మిద్దె తోట అనగానే సూర్యాపేట ప్రజలకు నల్లపాటిమమతే గుర్తు కొస్తారు. తన రూఫ్ గార్డెన్లో నిత్యం మూడు నాలుగు కిలోల సేంద్రియ కూరగాయలతోపాటు పూలు, పండ్లు పండిస్తారామె.ముప్పూటలా వాటితోనే వంటలు. మిగిలినవాటినిఓ పది కుటుంబాలకు ఉచితంగా అందిస్తారు. ‘మిద్దెతోట నా కుటుంబ ఆరోగ్య రహస్యం. ఇదే నాకువ్యాయామం, ధ్యానం, యోగా..’ అంటారు మమత.నాలుగేండ్ల క్రితం ఈ పచ్చని ప్రపంచాన్ని సృష్టించారామె.
ఎటుచూసినా కాలుష్యం. విషతుల్యమైన ఆహారం. రసాయనాలలో ముంచితేల్చిన కూరగాయలు.. ఏది కొనాలన్నా భయం. ఫలితంగా క్యాన్సర్ సహా అనేకానేక ప్రాణాంతక రుగ్మతలు. దీంతో జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. గత కొద్దికాలంగా పంటల తీరులోనూ మార్పు కనిపిస్తున్నది. పట్టుబట్టి సేంద్రియ పంటలు సాగు చేస్తున్నారు. అందులోనూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇదో ఉద్యమంలా సాగుతున్నది. ఇక్కడ సబ్సిడీపై వ్యవసాయ సామగ్రిని అందిస్తున్నారు. దీంతో, టెర్రస్‌పై ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలాల్లోనే రూఫ్ గార్డెన్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తున్నారు స్థానికులు. ఆ ప్రయత్నంలో ఉన్నవారికి నల్లపాటి మమత ఓ రోల్ మాడల్. ఏ చిన్న సందేహం వచ్చినా ఆమెను సంప్రదిస్తారు. సలహాలు తీసుకుంటారు. మమత కూడా ఓపికగా సమాధానాలు ఇస్తారు. అవసరమైతే తన దగ్గరున్న విత్తనాలు, ఎరువులు అందిస్తారు. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు తాజా బెండకాయలో, వంకాయలో చేతిలో పెడతారు.
రోజూ నాలుగు కిలోలు..
మమత తన టెర్రస్ గార్డెన్లో రోజుకు నాలుగైదు కిలోల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. ఈ విజయం వెనుక స్థానిక సంస్థ చొరవ చాలా ఉంది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అనుకునేవారు రూ.1,500 డిమాండ్ డ్రాఫ్ట్ జతపరుస్తూ.. దరఖాస్తు చేస్తే చాలు. పదివేల రూపాయల విలువైన విత్తనాలు, కంపోస్టు , వేపనూనె, కంపోస్టు తయారీ బిన్లు, తొట్లు, మట్టి అందిస్తారు. ఆ ప్రోత్సాహం చూసే మమతకూ ఉత్సాహం వచ్చింది. పొదుపు చేసుకున్న డబ్బుతో మిద్దె సేద్యాన్ని మరింత విస్తరించారు. ఆమె టెర్రస్ గార్డెన్లో ఇప్పుడు సొర, బీర, కాకర, దోస, బెండ, టమాట, పచ్చిమిర్చి, మునగ, వంకాయ, చామగడ్డ, చిక్కుడు తదితర కూరగాయలతోపాటు.. పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతి, పుదీన, గోంగూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలు పండుతున్నాయి. జామ, దానిమ్మ, సపోటా, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వగైరా ఫలాలూ పండిస్తున్నారు. ఆ స్వచ్ఛమైన ఆర్గానిక్ పంటల్ని చుట్టుపక్కల వారితో పాటు బంధుమిత్రులకూ ఉచితంగా పంచుతారు. ‘మనం బావుండాలి. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు’ అంటారామె.
పచ్చని సత్కారాలు
మమతను చూసి పొరుగింటివారు, పక్కింటివారు, చుట్టుపక్కల కాలనీల ప్రజలు.. ఇలా చాలామందే స్ఫూర్తి పొందారు. ఆమె చిత్తశుద్ధికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. ఇంటిపంట విజేతగా మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు. రైతునేస్తం ఫౌండేషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ సేవా పత్రం అందుకున్నారు. మున్సిపల్-అటవీ శాఖల ఆధ్వర్యంలో సన్మానాలు పొందారు. ‘కుటుంబ ఆరోగ్యం గృహిణి బాధ్యత. ఆమె కనుక పూనుకుంటే.. ఏ రోగాలూ గడప దాటి లోపలికి రాలేవు. మిద్దెతోట ప్రతి ఇంటికీ ఓ రక్షణ కవచం’ అని హితవు చెబుతారు మమత.
రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాల్ని తెచ్చి పెడుతున్నాయి. ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారం. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే.. కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు .. డాబా పైనే పండించుకోవచ్చు. వాడేసిన టీపొడి, కోడిగుడ్డు పొట్టు, కుళ్లిన పండ్లు, బియ్యం కడిగిన నీళ్లు.. ఇవన్నీ పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి. నేలతల్లిపై వ్యర్థాల భారాన్ని తగ్గించినవాళ్లమూ అవుతాం.
…?గుండా శ్రీనివాస గుప్త
సైది రెడ్డి