బ్రాండ్ అంటే క్రేజీగా ఫీల్ అవ్వని అబ్బాయిలు ఉండరు.. అమ్మాయిలైతే అసలు చెప్పనక్కర్లేదు. బ్యాండ్ బజాయించేస్తారు. అందుకే మొబైల్ కంపెనీలు తమ బ్రాండ్ ఫోన్లను సరికొత్త ఫీచర్లతో నిత్యం అప్డేట్ చేస్తూ మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఆ సందడి ఇప్పుడు గూగుల్ చేస్తున్నది. ‘మేడ్ బై గూగుల్’ అంటూ పిక్సల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విశేషాల్ని టెక్ ప్రియులకు పరిచయం చేసింది. వాటిలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ‘పిక్సల్ 9 సిరీస్’ ఫోన్ల గురించే. యాపిల్‌కి పోటీగా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ఎప్పటి నుంచో మొబైల్ యూజర్లకు దగ్గరైంది. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత మస్తీ ఈవెంట్‌తో ఈ ఫోన్లోని ఫీచర్లను పరిచయం చేసింది.
పిక్సల్ 9, పిక్సల్ ప్రో, పిక్సల్ ప్రో ఎక్సెల్.. ఇవే మూడు మోడళ్లు. మొదటి రెండు ఫోన్లు 6.3 అంగుళాల తెరతో ముస్తాబైతే.. ప్రో ఎక్సెల్ మాత్రం 6.8 అంగుళాల ైస్టెలిష్ లుక్‌తో సిద్ధమైంది. ప్రాసెసింగ్ వేగాన్ని.. బ్యాటరీ మన్నికను పెంచేస్తూ ఫోన్లలో ‘జీ4 టెన్సర్ చిప్’ సెట్ వాడారు. అంతేకాదు.. రానున్న ఏడేండ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ని ఫోన్లలో పొందొచ్చు. ఇక ఫోన్ కెమెరా విషయానికొస్తే.. మొదటి రెండు ఫోన్లలో 50ఎంపీ (మెయిన్), 49 ఎంపీ (అల్ట్రావైడ్), ప్రో ఎక్సెల్ మాడల్ మరోటి (48ఎంపీ టెలీఫొటో) జతచేసి మొత్తం మూడు కెమెరాలతో ఫొటోగ్రఫీ ప్రియుల మదిని దోచుకునే ప్రయత్నం చేశారు. 5ఎక్స్ వరకూ దీంతో జూమ్ చేసి ఫొటోలు తీయొచ్చు. వీటి ప్రారంభ ధర సుమారు రూ.79,900.