ప్రపంచవ్యాప్తంగా జనమంతా గూగుల్ మ్యాప్స్ ఆధారంగానే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. నేవిగేషన్ ఆధారంగా వెళ్లిపోతున్నారు. అప్పుడప్పుడు గూగుల్ చూపే దారిలో వెళ్తూ కాలువల్లోకి, సముద్రంలోకి దూసుకెళ్లిన సందర్భాలూ తెలిసినవే! నేవిగేషన్ అర్థం కాక దారి తప్పడం, ఒకే రూట్లో తచ్చాడటం లాంటి సమస్యలూ పరిచయమే! వీటికి చెక్ పెడుతూ మేడిన్ ఇండియా మ్యాపుల్స్ యాప్ వచ్చేసింది. ‘మ్యాప్ మై ఇండియా’ దేశీ సంస్థ ఈ యాప్‌ను డెవలప్ చేసింది.
సాధారణంగా నేవిగేషన్ యాప్స్ 2డైమెన్షన్లోనే దారి చూపుతుంటాయి. మ్యాపుల్స్‌లో 3డీ జంక్షన్ వ్యూ ఉంది. అంటే, మనం వెళ్లే దారిలో ఓవర్‌బ్రిడ్జ్ ఎక్కడ ఉంది, కింద నుంచి వెళ్లాలా, పైనుంచి వెళ్లాలా అని బొమ్మ రూపంలో 3డీ వ్యూతో చూపిస్తుంది. అంతేకాదు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు ఏ రంగులో ఉండేది టైమర్ కూడా చూపిస్తుంది. సేఫ్టీ కోసం ప్రమాదకరమైన మలుపులు, కూడళ్ల దగ్గర వార్నింగ్స్ ఇస్తుంది. ఇందులోని డిజిపిన్ ఆప్షన్‌తో డెస్టినేషన్‌ని అక్యురేట్గా సెట్ చేసుకునే వీలుంది. భలేగా ఉంది కదూ మన మ్యాపుల్స్!