మహాకవి డా.సి.నారాయణరెడ్డి నిత్య చైతన్యశీలి.
‘కర్పూర వసంతరాయలు’ వంటి గేయ కావ్యంతో పాటు,
‘విశ్వంభర’ వంటి ఆధునిక మహా కావ్యాలు
కూర్చిన స్రష్ట. అదే కోణంలో ప్రతి పాటనూ కావ్యంగా
మలచిన సినీకవి. అది వారి ప్రతి పాటలోనూ కనిపిస్తుంది.
‘ఈ నల్లని రాలలో…’ అంటూ కవిత్వమూల్యాలు పొదుముకున్న పాటలు రాసిన సినారె ‘వగలరాణివి నీవే
సొగసుకాడను నేనే…’ లాంటి మత్తెక్కించి…
కవ్వించే కైపు పాటలూ రాశారు.
1963లో వచ్చిన ‘బందిపోటు’ సినిమా సూపర్ హిట్. అందులో ‘వగలరాణివి నీవే..’ పాట ఇంకా పెద్ద హిట్. నాయికను ఆటపట్టిస్తూ కథానాయకుడు పాడే టీజింగ్ పాట ఇది. ఇందులో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ కృష్ణకుమారి. వీరిద్దరిపై వచ్చిన ఈ పాట ఎవర్గ్రీన్ లిస్ట్‌లో నిలిచిపోయింది. ‘బందిపోటు’ దర్శకుడు విఠలాచార్య. అప్పటిదాకా ఆయన సినిమాల్లో హీరో అంటే కాంతారావే! తొలిసారిగా ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా కావడంతో దర్శకుడు అన్ని విషయాల్లోనూ మరింత శ్రద్ధ కనబరిచాడు. ఇక పాట విషయానికి వద్దాం..
పల్లవి
ఒహొహో.. ఓహో… ఓహో..
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడుకుదిరెను మేడ దిగిరావే
వగలరాణివి నీ… వే…
ఘంటసాల తొలుత బాణీ కుదిర్చిన పాటకు తర్వాత వాణి అందించారు సినారె. ఇది రెండు రెండు పంక్తుల రచన. ‘ట్యూన్ బిగువుతోపాటు హమ్మింగ్స్ ఈ పాట విజయానికి ప్రధానంగా దోహదం చేశాయి’ అన్నారు సినారె. తొలి నుంచి మన చలనచిత్రాల్లో కథానాయకుడు.. నాయికను, ఆమె స్నేహితులను ఆటపట్టిస్తూ పాడే పాటలు కొల్లలు. అలా పాడుతూ, ఆమె వెంటపడుతూ గిల్లికజ్జాలు పెట్టుకోవడం లాంటివి కూడా ఉంటాయి. సినారె తన సినీగీత ప్రస్థానం ప్రణయ గీతాలతోనే ప్రారంభించారు. అభ్యుదయం, ప్రగతిశీలమైన పాటలు ఎన్ని రాసినా యుగళగీతాలు వేటికవే సాటి. అటువంటిదే ‘వగలరాణివి నీవే..’. బందిపోటు దొంగ అయిన నాయకుడు, మేడలోని నాయికను గురించి పాడే పాట ఇది. ఇందులో కథానాయిక కాస్త బెట్టుగా ఉంటుంది. నాయకుడిపై ప్రేమ ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తుంటుంది. ఆమె అంతరంగం తెలిసిన కథానాయకుడు.. తన పాటతో ఆమె మదిలోని భావాలను వ్యక్తపరుస్తూ ఆటపట్టిస్తాడు. ‘వగలరాణివి’ అని సంబోధిస్తూ వెంట పడతాడు. నటన చాలించి, తన మాట వినాలని పాట రూపంలో చెబుతాడు. నిజానికి నాయిక మేడలోని దొరసాని. నాయకుడేమో బందిపోటు. మరి వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించాలి? అందుకోసం ఇటువంటి పాటలు కావాలి కదా! అందుకు చక్కని వాతావరణం కుదరాలి. ప్రకృతి పులకరించాలి… అందుకనే పాట చరణాల్లో ఇలా పల్లవించాడు సినారె
చరణం
పిండివెన్నెల నీకోసం
పిల్లతెమ్మెర నా కోసం ॥2॥
రెండు కలిసిన నిండుపున్నమి
రేయి మన కోసం…
వగలరాణివి నీ… వే…
ఎంత అల్లరిపాటైనా.. ఇందులో తన మార్క్ కావ్యభాషతో పాటను కదం తొక్కించాడు సినారె. అందుకే ‘పిండివెన్నెల’ను.. ఇంకా ‘పిల్ల తెమ్మెర’ను తన కవితా వస్తువులుగా మలుచుకున్నారు. పిండివెన్నెల అంటే చిక్కని వెన్నెల అని! ఈ పిండివెన్నెల, పిల్ల తెమ్మెర కలిసిన నిండు పున్నమి వీళ్లిద్దరి కోసం వేచి ఉందట! ఆహా! ఎంత అద్భుతంగా వర్ణించారు కవి.
చరణం
దోరవయసు చినదానా..
కోరచూపుల నెరజాణ…॥దోర॥
బెదురుటెందుకు
కదులు ముందుకు
ప్రియుడనేగానా
వగలరాణివి నీ… వే…
చరణం
కోపమంతా పైపైనే…
చూపులన్నీ నాపైనే.. ॥కోప॥
వరుని కౌగిట ఒరిగినంతట
కరిగి పోదువులే
వగలరాణివి నీవే..
సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడుకుదిరెను
మేడ దిగి రావే… ॥వగల..॥
నాయిక ‘దోర’వయసులో ఉన్న చిన్నది, ఇంకా
‘కోర’చూపుల చిన్నది. అటువంటి చిన్నదానిని బెదరొద్దని, అదరొద్దని అంటూనే నాయకుడు ఆమె కోపాన్ని… చూపుల తాపాన్ని చెబుతాడు. కౌగిట్లో కరిగిపోదువని అంటాడు. ఇవన్నీ ఎందుకటా అంటే తనకు అందనంత ఎత్తున మేడలో నాయిక ఉంది కదా! ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఇదంతా. ‘శివరంజని’ రాగంలో సాగిన ఈ పాట ఆ రోజుల్లో కాలేజీ కుర్రాళ్ల నోట మారుమోగింది. అరవై రెండేండ్లు గడిచినా ఈ పాట ప్రాసంగికత ఇప్పటికీ అంతే ఉండటం గమనించవచ్చు.
గీత రచయిత సినారె ఎంతగా అనుభూతి చెందుతూ రాశారో, అంతే అందంగా దీనిని చిత్రీకరించారు విఠలాచార్య. అదే కోవలో దీనిని గానం చేశారు మధురగాయకులు ఘంటసాల. ఈ పాటపై అభినయం చేసిన ఎన్టీఆర్ కుర్రకారు హీరోగా ఎంతగా హుషారుగా కనిపించారో.. అంతే ‘వగలరాణి’గా కృష్ణకుమారి అబ్బురపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లె పాటను తన వెంట పట్నానికి తెచ్చుకున్న ఈ హనుమాజీపేట బిడ్డ అచ్చతెలుగు పదాలకు, పల్లె ప్రజల మాటలకు కావ్యగౌరవం కల్పించారు. వాటిని వెండితెర మీద మెరిసేలా చేశారు.
…? పత్తిపాక మోహన్