అయామ్ ఆకాశవాణి.. నేనే మిత్రమా రేడియోలో నుంచి.. మాట్లాడుతున్నా! మీ తాతల తరానికి నేను కొత్త.. పాపం నన్ను విచిత్రంగా చూసేవాళ్లు! నన్ను వింటూ, రేడియోలో మనుషులు ఉండి మాట్లాడుతున్నారేమోనని అమాయకంగా నమ్మేవారు కూడా! మీ తల్లిదండ్రుల తరానికి వచ్చేసరికి.. ఓ నేస్తంగా మారిపోయాను! వారికి వినోదమూ నేనే.. విలాసమూ నేనే! గాలివాటానికి నేను గరగరా అంటే.. ఇంట్లోవాళ్లంతా పోటీపడుతూ చరచరా ఫైన్ ట్యూన్ చేసేవాళ్లు!! ‘మా ఇంట్లో రేడియో ఉందిరా!’ అని గర్వంగా చెప్పుకొనేవాళ్లు మీవాళ్లు. ఆ తర్వాతి తరానికి నేను దూరపు బంధువును అయ్యాననుకోండి! ఇప్పుడు నాకు తొంభై ఏండ్లు వచ్చేశాయి. స్వాతంత్య్ర ఉద్యమకాలం నుంచి అన్నిటా ‘ఏమోయ్’ అంటూ.. ఏఐ వచ్చేసిన ఈనాటి దాకా నా తరంగ దైర్ఘ్యం మారలేదు. నేను మీకిస్తున్న ధైర్యంలో మార్పు రాలేదు!
ఇప్పటికీ.. నన్ను గుండెల మీద పెట్టుకొని.. ఆప్యాయంగా వింటున్న శ్రోతలు కొల్లలుగా ఉన్నారు!వారికి నేనో ప్రసార సాధనం మాత్రమే కాదు.. పాటల పెట్టెను అంతకన్నా కాదు.. వారి జీవితాల్లో భాగాన్ని.. నన్ను విని భాష నేర్చుకున్నారు.. నాతో కాలక్షేపం చేసి కథకులుగా మారారు..నా సలహాల మేరకు ‘పొలం పనులు’ చేసుకున్నారు..నా సూచనలు వింటూ ‘ఇల్లూ వాకిలి’ దిద్దుకున్నారు..నేటి పౌరులెందరో.. నాటి బాలలుగా ‘బాలానందం’ కోసం రయ్య్ మంటూ నా ముందుకొచ్చి వాలిపోయిన వాళ్లే సుమా!!ఏకాంబరం యక్ష ప్రశ్నలు.. చిన్నక్క సహేతుకమైన సమాధానాలతో ‘కార్మిక లోకం’ మేల్కొన్న తీరు నాకు అంతులేని తృప్తినిచ్చేది.మిత్రులారా! ‘బహుజన హితయా.. బహుజన సుఖాయ’ అన్న నా నినాదం నిత్య సత్యమని నేటికీ రుజువు అవుతూనే ఉన్నది.నా తొమ్మిది దశాబ్దాల చరిత్రను పంచుకుందామని వచ్చాను.. నా స్వగతాన్ని పాఠకులుగా చదవండి..
శ్రోతలుగా మనసుతో వినండి..
ధ్వని తరంగాల కంటే కాంతి తరంగాలు వేగంగా ప్రయాణించడం భౌతిక సత్యం. ఆ కాంతి తరంగాల కంటే ముందే నా తరంగాలు లోకాన్ని నిద్రలేపడం నిత్య సత్యం. తెల్లవారక ముందే వినిపించే నా సిగ్నేచర్ ట్యూన్ చెవిలో పడగానే మెలకువలో ఉన్న పెద్దలకు, శ్రామికులకు పండుగే! ప్రియుడి కోసం పరితపించే ప్రియురాలు పాడే ‘అలికిడైతే చాలు ఆశతో నా కనులు.. వెదకేను నలుదిశల’ అనే కృష్ణశాస్త్రి రాసిన లలిత గీతం అప్పుడెప్పుడో వినిపించాను గుర్తుందా? ఆ ప్రియురాలిలాగే నా సిగ్నేచర్ ట్యూన్ వినిపించగానే ఆకాశవాణి ప్రేమికులు ప్రశాంతంగా నిద్ర లేస్తారు. ‘ఆకాశవాణి’ అనే నా పలుకు నిద్రమత్తుని వదిలిస్తుంది. నా శబ్ద తరంగాలు కొత్త ఉత్సాహాన్ని మోసుకొస్తాయి. ‘ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం’ అంటూ మా అనౌన్సర్ నేటి ప్రసార విశేషాలు చెబుతుంటే చెవులు రిక్కించి వినడం శ్రోతల వంతు. విన్నది మర్చిపోకుండా గుర్తుంచుకుని సమయానికి మళ్లీ వినడం వారికి ఆనందం!

