మా చిన్నప్పటి ఇల్లు.. ఊరి చెరువుకు వెళ్లే దారిలో ఉండేది. దాన్ని మా నాన్న వాళ్ల తాతగారి తండ్రి కట్టారట. ఒక ఎకరం స్థలంలో.. నాలుగు మనసాలలు, నాలుగు గదులతో చతుశ్శాల భవంతిగా ఉండేది. వెనుక వంటిల్లు కూడా నాలుగు గదులతో చాలా పెద్దగా ఉండేది.
ఇక ఇంటి ముందు వాకిలికి.. అటూ ఇటూ రెండు అరుగులు బయటి వాళ్లందరూ కూర్చోవడానికి వీలుగా ఉండేవి. నీడనిస్తూ రెండు పెద్ద వేప చెట్లు, ఆ ఆవరణలోనే ఓ పక్కగా పెద్ద పశువుల కొట్టం, మరో పక్కన కొంచెం ఎత్తుగా జగిలి ఉండేవి. దాంట్లో గుమ్ములు, గాబులు, వ్యవసాయ పరికరాలు ఉండేవి. ఇంటి వెనక పెరట్లో బావి, బోలెడు పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. అయితే, ఆ ఇల్లు కట్టి అప్పటికే వందేళ్లు దాటిపోయినందుకో ఏమో.. దూలాలు, వాసాలు, మోగురాలు అప్పుడప్పుడూ కుంగి కిందికి జారిపోతూ ఉండేవి. కొన్నిసార్లు విరిగి వంగిపోతూ ఉండేవి. అలాంటప్పుడు అవి మళ్లీ పడిపోకుండా పోటుగా కర్రలు నిలబెడుతూ ఉండేవారు. ఇంటికొచ్చిన ఊర్లోవాళ్లు.. “గీ ఇంట్ల ఎన్ని దినాలు ఉంటరు! ఇల్లు పడుగు తిరిగిపోయింది. అసొంటి ఇంట్ల ఉండొద్దు. జల్ది కొత్తిల్లు కట్టున్రి” అంటూ ఉండేవాళ్లు.
వర్షాకాలంలో ఇల్లంతా కురుస్తుంటే.. వంటింట్లోంచి గిన్నెలు, బిందెలు తెచ్చి పెడుతుండేవాళ్లం. అవి నిండగానే నీళ్లు గచ్చులో పారబోసి మళ్లీ పట్టేవాళ్లం. గదుల్లో కూడా ఎలుకలు, పంది కొక్కులు మట్టి తోడటం, పైకప్పు నుంచి ఎప్పటికీ మట్టి రాలడం, ఇల్లంతా మట్టిమట్టి అవడం, చెదలు-అలుకు నేల అవడం వల్ల.. ప్రతి శుక్రవారం ఎర్రమట్టితో ఇల్లు అలకడానికి ముందు ఆ గోతులు నింపడం.. ఇన్ని కష్టాలవల్ల కొత్త ఇల్లు కట్టాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదు.
నాన్నకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. దాన్ని వదిలి వేరే ఇంటికి వెళ్లడానికి ఇష్టపడేవాడు కాడు. ఆ పాత ఇల్లు కూలగొట్టి ఆ జాగాలోనే మళ్లీ కడదామని ఆయన మొదట అనుకున్నాడు. కానీ, ఆ ఇల్లు కూలగొట్టడం ఇష్టం లేకనో, మళ్లీ ఆ ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనో కొంచెం దగ్గరలో ఇంకోచోట ఎకరం స్థలం కొన్నాడు. అప్పటికి ఐదేళ్ల కింద అది అమ్మింది మా ఇంటి పక్కనే ఉండే వెలమ సీతారామారావు తాత. కొత్త ఇంటి కోసం బలమైన పెద్ద రాళ్లతో బునియాద్.. అంటే పునాది వేసి ఇల్లు ప్రారంభించాడు. అయితే నాన్న దగ్గర అప్పుడు కొత్త ఇల్లు కట్టేంత డబ్బులు లేక అది అక్కడే ఆగిపోయింది. ఇంటి కోసం అయిదు ఎకరాల పొలం అమ్మాడని మాకు చాలారోజుల తర్వాత తెలిసింది. అప్పుడు నాన్న దిగులుతో రెండు రోజులు అన్నమే తినకుండా బాధపడ్డాడని అమ్మ చెప్పింది. ఆ తర్వాతనే.. మొత్తానికి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. నా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అవగానే.. ఆ ఎండాకాలం మార్చిలో ఈ కొత్త ఇంటి గృహప్రవేశం జరిగింది.
