మైక్ ఫ్రీమాంట్.. అమెరికాకు చెందిన ఓ వృద్ధతేజం! సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు! 104 ఏళ్ల వయసులోనూ నవతరంతో పోటీ పడుతున్నాడు. 69 ఏళ్లకు క్యాన్సర్ బారినపడ్డ ఫ్రీమాంట్.. జీవనశైలి మార్పులతోనే ఆ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. మొక్కల ఆధారిత ఆహారం, నడకే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నాడు.
అమెరికాలోని సిన్సినాటి నగరంలో 1922లో పుట్టాడు మైక్ ఫ్రీమాంట్. ప్రస్తుతం ఆయన వయసు 104 సంవత్సరాలు. ఈయన్ని చూస్తే.. ఏళ్లు గడుస్తున్నా, వయసు తగ్గుతున్నదేమో అనిస్తుంది. వయసు పెరిగేకొద్దీ అందరూ నెమ్మదిస్తుండగా.. మైక్ మాత్రం అలసట లేకుండా మెట్లు ఎక్కుతాడు. 98 ఏళ్ల వరకూ యువకులతో పోటీ పడుతూ రన్నింగ్ రేస్‌లలో పాల్గొన్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్.. సరళమైన జీవనశైలి, క్రమశిక్షణతోపాటు స్థిరత్వమే తన ఆరోగ్యానికి కారణమని చెప్పుకొచ్చాడు. మైక్‌కు 69 ఏళ్లు ఉన్నప్పుడు క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కేవలం మూడు నెలలు మాత్రమే బతుకుతావని వైద్యులు చెప్పారట. దాంతో ఆయన శస్త్రచికిత్సకు బదులుగా.. ‘మిచియో కుషి’ రాసిన ‘ది క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్’ ద్వారా ప్రేరణ పొంది, మొక్కల ఆధారిత డైట్‌కు మారాడు. కాలక్రమేణా అతని ఆరోగ్యం మెరుగుపడింది. క్యాన్సర్, ఆర్థరైటిస్ లక్షణాలు కూడా దూరమయ్యాయని వెల్లడించాడు.
ఆహారమే తన రోజువారీ ఔషధమని అంటాడు మైక్. 1994 నుంచి శుభ్రమైన మొక్కల ఆధారిత ఆహారాన్నే తీసుకుంటున్నాడు. బ్రౌన్ రైస్, కాలే, క్యాబేజీ వంటి ఉడికించిన ఆకుకూరలు, బీన్స్ తీసుకుంటాడట. గుండెకు మేలుచేసే, రోగ నిరోధకతను పెంచే పదార్థాలకు పెద్దపీట వేస్తాడు. చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులకు తన డైట్లో చోటు లేదంటాడు. ప్యాక్ చేసిన, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు అల్లంత దూరంలో ఉంటాడు. అయితే, దాదాపు 100 ఏండ్ల దాకా ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన మైక్.. రోజువారీ వ్యాయామాలు కూడా చేయలేదట. బదులుగా..
తనకు ఇష్టమైన పనిచేస్తూ, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం ద్వారానే చురుకుగా ఉన్నాడట. ఒకప్పుడు వారానికి మూడుసార్లయినా 10 మైళ్లు పరిగెత్తేవాడట. రోజుకు 50 మెట్లు ఎక్కేవాడట. నిద్రకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకే మంచంపైకి చేరుకుంటాడు. తొమ్మిది గంటలపాటు కమ్మగా నిద్ర పోతాడు. ప్రకృతికి దగ్గరగా, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. రసాయనాలకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం.. మైక్ ఆరోగ్యాన్ని మరో మెట్టు ఎక్కించింది. 104 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా కనిపిస్తున్న మైక్‌ను, అతని జీవనశైలిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.