Indravathi | ఇకనుంచి తాను సిస్టర్ ఆఫ్ మంగ్లీ కానే కాదు. తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. సెలెబ్రిటీ హోదా దక్కింది. గాయనీమణుల జాబితాలో చేరిపోయింది.. ఇందువదన ఇంద్రావతి. హైదరాబాద్‌లో జరిగిన జొమాటో లైవ్ ‘జూమ్లాండ్’ వేడుకలో ఇంద్ర మనసు విప్పి మాట్లాడింది. ఆ ముచ్చట్లు..
నేను అచ్చమైన పల్లెటూరి అమ్మాయిని. ఆటపాటలతో హాయిగా గడిచిపోయింది నా బాల్యం. అక్క మంగ్లీ ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చాను. నిజానికి తను తోబుట్టువు మాత్రమే కాదు.. గురువు, మెంటర్, స్నేహితురాలు.. అన్నీ. అన్నట్టు మాకో చిట్టి చెల్లి కూడా ఉంది. ముగ్గురం కలిస్తే సందడే.
అక్కకు పాటలంటే ఎంతిష్టమో, నాకూ అంతే ప్రాణం. అన్నయ్య గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మా ఇద్దరికీ పాటల్ని పరిచయం చేసింది తనే. ‘మీరు బాగా పాడుతున్నారు’ అని ప్రోత్సహించిందీ తనే . మా అన్నయ్య, అక్కయ్య పట్టుబట్టి నాకు కొద్దిగా సంగీతం నేర్పించారు. ఇంట్లో ఇద్దరు పాటల ప్రేమికులు ఉన్నప్పుడు సరిగమలు అబ్బకపోతాయా? ఆ వాతావరణంలో ఎవరైనా గాయకులు కావలసిందే.
నన్ను అపారంగా ప్రభావితం చేసిన వ్యక్తి మా అక్క మంగ్లీ. నా చదువు దగ్గర నుంచి సంగీత ప్రయాణం వరకు.. వేలు పట్టుకుని నడిపించింది. ఓ మామూలు అమ్మాయి సైతం గాయనిగా పేరు తెచ్చుకోవచ్చని అక్కను చూసే తెలుసుకున్నాను. తనే నాకు స్ఫూర్తి.
నాకు నచ్చిన అక్క పాట.. ‘నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే’. అందులో అపారమైన తాత్వికత ఉంది. మల్కిదాసు రచన ఇది. ఓ లక్షసార్లు వినుంటాను.
ఇక, నాకు నచ్చిన నా పాట ‘బనారస్’ చిత్రంలోని ‘కన్ను తెరిచినా..’. మరిన్ని పాటలు పాడి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పెద్దపెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్‌తో పనిచేయాలని ఉంది. కన్నడ పరిశ్రమ నుంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో హీరో కార్తి చిత్రం కోసం పాడాను. ‘పుష్ప-2’ గురించి ప్రస్తుతానికి నో కామెంట్.