చదువు, సంస్కారం కంటే అందానికే విలువనిచ్చే సమాజం మనది. రంగులోనో, రూపంలోనో కాస్త తక్కువగా ఉంటేనే చులకనగా చూస్తారే! అలాంటిది, ప్రమాదం
కారణంగానో, ఆత్మహత్య ప్రయత్నంలోనో.. కాలిన గాయాలతో కురూపిగా మారిన వారి పరిస్థితి ఏంటి? వారితో స్నేహం, ప్రేమ అటుంచితే.. నేరుగా చూడ్డానికి కూడా
ఇష్టపడరెవరూ! వారిని కుటుంబం ఆదరించదు. సమాజం అంగీకరించదు. మరోవైపు గాయాల తీవ్రత. సర్జరీల మీద సర్జరీలు అనివార్యమైన పరిస్థితి. అలాంటివారిని గుర్తించి, మనోధైర్యం నింపి, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించి అండగా నిలుస్తున్నది ఓ యువతి. పేరు నిహారి. ఆమె గతమూ అలాంటిదే.
నిహారి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఇరవై ఏండ్లకే పెండ్లయింది. ఆ సంతోషం రెండు నెలలు కూడా మిగల్లేదు. శాడిస్టు భర్త హింస తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ హత్యకు ప్రయత్నించింది. అప్పటికే ఆమె గర్భిణి. ఆరు నెలల చికిత్స తర్వాత కోలుకున్నది. మొహంలో కండ్లు తప్ప మిగతా భాగమంతా కాలిపోయి మాంసపు ముద్దగా మారింది. కడుపులోని బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘటన నిహారిని తీవ్రంగా కుంగదీసింది. ‘నాకే ఎందుకిలా? అని రోజుల తరబడి ఏడ్చాను, కుమిలిపోయాను. హాస్పిటల్లో నా పక్క బెడ్ బాధితులతో మాట్లాడినప్పుడు నాలాంటివాళ్లు చాలామంది ఉన్నారని అర్థమైంది. రూపం ఎలా ఉంటేనేం, ఆత్మవిశ్వాసం ఉంటే బతకొచ్చని తెలుసుకున్నాను.
ఈ క్రమంలో నా కుటుంబం పూర్తిగా సహకరించకపోయినా, నాకు చికిత్స అందించిన డాక్టర్ లక్ష్మి ఎంతగానో ప్రోత్సహించారు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది నిహారి. కొంతకాలానికి నిహారి స్వగ్రామానికే చెందిన ఓ యువతి క్షణికావేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అతికష్టం మీద ప్రాణాలతో బయటపడినా.. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వైద్యానికి అవసరమైన డబ్బు కూడా ఆమె కుటుంబం దగ్గర లేదు. ఈ సంఘటన నిహారిని మరింత కలవరపరిచింది. తన వంతుగా ఏదైనా పరిష్కారం వెతకాలని తీర్మానించుకుంది. అలా, ఎనిమిదేండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ‘బర్న్ సేవియర్ మిషన్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాణం పోసుకుంది.
తనలాంటి బాధితులకు ఉచితంగా సర్జరీలు చేయించాలని నిర్ణయించుకుంది. దాతల సాయంతో ఇప్పటివరకు 136 మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. ఇందులో అత్యధికం తెలంగాణ, ఏపీ వాళ్లే. కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాలకు చెందిన బాధితులకూ ఆమె అండగా నిలిచింది. ‘మేం నిప్పు అంటుకున్న మర్రి చెట్టులాంటివాళ్లం. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కాలిన శాతం, ప్రాంతాన్ని బట్టి ఎన్ని సర్జరీలు చేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు. నాకు ఇప్పటికే పది సర్జరీలు జరిగాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నెలలపాటు హాస్పిటల్లో ఉండాలి. రోజూ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు. నిత్యం మందులు వాడుతూనే ఉండాలి. ఇలా ప్రతి రోజూ మాకో సవాలే’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ చెప్పింది నిహారి.

ఎన్నో అవరోధాలు
ఎన్జీవో అయితే ప్రారంభించింది కానీ, ప్లాస్టిక్ సర్జరీలకు డబ్బు ఎలా సమకూర్చాలి? అన్న ప్రశ్న పెద్ద అవరోధంగా మారింది. దానికి జవాబు వెతికే ప్రయత్నంలో అతి తక్కువ ఖర్చుతో సర్జరీ ఎలా చేయాలో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది నిహారి. గతంలో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరే అసిస్టెంట్‌గా చేరింది. అధ్యయనం ప్రారంభించింది.
