దట్టమైన అడవులు. గర్జించే సింహాలు. నల్లని, దృఢమైన దేహాలు కలిగిన మనుషులు. ముషిండో డ్రమ్స్కు అనుగుణంగా చేసే నృత్యాలు. ఇవన్నీ ఆఫ్రికా పల్లెల్లో సర్వసాధారణంగా దర్శనమిచ్చే దృశ్యాలు. కానీ, భారత్లోని ఓ పల్లెలోనూ ఎక్కడ చూసినా అదే ఆఫ్రికా సంస్కృతి కనిపిస్తుంది! అదే.. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న జాంబుర్. అక్కడికే ఈవారం మన పల్లె‘టూర్’!

భారత్ అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం! ఎన్నో రకాల జాతులు నిలయమిది. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంస్కృతి కనిపిస్తుంది. కానీ, గుజరాత్లోని ఓ పల్లె మాత్రం ‘మినీ ఆఫ్రికా’లా దర్శనమిస్తుంది. సుప్రసిద్ధ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ అభయారణ్యం నడిబొడ్డున ఉంటుంది జాంబుర్ గ్రామం. ఈ పల్లెలో అడుగుపెడితే.. ‘ఆఫ్రికాలో ఉన్నామా!?’ అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇక్కడివాళ్లంతా ఆఫ్రికన్ల వారసులు. ‘సిద్ధీ’ తెగకు చెందినవారు. వీళ్ల పూర్వికులు కొన్ని శతాబ్దాల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశానికి వలస వచ్చారు.
ఇదీ నేపథ్యం
ఏడో శతాబ్దంలో వందల సంఖ్యలో ఆఫ్రికన్లు భారత్ బాటపట్టారు. బానిసలుగా, వ్యాపారులుగా, నావికులుగా, సైనికులుగా ఇటు వచ్చారు. అరబ్బుల కాలం నుంచి బ్రిటిషర్ల జమానా వరకూ.. సిద్ధీల రాక కొనసాగింది. ఈ క్రమంలో జునాగఢ్ను పాలించిన నవాబులు కూడా కొందరు ఆఫ్రికావాసులను భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారట. అలా వచ్చినవారంతా ఇక్కడే స్థిరపడ్డారు. 16వ శతాబ్దం తర్వాత వీరి జనాభా గణనీయంగా పెరగడంతో.. వారికంటూ ఓ సొంత గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Jambur
రెండు సంస్కృతుల సమ్మేళనం..
జాంబుర్ గ్రామంలో ఆఫ్రికన్-గుజరాతీ సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. గ్రామస్తుల జీవన విధానం కూడా.. రెండు ఖండాల అద్భుతమైన కలయికగా ఉంటుంది. ఆఫ్రికన్ల వారసులు అయినప్పటికీ.. జాంబుర్ వాసులంతా గుజరాతీలోనే మాట్లాడతారు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు కూడా గుజరాతీ శైలిలోనే ఉంటాయి. అయితే, వీరిలో ఇప్పటికీ ఆఫ్రికన్ వారసత్వం సజీవంగానే ఉన్నది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. వారి సాంప్రదాయ ‘ధమాల్’ నృత్యం! ఒంటికి రంగులు పూసుకుని, అత్యంత వేగంగా, లయబద్ధంగా చేసే ఈ నృత్యం.. ఆఫ్రికన్లకే సొంతం. ఈ ధమాల్ నృత్యంలో మరో ప్రత్యేక ఆకర్షణ.. ముషిండో అని పిలిచే ఆఫ్రికన్ డ్రమ్స్! జాంబుర్ వాసుల ఈ సంప్రదాయ నృత్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ఇక జాంబుర్వాసుల జీవనాధారం. గిర్ అడవులకు వచ్చే పర్యాటకులకు గైడ్లుగానూ కొందరు పనిచేస్తుంటారు.
ఇలా వెళ్లాలి..
సాసన్ గిర్ నుంచి 20 కిలోమీటర్లు, ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో జాంబుర్ గ్రామం ఉంటుంది. జునాగఢ్, వెరావల్, రాజ్కోట్, అహ్మదాబాద్ నగరాల నుంచి తలాలా, సాసన్ గిర్కు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీల్లో జాంబుర్ గ్రామానికి చేరుకోవచ్చు.




Jambur