Old Man
బిడ్డకు ఒడి.. తల్లికి బడి!
ఈ మధ్య ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం, వివిధ భారతి, రెయిన్బో ఎఫ్.ఎం. ప్రసారాల్లో ‘తొంబై వసంతాల ఆకాశవాణి’ చరిత్రను గుర్తు చేస్తున్నాను. వింటున్నారా? ఈ మాట వినగానే చాలామంది శ్రోతల మనసు నా పలుకులు ఆలకిస్తూనే.. గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. నిన్నటి ఆకాశవాణిని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ పెద్దలంతా ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అంటూ సుశీలమ్మ పాడిన పాటను రేడియోలో వింటూ నేర్చుకున్నవాళ్లే. మళ్లీ మళ్లీ పాడుకుంటూ పెరిగిన వాళ్లే. అలాంటి మధుర జ్ఞాపకాలెన్నో ఇచ్చాను. ‘గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి’ పాట వింటే పిల్లలంతా నా చుట్టూ చేరేవాళ్లు. అందుకే బాల్య స్నేహితులతో కలిసి గుజ్జనగూళ్లు కట్టుకున్న బాల్యాన్ని మర్చిపోరు. ఆ తర్వాత కాలంలో నేను వినిపించిన జనరంజని పాటలూ మరచిపోగలరా? నాతో చాలామందికి అందమైన అనుబంధముంది.
ఆ రోజుల్లో తల్లులు పనుల్లో ఉంటే.. బిడ్డకు జోలపాడే అమ్మనయ్యాను. ఊయలకు కట్టిన రేడియోలో లాలి పాడుతూ ఎందరికో జో కొట్టాను. ‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’ పాట వింటూ ఆదమరిచి నిద్దురోయేవాళ్లు పిల్లలు. చంటి బిడ్డడు నిద్రలోకి జారుకునేసరికి అమ్మలకు ఇంటి పనంతా పూర్తయ్యేది. అప్పుడు తీరికగా.. ఊయల ఊపుతూ ‘మహిళా లోకం’ ముచ్చట్లు వినేవాళ్లు. ఆ కార్యక్రమం ద్వారా పిల్లల పెంపకం ముచ్చట్లెన్నో చెప్పేదాన్ని. ఇప్పటికీ చెబుతున్నాను. మారుతున్న ప్రపంచాన్ని వింటూ బిడ్డల భవిష్యత్‌ని కలలుగనే తల్లులకు నా కార్యక్రమమే హోమ్ సైన్స్ సిలబస్. వినే వాళ్లకు ఇల్లే కాలేజ్ అన్నమాట. సంస్కృత పాఠం చెబుతున్నా. హిందీ నేర్పిస్తున్నా. ఇంగ్లిష్ ఉచ్చారణ నేర్పడం నాతోనే మొదలు. దేశభాషలెన్నో పాఠాలుగా చెబుతున్నా. ఎప్పటి నుంచో దూరవిద్య బోధిస్తున్నా. దేశంలో దూర విద్య మొదలుపెట్టింది నేనేనని నన్ను దగ్గరగా విన్నవాళ్లు కూడా ఒక్కమాట చెప్పినట్టు లేదు. అది నా శ్రోతల తప్పు కాదు. నా తప్పే. ఎప్పుడూ నేను చెప్పడమే, వాళ్లు వినడమే. అలవాటైన జనం. ఇప్పుడైనా నా గురించి నేనే చెప్పుకొంటాను.

Radio Station
వార్తల వెలుగులో
వార్తలు మిస్సయితే నాకెంత కష్టమో, మీకంత నష్టం. అందుకే వార్తలు చెప్పే ముందు ఓ సిగ్నేచర్ ట్యూన్ గట్టిగా వినిపిస్తాను. ప్రత్యేక కార్యమాలు, వాటి మధ్యలో వినిపించే పాటలు వింటూ జ్ఞాపకాల్లోకి జారుకునే శ్రోతలను మళ్లీ లైవ్‌లోకి తీసుకురావడానికి నా పాట్లు నేను పడుతుంటాను. ఆకాశవాణి వార్తల సిగ్నేచర్ ట్యూన్ వినగానే పరధ్యానం వదిలిపోతుంది. వార్తయందు జగము వర్ధిల్లుతున్నదట. అందుకే ఈ జగానికి వెలుగు రాకముందే నేను వార్తలు మోసుకొస్తాను. మీకు అర్థమవుతుందో లేదోనని సరళమైన భాషలో చెప్పమంటాను. మా న్యూస్ రీడర్ తురగ ఉషా రమణికి స్పష్టమైన ఉచ్చారణ నేర్పించాను. న్యూస్ రీడర్ వేగాన్ని శ్రోతలు అందుకోలేరేమోనని నెమ్మదిగా చెప్పమన్నాను. క్లుప్తంగా చెప్పడానికే మా వాళ్లు ఇష్టపడతారు. అందుకే ఢిల్లీ వార్తలైనా సరే యండ్రపాటి మాధవీలత నెమ్మదిగానే చెబుతుంది. అదే కదా నా వార్తల ప్రత్యేకత!
