మూడుముళ్లు పడగానే..మహిళఇంటికే పరిమితం కావాలా? కుటుంబానికే అంకితమైపోవాలా? కన్న కలలు,సాధించాల్సిన లక్ష్యాలు.. అన్నీ మరిచిపోవాల్సిందేనా? ‘కానే కాదు..’ అంటున్నారు ‘మిసెస్ ఇండియా 2022-23’ఫస్ట్ రన్నరప్ కిరణ్మయి అలివేలు.వివాహం కెరీర్‌కు అడ్డంకి కాదని ప్రపంచానికి చాటుతున్నారామె.
ఏదైనా పోటీలో పాల్గొంటే.. గెలిస్తే విజేతగా నిలుస్తాం, ఓడిపోతే పరాజితులం అవుతాం. నలుగురికీ రోల్మాడల్లా నిలవాలంటే మాత్రం కొంత రిస్క్ తీసుకోవాలి. ఎక్కువ కష్టపడాలి. కిరణ్మయి అలివేలు చేసింది అదే. మిసెస్ ఇండియా పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా వెనుదిరిగినా.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కారణం.. ఆమె జీవితం. బాల్యం నుంచే కష్టాలు ఎదురైనా.. తట్టుకుని నిలిచి, గెలిచారామె. మనిషి గట్టిపడటానికి కొన్నిసార్లు సమాజం, మరికొన్నిసార్లు పరిస్థితులు కారణం అవుతాయి. తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు కిరణ్మయి భుజానపడ్డాయి.
నాన్న నడిపిన వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితితో ఫిట్నెస్ రంగంవైపు వెళ్లారు. అప్పుడెప్పుడో అందుకున్న ఫిట్నెస్, యోగా సర్టిఫికెట్లే అర్హతగా ఓ జిమ్ ఆపరేషన్స్ విభాగంలో చేరారు. సినిమా, సీరియల్ అవకాశాలు వచ్చినా.. ఎందుకో అటువైపు అడుగులు పడలేదు. అంతలోనే వైవాహిక జీవితం ప్రారంభమైంది. అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఎంచుకున్న రంగంలోనే కొనసాగమని ప్రోత్సహించాడు. ప్రస్తుతం, హైదరాబాద్‌లోని ఓ పెద్ద జిమ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు కిరణ్మయి. అక్కడితో ఆగకుండా అందాలపోటీ వైపు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే 2019లో మిసెస్ తెలంగాణగా నిలిచారు.
పుట్టింటి పేరు..
పెండ్లితో ఆడవాళ్ల ఇంటిపేరు మారిపోతుంది. కిరణ్మయి మాత్రం ఇంటిపేరును మార్చుకోలేదు. చిన్న వయసులోనే తండ్రిని, ఆ తర్వాత తల్లిని కోల్పోవడంతో.. కనీసం ఇంటిపేరైనా తనతో ఉంచుకుంటానని భర్తకు చెప్పారు. ఆయన సరేనన్నారు. మనం సామాన్యులుగా ఉన్నప్పుడు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. కానీ మనకంటూ గుర్తింపు వచ్చాక.. అందరి దృష్టి ఇటువైపే ఉంటుంది. అందుకే, నలుగురికీ మేలు చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరిస్తారు కిరణ్మయి. ఆ ప్రయత్నంలోనే ఉచిత జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ.. చాలామందికి ఉపాధి చూపారు.
అంతర్లీన సౌందర్యం
రాజస్థాన్ వేదికగా జరిగిన మిసెస్ ఇండియా 2022-23 పోటీల్లో మొత్తం 50 మంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందులో కిరణ్మయి రెండోస్థానంలో నిలిచారు. గతంలో కూడా ఆమె ‘మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్’ టైటిల్ అందుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వ్యాయామం, యోగా, సమతులాహారం.. తన ఆరోగ్య రహస్యాలని చెబుతారు. అందం అంటే బాహ్య ప్రపంచానికి కనిపించే తళుకుబెళుకులు కాదనీ.. మనసు లోలోతుల్లో ఉంటుందని అంటారామె. మన వ్యక్తిత్వం, మనలోని మానవత్వం, సాయంచేసే గుణం, ఉన్నతంగా ఆలోచించేతత్వం, సాటి
వారిని ప్రేమించడం, గౌరవించడం.. హృదయ సౌందర్యాన్ని ఇనుమడిస్తాయని విశ్లేషిస్తారు.
…? ప్రవీణ్ కుమార్ సుంకరి
ఎం.గోపీకృష్ణ