చిత్త వైకల్యాన్ని సకాలంలో నిర్ధారించడం.. ప్రధాన సవాలుగా మారుతున్నది. మనిషి జ్ఞాపకశక్తిని దెబ్బతీసే ఈ మానసిక రుగ్మత.. చాలా ఆలస్యంగా బయటపడుతున్నది. లక్షణాలు కనిపించినా.. సంపూర్ణంగా నిర్ధారించడానికి సగటున మూడున్నరేండ్ల సమయం పడుతున్నది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రీ’లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
డైమెన్షియా నిర్ధారణపై ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్’లోని సైకియాట్రీ విభాగానికి చెందిన పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనాలో ఇంతకుముందే ప్రచురితమైన 13 అధ్యయనాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 30,257 మందికి చెందిన డేటాను సమీక్షించారు. ఇందులో భాగంగా.. చిత్త వైకల్యం ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తున్నదని గుర్తించారు. చాలా దేశాలలో రోగ నిర్ధారణ సరిగ్గా జరగడం లేదని చెబుతున్నారు. చిత్త వైకల్యం ప్రారంభ దశలో జ్ఞాపకశక్తి కోల్పోవడం, పదాలను కనుగొనడంలో ఇబ్బంది, గందరగోళంతోపాటు మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయని అధ్యయనకారులు పేర్కొంటున్నారు.
చాలామంది ఈ డైమెన్షియా లక్షణాలను సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా భావిస్తున్నారనీ, దాంతో వారికి సరైన వైద్యసాయం అందడం లేదని అంటున్నారు. కొందరిలోనైతే.. రోగ నిర్ధారణకు 4.1 ఏళ్లు పట్టవచ్చునని పేర్కొంటున్నారు. దాంతో బాధితులకు మెరుగైన చికిత్స అందించడం ఆలస్యమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నివారించడానికి.. డైమెన్షియా ప్రారంభ లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనీ, చిత్త వైకల్యం ఉన్న వ్యక్తులు, వారి కుటుంబాలు అవసరమైన సహాయం పొందగలిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేయడం వల్ల మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.