ఏసీ గదుల్లో వాసన సాధారణమే. అంతేకాదు తలుపులు, కిటికీలు మూసి ఉంచే గదుల్లోనూ వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు గాలి మారకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక మూసి ఉంచిన గదుల్లో, గోడకు తేమ ఉండే గదుల్లో పెరిగే ఫంగస్, ఆల్గే వల్ల వాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ దుర్వాసన పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెష్నర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, రసాయనాలతో తయారైనవి కాబట్టి, ఇవి గాలిని స్వచ్ఛంగా మార్చకపోగా కలుషితం చేస్తాయి. ఈ గాలిని పీల్చినప్పుడు నవజాత శిశువులు అనారోగ్యం పాలవుతారు. ఆస్తమా, శ్వాస సమస్యలు, అలర్జీ ఉన్నవాళ్లు కూడా ఇబ్బంది పడతారు.
ఇలాంటి సమస్యలు లేకుండా ఏసీ గదుల్లో, మూసి ఉన్న గదుల్లో సువాసన రావాలంటే కాఫీతో కూడా ఎయిర్ ఫ్రెష్నర్లు తయారు చేసుకోవచ్చు. దీనికోసం.. ఒక చిన్న మట్టిపాత్రలో కాఫీ గింజలు, దాల్చినచెక్క, వెనిలా పోయాలి. దీన్ని చిన్నమంట మీద ఉంచితే కాఫీ గింజలు, దాల్చినచెక్క వెనిలాలో ఉడుకుతున్నప్పుడు సువాసన వెదజల్లుతాయి. ఈ సహజమైన ఎయిర్ ఫ్రెష్నర్ ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావు. ఇంకేం ఈ వేసవిలో రసాయనాలతో కూడిన ఎయిర్ ఫ్రెష్నర్స్ వాడకుండా అవసరమైనప్పుడల్లా కాఫీ అరోమాను ఆస్వాదించండి.