ఈరోజుల్లో ప్రేమంటే? కాఫీ డేట్స్, రీల్స్, స్టోరీస్‌లో లవ్ వైబ్స్, షాపింగ్.. అంతేనా? నిజానికి బంధాలు అంత తేలికైనవి కావు. మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తే, ఆ బంధం మీకు సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కొన్నిసార్లు ప్రేమ పేరుతో విసిరే ఉచ్చులో మనం చిక్కుకుపోతుంటాం. పదేపదే మనకు సరిపోని వాళ్ల మాయలోనే పడిపోతుంటాం. అందుకు కారణం కూడా మన ఆలోచనలే కావడం విచిత్రం.
మనలో కొన్ని ‘లైఫ్ ట్రాప్‌లు’ పనిచేస్తుంటాయి అని మీకు తెలుసా? బాల్యంలో మొదలయ్యే కొన్ని భావనలు పెద్దయ్యాక సంబంధాలను ప్రభావితం చేస్తాయి. డాక్టర్ జెఫ్రీ యంగ్ అనే సైకాలజిస్ట్ ‘స్కీమా థియరీ’తో ఈ ‘లైఫ్ ట్రాప్‌ల’ గురించి ఏనాడో చెప్పారు. ఇవి మన ఆలోచనల్ని, నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయి. సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో తప్పులు చేసేలా ప్రోత్సహిస్తాయి. చివరికి ఇంకేముంది హార్ట్‌బ్రేక్!! అమ్మాయిలు ముఖ్యంగా మూడు లైఫ్ట్రాప్ల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎమోషనల్ డిప్రివేషన్ (భావోద్వేగాల లేమి), అబాండన్మెంట్ (విడిచి వెళ్లిపోతారేమో అనే భయం), సెల్ఫ్ శాక్రిఫైస్ (స్వీయ త్యాగం). ఈ మూడు ధోరణుల వల్ల భాగస్వామి ఎంపికలో, ప్రేమను నిలబెట్టుకోవడంలో తప్పులు చేస్తుంటారు.
కావాల్సిన ప్రేమ దొరకదేమో?!
వాళ్లు నన్ను ప్రేమించినా.. సరిగ్గా వ్యక్తపరచడం లేదు.. ఇలాంటి ఆలోచనలు మీలో ఉన్నాయా? చిన్నప్పుడు మీకు సరైన ఆప్యాయత దొరకలేదా? అమ్మానాన్నలు దూరంగా ఉన్నారా? వాళ్లు మీకు అన్నీ ఇచ్చినా, మీ మనసులో ఏం ఉందో అర్థం చేసుకోలేదా? అలాంటప్పుడు, మీరు భావోద్వేగాలు అంతగా వ్యక్తపరచని వ్యక్తులకే త్వరగా ఆకర్షితురాలు అవుతారు. చిన్నప్పటి నుంచి భావోద్వేగాల లేమితో సతమతమైన మీ మనసు.. మీ తరహా వ్యక్తిత్వం ఉన్నవారికే అట్రాక్ట్ అవుతుంది. కానీ, లేనిది వెతుక్కోవడమే కదా జీవితం! బాల్యం నుంచి దొరకని ఆప్యాయత భాగస్వామి నుంచి ఆశించడం తప్పు కాదు. కన్సర్న్ చూపించే వారిని కాదని, మీలా బోర్‌గా ఫీలయ్యే వాళ్ల వెంటపడితే.. చివరికి జీవితంలో భావోద్వేగాలు మృగ్యమైపోతాయి.
నన్ను వదిలేస్తారేమో?!
మీలో ఈ తరహా ఫీలింగ్స్ వస్తుంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పిల్లలంటే ప్రేమ ఉన్నప్పటికీ… పరిస్థితులను బట్టి వాళ్ల అభిమానం వ్యక్తమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అతి గారాబం చేయడం, కొన్నిసార్లు మరీ ఎక్కువ నిర్లక్ష్యం చేయడం లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఆడపిల్లల ఆలోచన కాస్త చిత్రంగా ఉంటుంది. ప్రేమలో అడుగుపెట్టినప్పటి నుంచి అనుమానాలు వాళ్లను పీడిస్తూ ఉంటాయి. భాగస్వామి ఏ కొంచెం స్పందించకపోయినా.. అతిగా స్పందిస్తుంటారు. ఎప్పుడూ అతణ్నే అంటిపెట్టుకొని ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. మరింత గాఢమైన ప్రేమను ఆశిస్తూ ఉంటారు. ఈ భయం మీ నిబద్ధతను చూపించకపోగా, నిజమైన ప్రేమను కూడా అంగీకరించలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది.
ప్రాణం అయినా ఇస్తాను
పైకి చూస్తే ఇలా ఆలోచించడం గొప్ప విషయమే! ప్రేమంటే త్యాగమే!! కానీ, లవ్జర్నీలో ఇదో ప్రమాదకరమైన ట్రాప్. చిన్నప్పటి నుంచి ఇంట్లోవాళ్ల కోసం త్యాగాలకు అలవాటుపడిన ప్రాణమైతే మరీ ప్రమాదం. ఎదుటివ్యక్తిని సంతోషపర్చడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుండటం అలవాటుగా చేసుకుంటారు. ఇక ప్రేమించిన వ్యక్తి కోసం విపరీత త్యాగాలకు పాల్పడుతుంటారు. సరైనోడు అయితే త్యాగం చేసినా కొంత ఫర్వాలేదు. కానీ, మీ బలహీనతను అలుసుగా తీసుకునే బాపతు ప్రేమికుడు ఎదురుపడితే.. మీ త్యాగాలకు విలువ ఉండదు సరికదా, కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి కూడా రావొచ్చు. ఈ త్యాగశీలురు తమ భాగస్వామి నుంచి కూడా అదే తరహా త్యాగాలను ఆశిస్త్తే… మీ ప్రేమ మొగ్గలోనే వాడిపోవడం ఖాయం.
జెన్-జీ అమ్మాయిలు సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రపంచంలో పెరుగుతున్నారు. వారికి బంధాలపై స్పష్టమైన అవగాహన ఉండటంలేదు. అపరిచితులతో తేలికగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో బాల్యంలో ఎదురైన అనుభవాలు, మనసుకు తగిలిన గాయాలు.. ఈ సంబంధాలపై పడితే.. మరింత డేంజర్ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి, రిలేషన్లోకి ప్రవేశించడానికి ముందు.. మానసికంగా దృఢంగా ఉండాలి. ఎదుటివ్యక్తిని సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రేమను పొందే అవకాశాలు ఉంటాయి.