వర్షాకాలంలోని తేమ వల్ల ధాన్యం, పప్పు దినుసులపై ఫంగస్, శిలీంధ్రాలు పెరుగుతాయి. కీటకాల దాడి కూడా ఎక్కువ అవుతుంది. ఎంత ఎయిర్‌టైట్ కంటైనర్లలో నిల్వ చేసినా.. కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి.. ధాన్యం, పప్పు ధాన్యాల కంటైనర్లలో కొన్ని బగారా ఆకులు, వేప ఆకులు, లవంగాలు, ఎండిన ఎర్ర మిరపకాయలను ఉంచండి. సహజసిద్ధమైన ఈ పదార్థాలు.. పప్పు ధాన్యాలకు పురుగులు పట్టకుండా కాపాడతాయి. తేమను కూడా శోషించుకుంటాయి.
10-15 రోజులకు ఒకసారైనా.. వాతావరణం పొడిగా ఉన్న సమయంలో పప్పు ధాన్యాలను కొన్ని గంటలపాటు ఆరుబయట ఆరబెట్టండి. తడి వాతావరణం కారణంగా చెక్క అల్మారాలు, ఫ్లైవుడ్ షెల్ఫ్‌లలో బూజు పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ఒక లీటర్ నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి.. ప్యాంట్రీ అల్మారాలను శుభ్రంగా తుడవాలి. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత వంట సామగ్రిని సర్దుకోవాలి.
ఇక నిత్యం చేరే తేమను నివారించడానికి ప్యాంట్రీ అల్మారాల మూలల్లో యాక్టివేటెడ్ చార్కోల్, బేకింగ్ సోడా, వేప ఆకుల పొడిని ఉంచాలి. వర్షాకాలం పూర్తయ్యేదాకా ప్రతి 10-15 రోజులకు ఒకసారి వంటగది షెల్ఫ్‌లను శుభ్రం చేసుకోవాలి.