మాతా నీ పఛేడీ.. చేనేత వస్త్రంపై అమ్మవారి వివిధ రూపాలను, దేవీ పురాణంలోని అనేకానేక ఘట్టాలను ఆవిష్కరించే అద్భుత కళ. పదిహేడో శతాబ్దం నాటి ఈ కళాత్మక సంప్రదాయాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అతికొద్దిమంది మహిళలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యే ‘మాతా నీ పఛేడీ’కి భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా వచ్చింది.
సబర్మతి తీరం వెంబడి సంచారం సాగిస్తూ బతికే వాఘ్రీలు అనే ఆదిమ తెగ మహిళలు ఈ కళకు ఆద్యులు. ఇందుకు పూర్తిగా పూలు, మొక్కల నుంచి తీసిన రంగులే వాడతారు. అప్పట్లో అమ్మవారి పూజల్లో ఈ పటాలను అలంకరించేవారు. కానీ కాల క్రమంలో ఆదరణ కరువైంది, కళ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వాఘ్రీ వనితలు కుంచె పక్కన పెట్టలేదు. అమ్మవారి పటాలను గీయడం మానలేదు.