ప్రేమ కానుకగా ఉంగరానిది ప్రత్యేక స్థానం. గుండె లోపలి ప్రేమను విప్పి చెప్పేందుకు అంగుళీకాన్ని మించిన మాధ్యమం లేదు. అందులోనూ, సరికొత్తగా వస్తున్న ఉంగరాలు.. మీట నొక్కగానే మది గది తలుపుల్లా తెరుచుకుంటాయి. కాబట్టే.. ‘రివీల్ రింగ్’, ‘మూవింగ్ రింగ్’ జువెలరీ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.
తాతమ్మ పెట్టుకుంది. అమ్మమ్మ పెట్టుకుంది. అమ్మా పెట్టుకుంది. మనం కూడా పెట్టుకుంటున్నాం. కాకపోతే, అప్పటిది సాదాగా ఉండే జమీందారీ ఉంగరమైతే,ఇప్పటిది రంగుల్లో మెరిసే మీనాకారీ రింగ్. అంతే తేడా! మిగతా కథంతా సేమ్ టు సేమ్. హస్తభూషణంగా అలంకరించుకోవడమైనా, ఆత్మీయ కానుకగా ఇచ్చుకోవడమైనా.. అప్పటికీ ఇప్పటికీ అదే రీతి. ఇలా కొత్తతరాన్ని ఆకట్టుకునేలా నగల ప్రపంచంలో అడుగు పెట్టాయి.. రివీల్ రింగ్స్ లేదా మూవింగ్ రింగ్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కదిలే ఉంగరాలన్నమాట!
ఇదీ ప్రత్యేకం..
కదిలే ఉంగరాల్లో ఎన్నో రకాలు. వీటిలో అత్యధికంగా ప్రాచుర్యం పొందినవి రొటేషనల్ మూవింగ్ రింగ్స్. ఇవి మొగ్గలా ఉంటాయి. వాటి కింది భాగంలోని అమరికను తిప్పితే పువ్వులా విచ్చుకుంటాయి. ముడుచుకున్నప్పుడు బయట ఒక డిజైన్ కనిపిస్తుంది. తెరుచుకుంటే.. లోపలివైపు పెద్ద రాయి.. చుట్టూ రేకల మీద చిన్నిచిన్ని రాళ్లు పొదిగిన మరో రకం డిజైన్ కనువిందుచేస్తుంది. పురుగు రెక్క విప్పినట్టు కదిలే ఉంగరాలు మరోరకం. అలాగే ‘రివీల్ రింగ్స్’ను తెరిస్తే లోపల హృదయాకారం, అమ్మాయి బొమ్మ, ఫలం, పత్రం.. ఇలా రకరకాల ఆకృతులు కనువిందు చేస్తాయి. వజ్రాలూ రత్నాలూ పొదిగిన బంగారు ఉంగరాలతో పాటు ఫ్యాన్సీ తరహాలోనూ దొరుకుతున్నాయి.