మాన్సి అగర్వాల్. బాలీవుడ్లో సుపరిచితమైన పేరు. చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ప్రాణం. అందుకే అర్థ
శాస్త్రంతోపాటు నాట్యంలోనూ డిగ్రీ అందుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా మారిపోయి.. అనేక గీతాలకు నృత్య
కల్పన చేశారు. దేవ్ డి, మేరీకోమ్, గులాల్.. లాంటి పాపులర్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. డ్యాన్స్ మాత్రమే కాదు… దర్శకత్వంలోనూ తనది అరుదైన ప్రతిభే. ఆమె నిర్మించి, దర్శకత్వం వహించిన ‘రాణి’, ‘హ్యాండ్ బ్యాగ్’ లఘుచిత్రాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో చోటు దక్కించుకున్నాయి. మాన్సికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు.. సకుటుంబంగా జురాసిక్ పార్క్ సినిమాకు వెళ్లింది. అదొక మాయాలోకంలా అనిపించింది.
ఆ తర్వాత క్రిస్టఫర్ నోలన్ చిత్రాలు… తనలో సినీరంగం పట్ల ఆసక్తిని పెంచాయి. వెండితెర మీద మరింత పట్టు సాధించేందుకు అకిరా కురోసావా లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలను విశ్లేషించడం మొదలు పెట్టారు మాన్సి. చివరికి తనకు ఇష్టమైన రంగంలో కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకురాలిగా గుర్తింపు అందుకున్నారు. మాన్సి ఈమధ్యనే ‘ఓషనిక్ హార్ట్స్’ అనే తొలి నవలను ఆవిష్కరించారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలకు కాల్పనికతను జోడించి రాసిన ఈ పుస్తకం కూడా విమర్శకుల మెప్పు పొందుతున్నది.