జీవితం రంగురంగుల హరివిల్లులా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఆ రంగులు మన మనసుపైనే కాదు జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తాయంటే నమ్ముతారా? అవును, వివిధ వర్ణాలు మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ఆనందాన్ని మారుస్తాయి. దీనికి సంబంధించి ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు జరిగాయి. అవన్నీ కూడా రంగులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తేల్చాయి. క్రోమో థెరపీ (కలర్ థెరపీ)తో మనిషిలో మార్పులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు.
లివింగ్ స్పేస్: ఇల్లు, ఆఫీసు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడైనా మనం ప్రశాంతతనే కోరుకుంటాం. అందువల్ల ఆయా ప్రదేశాల్లో నీలి రంగు, ఆకుపచ్చ రంగులు ఉంటే మనసుకు హాయిగా, ఉత్సాహంగా ఉంటుందట. భోజనం చేసే చోట మాత్రం ముచ్చట్లు పెడుతుంటాం! అక్కడ ఎరుపు, నారింజ రంగులు ఉండాలని నిపుణుల మాట.
వెల్ బియింగ్: కొన్నిరకాల రంగులు మనలోని సృజనాత్మకతను వెలికితీస్తాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పసుపు రంగు. అలాగే సోషలైజేషన్ను ప్రోత్సహించే క్రమంలో నారింజ రంగు ఉపయోగపడుతుందట. చదువుకునే చోట, వ్యాపార లావాదేవీలు నిర్వహించే గదిలో నీలి, ఆకుపచ్చ రంగులు పాజిటివ్ వైబ్రేషన్స్ను కలిగిస్తాయని పరిశోధనల్లో తేలింది.
దుస్తుల్లోనూ దోస్తీ: మనసుకు నచ్చిన రంగు దుస్తులనే చాలావరకు ఎంపిక చేసుకుంటాం. అలాకాకుండా రంగుల ప్రాముఖ్యాన్ని తెలుసుకుని వేసుకుంటే, కచ్చితంగా వ్యక్తిత్వంలో మార్పు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ముదురు రంగులు కాకుండా.. కూల్ కలర్స్ ఎంపిక చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఎరుపు, నారింజ, పసుపు: ఈ కలర్స్ ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మనలో ప్రేరణశక్తిని పెంచుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆకస్మిక ఆందోళనకు కూడా దారి తీస్తాయట.
నీలి, ఆకుపచ్చ: ఈ రంగులు భావోద్వేగాలను స్థిరీకరిస్తాయి. ఏకాగ్ర చిత్తాన్ని కలిగిస్తాయి. మనసును ప్రశాంతపరుస్తాయి. చాలాసార్లు ఈ రంగులు అంగీకారాన్ని తెలియజేస్తాయట.
నలుపు, బూడిద, గోధుమ: ఈ వన్నెలను గంభీరతకు చిహ్నంగా చెబుతారు. ఈ తరహా రంగు దుస్తులు ఎక్కువగా ధరించేవాళ్లు అంతర్ముఖంగా ఉంటారని నిపుణుల మాట. అయితే, బూడిద, గోధుమ రంగులు వేసుకున్నప్పుడు ఎదుటివ్యక్తుల నుంచి అనుకూల ప్రతిస్పందనలు వస్తాయట.
ఊదా: ఈ వర్ణం ఊహ, ఆధ్యాత్మికతకు సంబంధించినదిగా చెప్తారు. కానీ ఈ రంగును ఎక్కువగా ఉపయోగించే ఆ వ్యక్తులు మానసికంగా అసౌకర్యంగా ఉన్నట్లుగా కొన్ని అధ్యయనాలు తేల్చాయి.