ఒకప్పుడు పెళ్లిచూపులంటే.. అటేడు తరాలు, ఇటేడు తరాల గురించి పెద్దలు మాట్లాడుకున్నాకే మొదలయ్యేవి. తేనీటితో వచ్చే వధువుని నిమిషాల్లో చూసి నూరేళ్ల బంధానికి క్షణంలో ఓ నిర్ణయం చెప్పాల్సి ఉండేది. తరాలు మారాయి. ఏడు తరాల ముచ్చట్లు మూలపడ్డాయి. వెనుక ఉన్న ఆస్తులు, మీద ఉన్న బాధ్యతలు ముందుకొచ్చాయి. ఒక్క ఫొటో అప్లోడ్ చేస్తే చాలు.. కంప్యూటర్ ఆల్గారిథమే ఓ తోడుని వెదికిపెట్టే మ్యాట్రిమొని సైట్లు ఎంట్రీ ఇచ్చాయి. నేటితరానికి ఈ సైట్లూ బోర్ కొట్టినట్టు ఉన్నాయి. ఆన్లైన్లో అంతులేని స్క్రోలింగ్కంటే.. ఆఫ్‌లైన్‌లో ఆత్మీయ సమావేశంలోనే తోడుని వెదుక్కుంటున్నాయి. ఇలాంటివారిలో కొత్త ఆశలు రేకెత్తించి.. తోడుకోసం దౌడు తీయిస్తున్న మ్యాచ్ మేకింగ్ ఈవెంట్స్ వచ్చేస్తున్నాయ్.
దూరభారమని మ్యాట్రిమొనీలో సంబంధాలు వెదుక్కుంటే.. వేల ప్రొఫైల్స్, అంతులేని స్క్రోలింగ్, గంటల కొద్దీ చాటింగ్ సమయాన్ని తినేస్తోంది. అన్నీ కుదిరాక.. తీరా కలిశాక కొందరికి నిరాశే మిగులుతున్నది. స్క్రీన్ మీద కనిపించినట్టుగా మనుషులు ఉండరు. అప్లోడ్ చేసినట్లుగా ప్రొఫైల్ ఉండదు. మ్యాట్రిమొనీల్లో ఎంతోమందికి ఎదురయ్యే చేదు అనుభవమిది. అందుకే, టెక్నాలజీ అనేది పరిచయానికి వారధిగా ఉండాలి. అదే జీవితం కావొద్దు.
ఆదర్శాలు, వివాదాలు లేకుండా పారదర్శకంగా పెళ్లి చూపులు ఉండాలని నేటితరం కోరుకుంటోంది. అందుకే పెళ్లిచూపులు మళ్లా ఆఫ్‌లైన్‌లోకి మారిపోతున్నాయ్. ఇటేడు తరాలు, అటేడు తరాలు కాకుండా.. ఇద్దరి ఆలోచనలు కలిస్తే చాలు కలిసి పయనిద్దామనే పెళ్లి ప్రమాణాలు పెట్టుకుంటోంది యువత. ఈ కొత్త ప్రమాణాలకు తగ్గట్టు ‘పర్సనలైజ్డ్ మ్యాచ్ మేకింగ్’ ఈవెంట్లు టెంట్లు వేసి పిలుస్తున్నాయ్. మ్యాచ్ మేకింగ్ యాప్స్‌లో వేల మందిని చూడటం కంటే.. తమ అభిరుచులకు తగ్గట్టుగా ఉండే నలుగురిని నేరుగా కలవడమే మేలనుకుంటున్న వాళ్లు ఈ ఈవెంట్లకు పొలోమంటూ వస్తున్నారు. ‘స్పీడ్ డేటింగ్’, ‘సింగిల్స్ మిక్సర్’, ‘కర్యూటెడ్ డిన్నర్స్’ పేరుతో మెట్రో నగరాల్లో పెళ్లి చూపులు చూడముచ్చటగా జరుగుతున్నాయ్.
పెళ్లి పంట పండించడానికి కలవాల్సింది మనస్తత్వాలు కానీ, అల్గారిథమ్స్ కాదని భావించేవాళ్లు మనసుని అర్థం చేసుకోవడానికి ఆఫ్‌లైన్‌లోకి వస్తున్నారు. ప్రొఫైల్ సరిపోయినా.. పర్సనల్ ఇంట్రెస్ట్‌లు కూడా సరిపోవాలని కోరుకుంటున్నారు. ఒకటీ, రెండు సిట్టింగుల్లో మాటామాటా కలిపి తనేమిటో చెబుతూ, అవతలివాళ్లేమిటో తెలుసుకుంటున్నారు. ఇలాంటి మాటల ముచ్చట్లు కలపడానికే ప్రైవేట్ ఈవెంట్స్. మ్యాచ్ మేకింగ్ ఈవెంట్లలో కావాలనుకున్న వాళ్లను కలుపుకొనిపోతే సమయం సరదాగా గడిచిపోతుంది. విందు, వినోదాలతోపాటు అర్థం చేసుకోవాల్సిన మనుషితో సమయం గడిచిపోతుంది. ఇక్కడ ‘వైబ్’ని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరికొకరు అర్థమైతే ఏడడుగుల బంధానికి అక్కడే తొలి అడుగు పడుతుంది.
ఆన్లైన్లో చూసేది కేవలం ‘ప్రదర్శన’ మాత్రమే. మనిషి హావభావాలు, మాటతీరు, నిజాయతీ ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడే తెలుస్తాయి. ‘స్క్రీన్ మీద వందసార్లు చూసే కంటే.. ఒక్కసారి కళ్లలోకి చూసి మాట్లాడటం మిన్న’ అని యువత భావిస్తోంది. డేటింగ్ యాప్స్ బోర్ కొట్టిన వారు, తోడు కోసం సీరియస్‌గా వెతికేవారు మళ్లీ రియాలిటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఎంత మేలంటే.. ఫేక్ ఐడీ భయం లేదు. పూర్తిగా వెరిఫై చేసిన వ్యక్తులను మాత్రమే ఈవెంట్‌కి అనుమతిస్తారు. కాబట్టి సందేహాలు లేకుండా సంబంధాన్ని కలుపుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్లే యువత ఈ ట్రెండ్‌ని ఆదరిస్తోంది. ఈ కొత్త మార్పు వివాహ వ్యవస్థలో పారదర్శకతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని ఆశిద్దాం!