తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయికల్లో ఒకరు శ్రీ గౌరి ప్రియ.
మెయిల్ వెబ్‌సిరీస్‌తో సత్తాచాటి తమిళంలో ‘ట్రూ లవర్’ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిందీ భామ. వరుసగా విభిన్న
పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ తెలుగమ్మాయి ఇటీవలే ‘హ్యాపీ రాజ్’ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నటుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘ చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నది. ఈ సందర్భంగా ఆ అమ్మడు పంచుకున్న కబుర్లు ఇవి.
నాకు చిన్నప్పటి నుంచీ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. కొంత కాలం యాంకర్‌గా పనిచేశాను.ఆ తరువాత కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. అయితే 2018లో
‘మిస్ హైదరాబాద్’ టైటిల్ గెలిచిన తరువాతే అవకాశాలు తలుపుతట్టాయి.
ఇద్దరం తెలుగువాళ్లమే కావడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ సాఫీగా సాగింది. కష్టపడి పైకొచ్చిన ఈ తరం వారిలో కిరణ్
అబ్బవరం ఒకరు. ఆయనంటే నాకు గౌరవం. సోషల్ మీడియాలో గంటలకొద్దీ గడపను కానీ నచ్చిన అంశాలు, ఫొటోలు మాత్రం షేర్ చేస్తుంటాను.
మూడేళ్ల క్రితం మా అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఆమె కేవలం తల్లిగానే కాకుండా ఒక మంచి స్నేహితురాలిగా ఉండేది. ఆమె మరణంతో కొంతకాలం తీవ్రమైన మనోవేదనకు గురయ్యాను. ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాలోని ‘వదలనే’ పాట విన్నప్పుడల్లా అమ్మే గుర్తొస్తుంది. ఈ లిరిక్స్‌ను ఎవరికి అంకితం చేస్తారని యాంకర్ అడగగానే ఈ పాటలోని లైన్స్‌ను అమ్మకే అంకితం చేస్తానని చెప్పాను. ఆ మాటలకు అక్కడున్నవారంతా నా బాధను అర్థం చేసుకొని నా తోడుగా నిలిచారు.
సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదని నా అభిప్రాయం. తమిళ హీరోలతో ఉన్నట్లు తెలుగు హీరోలతో సన్నిహితంగా ఉండనని కొంతమంది నన్ను గతంలో అడిగారు. బహుశా తెలుగులో నేను చేసిన పాత్రల వల్ల అలా అనిపించి ఉండొచ్చు. అది కేవలం యాక్టింగే కదా! అంతేగానీ తమిళ సినిమాల్లో సంతోషంగా ఉండి తెలుగులో ఏడ్చే పాత్రలను కావాలని తీసుకోను కదా!
నేను తెలుగమ్మాయినైనా.. నాకు మొదటగా గుర్తింపు వచ్చింది తమిళ చిత్రాలతోనే. నా కెరీర్లో తొలి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నది కూడా ఓ తమిళ సినిమాకే. ‘లవర్’ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డు అందుకున్నాను. ఆ సమయంలో ఎంతో సంతోషం కలిగింది. ఆ క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. ‘ట్రూ లవర్’ సినిమా చేసేటప్పుడు భాష ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు తమిళ్ నేర్చుకున్నాను. ప్రస్తుతం కంటెంట్ అనేది కీలకంగా మారింది. కథ బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడింది.
సామాజిక మాధ్యమాల ధోరణి విపరీతంగా అనిపిస్తున్నది. సినిమాల్లో క్యారెక్టర్లను కూడా వదలట్లేదు. ‘ట్రూ లవర్’లో నేను, మణికందన్ విడిపోయే విషయంలో నా స్నేహితురాలిగా నటించిన హరిని సలహా అడిగితే ఆమె విడిపొమ్మని చెబుతుంది. దీంతో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేశారు. చివరకు అసభ్యంగా తిట్టడం మొదలు పెట్టారు. అలాంటివి చేయడం వల్ల నటులుగా మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.