మరోవైపు కాలిన గాయాలతో హాస్పిటల్‌కు వచ్చేవారిలో ధైర్యం నింపడం మొదలు పెట్టింది. క్రమంగా బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో డాక్టర్లతో, హాస్పిటల్ యాజమాన్యాలతో పరిచయాలు పెరిగాయి. తమ సంస్థ లక్ష్యాలను వారికి వివరించి సాయం అడిగింది. కొన్ని సంస్థలు, కొందరు డాక్టర్లు ఆమెతో చేతులు కలిపారు. ఇప్పుడు.. నిహారి తీసుకొచ్చే బాధితులకు ఉచితంగా ఆపరేషన్ థియేటర్ దొరుకుతున్నది. డాక్టర్లు పెద్ద మనసుతో ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. సర్జరీకి అవసరమయ్యే డిస్పోజబుల్స్, మందులు వంటివి సమకూర్చగలిగితే చాలు. ఆ ఖర్చును సైతం బర్న్ సేవియర్ మిషన్ ట్రస్ట్ భరిస్తున్నది.
ఇన్విజిబుల్..
జర్మనీకి చెందిన ఆమ్ క్రిస్టిన్ అనే ఫొటోగ్రాఫర్ 2014లో ప్రపంచమంతా పర్యటిస్తూ యాసిడ్ దాడి బాధితుల జీవితాలపై డాక్యుమెంటరీ చేశారు. మన దేశానికి వచ్చినప్పుడు, నిహారినీ సంప్రదించారు. ఆమె మానసిక స్థయిర్యానికి మెచ్చుకున్నారు. తన పుస్తకంలో ఆ పోరాటాన్ని వివరించారు. ‘ఇన్విజిబుల్ ఆవిష్కరణ సమయంలో నేను జర్మనీ వెళ్లాను. అక్కడ నన్ను ఒక మామూలు వ్యక్తిగానే చూశారు. నా రూపానికి కాకుండా.. నా ఆత్మవిశ్వాసానికి విలువ ఇచ్చారు. ఛీత్కారాలు, అసహ్యకరమైన చూపుల మధ్య బిక్కచచ్చిపోయిన నాకు.. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపించింది’ అని గుర్తు చేసుకుంది నిహారి.
మన సమాజంలోనూ అలాంటి మార్పే రావాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. ఈ సంవత్సరం కనీసం 25 మంది బాధితులకు ఉచితంగా సర్జరీలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. బాధితులను గుర్తించే పని మొదలుపెట్టింది కూడా. ‘దాతలు పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. కానీ ఆ నిధులు ఏ మూలకూ సరిపోవు. అప్పు కోసం కూడా ప్రయత్నిస్తున్నాం. పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఏదైనా ఒక పెద్ద కంపెనీ సీఎస్ఆర్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటే, ఎంతోమందికి సాయం చేసే అవకాశం కలుగుతుంది’ అని వివరించింది నిహారి. తనకిప్పుడు ఒక కూతురు ఉంది. ఇంటర్ చదువుతున్నది. పేరు స్నేహ. ఆ బాలిక కూడా ప్రమాద గాయాల బాధితురాలే.
తొమ్మిదేండ్ల వయసులో ఇంట్లో దీపం కారణంగా డ్రెస్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ నిరుపేద కుటుంబం పాపను నిహారికి దత్తత ఇచ్చింది. నిహారి జీవిత కథ మలయాళంలో పుస్తకంగా విడుదలైంది. ‘బర్న్ విక్టిమ్స్ అంటే ఇలాగే ఉండాలి.. నాలుగు మంచాలు, వాటిపై పేషెంట్లు.. ఇలా భయానక వాతావరణం ఉండాలని కొందరు అనుకుంటున్నారు. కానీ.. మేం కూడా మనుషులమే. మా శరీరం, మా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. ఆలోచననా దృక్పథం మారితేనే మమ్మల్ని మనుషులుగా చూడగలుగుతారు’ అంటుంది నిహారి. ఆమె పోరాటానికి మనం మద్దతు తెలుపుదాం!
(నిహారి 76809 74918)
…? కాసాని మహేందర్‌రెడ్డి
జి. చిన్న యాదగిరి గౌడ్