ఆ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరో సినిమాలో సైకాలజిస్ట్‌ని కామెడీ పీస్‌లా చూపించారు. ఆ ఒక్క సినిమాలోనే కాదు, చాలా సినిమాల్లో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ని, వారు ఇచ్చే థెరపీని తప్పుడు అభిప్రాయం కలిగేలా చూపిస్తున్నారు. వీటి ప్రభావంతో సమాజంలో థెరపీ అంటే కొన్ని అపోహలు, ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా చాలామంది తమకు అవసరమైనప్పుడు సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ను సంప్రదించడానికి సంకోచిస్తున్నారు. థెరపీకి సంబంధించి సమాజంలో ఎక్కువగా వినిపించే ప్రధాన అపోహలు, వాటి వెనుక ఉన్న యథార్థాలు తెలుసుకుందాం.
అపోహ: థెరపీ కేవలం ‘పిచ్చి’ ఉన్నవారికే లేదా తీవ్రమైన మానసిక రోగులకే యథార్థం: శరీరానికి జ్వరం లేదా గాయం అయినప్పుడు వైద్యుడిని ఎలా సంప్రదిస్తామో, అలాగే దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన, సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు వచ్చినప్పుడు థెరపీని ఆశ్రయించవచ్చు. దీనికి తీవ్రమైన మానసిక వ్యాధి ఉండాల్సిన అవసరం లేదు.
ఉదాహరణ: ఒక ఐటీ ఉద్యోగి వర్క్ ప్రెజర్, టైమ్ మేనేజ్మెంట్ సమస్యలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఆయనకు ఎలాంటి మానసిక రుగ్మత లేకపోయినా, ఒత్తిడిని జయించే పద్ధతులు నేర్చుకోవడానికి థెరపీ సహాయపడుతుంది.
అపోహ: స్నేహితులతో మాట్లాడటం, థెరపిస్ట్‌తో మాట్లాడటం ఒకటే
యథార్థం: స్నేహితులు మనపై ప్రేమతో, తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా సలహాలు ఇస్తారు. కానీ, సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ పొందిన నిపుణులు. వారు మిమ్మల్ని జడ్జ్ చేయకుండా, సమస్య మూలాలను విశ్లేషించి మీకు సరైన మార్గాన్ని కనుగొనడంలో సహాయపడతారు.
ఉదాహరణ: బ్రేకప్ అయినప్పుడు స్నేహితుడు ‘మరచిపో, ఇంకో కొత్త స్నేహం వెతుక్కో’ అని సాధారణ సలహా ఇవ్వవచ్చు. కానీ థెరపిస్ట్ మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, ఆ బాధ నుంచి ఆరోగ్యకరమైన రీతిలో బయటపడే ప్రక్రియను నేర్పిస్తారు.
అపోహ: థెరపిస్ట్ మన సమస్యలకు వెంటనే సలహాలు, పరిష్కారాలు ఇచ్చేస్తారు.
యథార్థం: థెరపీ అనేది ‘సలహాలు ఇచ్చే ప్రక్రియ’ కాదు. థెరపిస్ట్ మీ సమస్యలకు రెడీమేడ్ పరిష్కారాలు ఇవ్వరు; బదులుగా, మీ సమస్యను మీరే విశ్లేషించుకుని, సరైన నిర్ణయాలు తీసుకునేంత మానసిక పరిపక్వతను మీకు కలిగిస్తారు.
ఉదాహరణ: ‘నేను ఈ ఉద్యోగం మానేయాలా లేదా వద్దా?’ అని అడిగితే థెరపిస్ట్ ‘మానేయ్’ అని చెప్పరు. ఉద్యోగం వల్ల మీకు వస్తున్న ఒత్తిడి ఏంటి, దానివల్ల మీ నిర్ణయ సామర్థ్యం ఎలా ప్రభావితమవుతోందో అర్థం చేసుకునేలా ప్రశ్నలు అడిగి, సరైన నిర్ణయం మీరే తీసుకునేలా గైడ్ చేస్తారు.
