకు వీధిలో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇంతలో ఓ కండ్లులేని ముసలావిడ ఒంటిపై నల్లటి దుప్పటి కప్పుకొని వెళ్తుంది. అప్పుడే ఎదురుగా ఓ నల్లటి రంగు కారు వస్తుంది. ఆ కారుకు కూడా హెడ్లైట్లు, హారన్ లేవు. అయినప్పటికీ, ఆ ముసలావిడను ఢీకొట్టకుండా కారు పక్కనుంచి వెళ్లిపోయింది. ఎలా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘ఐదో ప్రశ్న అండ్ ఇదే చివరిది.. ఓ ముగ్గురు డాక్టర్లు రాజును తన బ్రదర్‌గా పరిచయం చేశారు. అయితే, తనకు బ్రదర్స్ ఎవరూ లేరని రాజు అంటున్నాడు. ఆ డాక్టర్లు చెప్పేది కరెక్ట్, అలాగే రాజు చెప్పేది కూడా కరెక్టే. ఎలా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ, టూ..’ రుద్ర సమాధానం ఇచ్చాడు. అయితే, ఆ సమాధానం కరెక్టో కాదో చెప్పకుండానే సైకో ఫోన్ కట్ చేశాడు. దీంతో రుద్ర సహా ఎఫ్ఎమ్ను ఫాలో అవుతున్న లక్షలాది మంది ప్రజల గుండె ఆగినంత పనైంది. ఇంతలో రుద్ర ఫోన్‌కు సైకో నుంచి ఓ మెసేజీ.. ‘ఇడియట్.. పంచతంత్రాన్ని పటాపంచలు చేశావ్ కదరా.. ఇద్దరి పిల్లలను విడిచిపెడ్తున్నా.. షామీర్పేట చెరువుకు వెళ్లు’ అంటూ సైకో మెసేజీ పంపించాడు. దీంతో పిల్లల పరిస్థితి ఎలా ఉందోనని సిబ్బందితో షామీర్‌పేటకు ప్రయాణమయ్యాడు రుద్ర. ఇంతకీ సైకో అడిగిన ఆ 5 పంచతంత్ర ప్రశ్నలకు మీరు సమాధానాలు కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు