పెళ్లి వేడుక కోసం నఖశిఖం సింగారించుకునే నవ వధువు సంప్రదాయ అలంకరణకు కొత్త హంగులూ తోడవుతున్నాయి. వాటిలో స్నీకర్స్ కూడా ఉన్నాయి. పెళ్లికూతురు ధరించే పాదరక్షల్లో చమ్కీలు, రాళ్లు పొదిగినవే ఎక్కువ. మొదట్లో ‘ఫ్లాట్’గా ఉన్నవే ఎంచుకునేవారు. కొన్నేళ్లు ఎత్తుజోళ్ల హవా నడిచింది.
ఇప్పుడిప్పుడే స్నీకర్స్ స్పీడందుకుంటున్నాయి. పెళ్లిలో గంటల తరబడి నిలబడటం, అతిథులను పరామర్శిస్తూ అటూ ఇటూ తిరగడం.. హీల్స్ మీద అయ్యే పని కాదు. అందులోనూ, పెళ్లి కూతురంటే బుట్ట బొమ్మలా సిగ్గుపడుతూ కూర్చునే కాలం కానే కాదు. అందుకనే, వెడ్డింగ్ షాపింగ్‌లో స్నీకర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. సంగీత్‌లో డీజేకి దీటుగా స్టెప్పులేయాలంటే స్నీకర్స్ తొడగాల్సిందే.