అపోహ: థెరపీకి వెళ్తే మానసికంగా బలహీనులని అర్థం.
యథార్థం: తమ సమస్యను గుర్తించి, దానికి సహాయం కోరడం అనేది ధైర్యానికి, స్వయం అవగాహనకు సంకేతం. శరీరానికి దెబ్బ తగిలితే కట్టు కట్టించుకోవడం ఎలా బలహీనత కాదో, మానసిక కష్టాల్లో ఉన్నప్పుడు నిపుణుల సాయం కోరడం కూడా బలహీనత కాదు.
ఉదాహరణ: జిమ్‌కు వెళ్లి ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకోవడం ఎలాగైతే శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి నిదర్శనమో, థెరపిస్ట్ సాయంతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కూడా మానసిక దృఢత్వానికి సంకేతమే.
అపోహ: ఒక్కసారి థెరపీ మొదలుపెడితే జీవితాంతం వెళ్లాల్సిందే!
యథార్థం: థెరపీ లక్ష్యం మిమ్మల్ని థెరపిస్ట్‌పై ఆధారపడేలా చేయడం కాదు, మిమ్మల్ని స్వతంత్రంగా మార్చడం. చాలామందికి 6 నుంచి 12 సెషన్లలోనే మంచి మార్పు కనిపిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి సమయం ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణ: ఫోబియా (భయం) ఉన్న ఒక వ్యక్తి కాగ్నిటివ్ బిహేవియోరల్ థెరపీ ద్వారా 8-10 సెషన్లలోనే ఆ భయాన్ని అధిగమించడం నేర్చుకుని థెరపీని ముగించవచ్చు.
అపోహ: మానసిక సమస్యలకు కేవలం మాత్రలు వాడితే సరిపోతుంది.
యథార్థం: సైకియాట్రిస్టులు ఇచ్చే మందులు మెదడులోని రసాయనాల సమతుల్యతను సరిచేయడానికి ఉపయోగపడతాయి. కానీ, మన ఆలోచనా సరళిని, అలవాట్లను, ఎదుర్కొనే సమస్యలను మార్చుకోవడానికి సైకోథెరపీ (టాక్ థెరపీ) అవసరం. మందులు, థెరపీ రెండూ కలసి పనిచేసినప్పుడే పూర్తి కోలుకోలు సాధ్యమవుతుంది.
థెరపీలో ఏం జరుగుతుంది?
తొలి సెషన్ ప్రాథమిక పరిచయం, సమస్యను అర్థం చేసుకోవడం ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశించుకోవడానికి ఉద్దేశించినది. సాధారణంగా ఇది 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది.
తొలి సెషన్‌కు ఎలా సిద్ధపడాలి?
మీరు థెరపీకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రధాన ఆలోచనలు లేదా సమస్యల జాబితాను చిన్న కాగితంపై లేదా ఫోన్లో నోట్ చేసుకోండి. థెరపిస్ట్‌ను అడగాలనుకుంటున్న ప్రశ్నలు రాసుకోండి. థెరపిస్ట్ ముందు ఎలాంటి ముసుగు లేకుండా నిజాయితీగా మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నించండి. థెరపిస్ట్ మిమ్మల్ని జడ్జ్ చేయరనే విషయాన్ని గుర్తుంచుకోండి. మొదటి సెషన్లోనే సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కావు. తొలి సెషన్ అనేది మీ ఇద్దరి మధ్య సరైన సమన్వయం ఏర్పడటానికి వేసే మొదటి అడుగు మాత్రమే అని తెలుసుకోండి.
థెరపీకి వెళ్లేటప్పుడు ఆందోళనగా అనిపించడం సహజం. కానీ, అది మీ మానసిక ఆరోగ్య ప్రయాణంలో ఒక సానుకూలమైన అడుగు అని గుర్తుంచుకోండి. మానసిక ఆరోగ్యం పట్ల అపోహలను వీడి, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మరువకండి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261