సమాజంలో గొప్పగా బతకాలంటే.. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంప్రదాయాలు పాటిస్తూ, నియమాలకు కట్టుబడుతూ వాటిని ఎదుర్కొన్నవాళ్లు సూపర్ అనిపించుకుంటారు! మరి సోషల్ మీడియాలో నెగ్గుకురావాలంటే.. కొన్ని సూత్రాలు తెలుసుకోవాలి. వాటిని కచ్చితంగా పాటించాలి. ఏది, ఎక్కడ పోస్టు చేయాలి? ఎవరిని ట్యాగ్ చేయాలి? ఎలాంటి హ్యాష్‌ట్యాగ్ పెట్టాలి? ఈ విషయాలన్నీ తెలిస్తే సోషల్ దునియాలో మీరు అదుర్స్ అనిపించుకుంటారు.
నిద్ర లేచింది మొదలు ఎన్ని పనులున్నా.. నెట్టింట్లోకి తరచూ తొంగి చూస్తున్నాం. లెక్కకు మిక్కిలి పోస్టులు పెడుతున్నాం. లైకులొస్తే హైకూలు పాడుకుంటున్నాం. నెగెటివ్ కామెంట్లు వస్తే కుదేలవుతున్నాం. ఇలా సామాజిక మాధ్యమాల్లో నిరంతరం ఉనికిని చాటుకుంటూనే ఉన్నాం. నిద్రలో తప్ప.. ఫోన్ పక్కనపెట్టి ఓ రెండు గంటలు ఉండటం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. కాస్త కఠినంగా ఉందాం అనుకున్నా.. గంట గడవకముందే ఎక్స్‌లో చిట్టిపొట్టి కబుర్లు పంచుకోవాలనిపిస్తుంది. ఇన్‌స్టా రీల్ పోస్టు చేయాలనిపిస్తుంది. అలాగని అనుకున్నవన్నీ సామాజిక మాధ్యమాల్లో పెట్టేసి పండుగ చేసుకుంటానంటే పొరపాటే! పోస్టు చేసే ముందు కాస్త ఆలోచించాలి. అప్పుడే మీరు మంచోళ్లు
అనిపించుకుంటారు.
పొడి పొడి మాటల్లో.. చేసే పోస్టు అంత ఆసక్తిగా ఉండదు. అదే అక్షరాలకు ఆకట్టుకునే ఫొటో జోడిస్తే ఫాలోవర్లు కచ్చితంగా ఆగి చూస్తారు, తర్వాత చదువుతారు. అయితే దొరికిన ఇమేజ్ వ్యాసానికి జత చేస్తే కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు కాపీరైట్స్ సమస్య రావచ్చు! అందుకే సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి మీరు క్లిక్‌మనిపించిన ఫొటోలకే తొలి ప్రాధాన్యం ఇవ్వండి. కాపీరైట్స్ సమస్య లేకుండా ఉచితంగా ఫొటోలను అందించే ఇమేజ్ స్టాక్ వెబ్సైట్లు ఉన్నాయి. వాటినుంచి ఇమేజ్‌లు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ సైట్లలో విభాగాల వారీగా ఫొటోలను వెతకొచ్చు. ఈ వెబ్‌లింక్‌లు ప్రయత్నించండి.
https://unsplash.com
https://www.pexels.com
https://pixabay.com
అందరికీ ఒకటి కంటే ఎక్కువ సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. దీంతో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని అన్ని వేదికల్లోనూ పోస్టు చేస్తుంటారు. అప్పుడే మనం పంచుకున్న విషయం ఎక్కువమందికి చేరుతుంది. అయితే, ఒక పోస్టును ఒక్కోదాంట్లో వేరుగా పోస్టు చేయాలంటే కష్టమే! అయితే, కొన్ని సంస్థలు ఆటోసింక్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయినప్పటికీ అన్నిటిలోకి లాగిన్ అయ్యి పోస్టు చేయడం కాస్త చికాకే! ఒక్కదాంట్లో పోస్టు చేసినా, అన్నిట్లో అప్డేట్ అయితే ఎంత బాగుంటుంది కదా! ‘పోస్ట్ ప్లానర్’తో ఇది సాధ్యమే!! ‘సోషల్ మీడియా’ విభాగంలోకి వెళ్లి ఏయే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాడుతున్నారో వాటిని ఎనేబుల్ చేయాలి. అప్పుడు ఏ ఒక్కదాంట్లో మీరు పోస్టు చేసినా, అన్ని ప్లాట్‌ఫామ్స్‌లోనూ అప్డేట్ అవుతుంది. మొబైల్ యాప్, వెబ్ సర్వీసుగా దీన్ని వాడుకోవచ్చు. www.postplanner.com లింక్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు.
సోషల్ మీడియాలో చురుకైనవారికి హ్యాష్‌ట్యాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అంశాల్ని వెతికి పట్టేందుకు ఇవే ఆధారం. అయితే, సరైన హ్యాష్‌ట్యాగ్ పెట్టడమూ ఓ కళే. ఇందుకోసం https://www.veed.io/tools/script-generator/hashtag-generator లింక్‌లోకి వెళ్లండి. కంటెంట్ కీవర్డ్ ఎంటర్ చేసి ఆకర్షణీయమైన హ్యష్ట్యాగ్స్ని పొందొచ్చు. ఇది వెబ్ సర్వీస్ రూపంలో మాత్రమే కాదు, యాప్‌గానూ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి https://hashtagify.app/ లింక్‌తో దీనిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.