ఈ కొత్త ఇంటి మేస్త్రి మాచర్ల ఐలయ్య. మా ఊరతనే. ఆయన నాగార్జునసాగర్ డ్యాం కట్టినప్పుడు పదహారేళ్ల వయసులో కూలీలా పని చేశాడట. చాలా అనుభవజ్ఞుడు కనుక ఆయనే ఇల్లు మొత్తం దగ్గరుండి స్ట్రాంగ్‌గా కట్టాడు. మామయ్య (మా మేనత్త భర్త, తరువాతి రోజుల్లో నా మామగారు) ఇంటి ప్లాన్ బాగా ఇచ్చారు. ఇంటి నిర్మాణం జరుగుతున్నపుడు కూడా నాన్న పెద్దగా చూసుకోలేదట. ఇప్పటిది స్లాబ్ పోసి కట్టిన డాబా ఇల్లు. ఇల్లు కూడా పెద్దదే. ఐదు చిన్న గదులు, మూడు పెద్ద గదుల్లాంటి హాల్స్. ఇప్పటి రోజుల్లో అయితే వాటిని హాల్స్ అనలేం. అందులోనూ, ముందూ వెనకా గ్రిల్ వాల్స్ పెడదామని అలాగే వదిలేసారు గనుక అవి వరండాలే! దాంతో ఇంట్లో కూడా మొత్తం ఎండ వెలుతురు ఉండి, బయట ఉన్నట్టుగానే ఉండేది. ఆ ఇంటి నుంచి కొత్త ఇంటికి వచ్చిన మాకు.. ఇల్లు చాలా చిన్నగా అనిపించి, అసలే మాత్రం నచ్చలేదు.
పాత ఇంటిలోలాగా పెద్ద వంటిల్లు కట్టాలనీ, ధాన్యం నిలువచేయడానికి ఓ గది కట్టాలనీ, ఇంకా ఎన్నో చేయాలని నాన్న కోరిక. “బునియాద్ ఏసి ఐదేండ్లు దాటింది, ఇంగెప్పుడు కడుతరు?” అని అందరూ తొందర పెట్టడంలో హడావుడిగా ఇల్లు కట్టి మొత్తానికి గృహప్రవేశం చేశారు. ఈ కొత్తింటిలో బాత్రూం, లెట్రిన్ కట్టలేదు. వాటి కోసం టెంపరరీగా చుట్టూ మొద్దు రాళ్లు పేర్చి తడికలు కట్టారు. కాంపౌండ్ వాల్ కూడా పూర్తి కాలేదు. అయిదేళ్ల తరువాతనే ఆ పనులు పూర్తయ్యాయి. ఈ ఇంటికి మా పాతింటిలాగానే కరెంటు కూడా లేదు. మూడేళ్ల దాకా మేము మునుపటిలానే ఎక్కదీపాలు, కందిళ్లతో గడిపాము.
గృహప్రవేశానికి చాలామంది చుట్టాలు వచ్చారు. అంతేకాదు.. ఊర్లో వాళ్లలో చాలామందికి, ఆసాములకు నాన్న ఆ మర్నాడు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఇల్లు చాలా అందంగా, ఎత్తులో ఉందనీ, గాలి వెలుతురూ ధారాళంగా వస్తుందనీ, చూసిన వాళ్లందరూ మెచ్చుకున్నారు. పైగా, ఏ గదిలోంచైనా బయటికి వెళ్లడానికి దర్వాజాలు ఉండటమే కాదు.. వాటికి అందంగా చిన్న బాల్కనీలాగా చేసి మెట్లు కట్టాడు ఐలయ్య.
ఇక ఆ కొత్త ఇంటి మరిన్ని సంగతులు.. అక్కడ మేము పడ్డ ఇబ్బందులు, పాత ఇంటి మమకారపు ముచ్చట్లను వచ్చేవారం చెప్పుకొందాం!
నెల్లుట్ల రమాదేవి రచయిత్రి