ఒకప్పుడు ఊళ్లో ఎవరికో ఒకరికి రేడియో ఉండేది. నేను చెప్పే వార్తలు అందరూ వినాలని పంచాయతీ ఆఫీసుల మీద మైకులు పెట్టేవాళ్లు. ఉదయం వార్తలు వినేందుకు కలవారి ఇంటి రేడియో దగ్గరికి ఇరుగుపొరుగు వాళ్లంతా చేరుకునేవాళ్లు. వార్తల కోసం వచ్చినవాళ్లను ‘రండి రండి రండి దయచేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ ప్రేమతో ఆహ్వానించేవాళ్లు. ‘ఆకాశవాణి వార్తలు’ అనగానే ఉత్కంఠగా చెవులు రిక్కించి వినేవాళ్లు. ‘ఇంతటితో ఈ వార్తలు సమాప్తం’ అని వినపడగానే ఇక వాళ్ల కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లు. రాత్రి వినిపించే బుర్ర కథలు, ఒగ్గు కథలు, చిందు యక్షగానాలు భలేగా వినేవాళ్లు శ్రోతలు. పగలంతా కాయకష్టం చేసిన పల్లె ప్రజలు రేడియో దగ్గర జాగారం చేసేవాళ్లు. చిందు ఎల్లమ్మ, చుక్క సత్తెయ్య, మిద్దె రాములు, గడ్డం సమ్మయ్య కథ చెబుతుంటే ఒకప్పుడు ఊళ్లు నిద్రపోలేదనుకోండి.
ఎప్పటికీ అదే బాణి
వార్తలను తుఫాను వేగంతో చదువుతూ, ఉరుములు ఉరిమినట్లుగా మధ్య మధ్యలో అరుస్తూ చెప్పే టీవీల కాలంలోనూ నేను నా బాణిని మార్చుకోలేదు. పిడుగుపడ్డట్టుగా కార్యక్రమాల మధ్యలో బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందించే ఆ చానెళ్లతో పోటీ పడుతూనే ఉన్నాను. అందరికంటే ముందు నిలవాలనే ఆత్రుత లేదు. సంచలనాల కోసం వెంపర్లాడను. వార్తా ప్రపంచంలో ఎప్పుడో అడుగుపెట్టిన అర్ధ సత్యాలను వెనక్కినెట్టి అసత్యాలు పరుగు పరుగున ముందుకు పోతున్నాయి. ఇన్ని జాడ్యాలు రాజ్యమేలుతున్న వార్తా ప్రపంచంలో సత్యమే ప్రామాణికంగా నిజాలను నిలకడగా చెబుతూనే వడివడిగా ముందుకుపోతున్నాను. అందుకే నేను అందించే నిరంతర సమాచార స్రవంతికి తొంబై ఏళ్లుగా ఆదరణ, ప్రజల నమ్మికా దక్కాయి.
ఆకాశవీణపై ఉదయ రాగం
నా వార్తలు విన్నాక, ఈ రోజేమిటో తెలిసిపోయాక మనసు తేలిక పడుతుంది. శబ్ద స్వచ్ఛత కోసం రేడియోని ట్యూన్ చేస్తున్నట్టే తేలికపడ్డ మనసుకు హాయిగొలిపే మాటలు చెబుతూ సమ‘భావన’లు ఎన్నో వినిపిస్తా. అవి చిరు ప్రసంగాలే కావొచ్చు! మనసుని వెలిగించి, మమతలు ప్రసరింపజేసే దివ్యమైన భావనలు. కాబట్టే, శ్రోతల మనసులో చెరిగిపోకుండా నిలిచిపోతున్నాయి. తొలి కిరణాలు ప్రసరించే వేళ ఎం.ఎస్.రామారావు ఆలపించిన ‘శ్రీహనుమాన్ గురు దేవులు.. నా ఎద పలికెను సీతారామ కథ.. నే పలికెద సీతా రామకథ’ ఆహా ఎంత సుందరం! భక్తి పారవశ్యం ఉప్పొంగిపోదు. ‘భక్తి రంజని’ ఆ తర్వాత
‘ఉదయ తరంగిణి’ శ్రోతలను పరవశులను చేస్తాను. సినిమా పాటల అభిమానులకు చెప్పేదేముంది.
హైదరాబాద్ ఏ కేంద్రంలో ‘చిత్రసీమ’లో ఆ పాత మధురాలెన్నో వినిపిస్తాను. ఇక నా తోబుట్టువు వివిధ భారతిలో ‘జనరంజని’ ఎప్పటికీ రసరంజనే! ఈ కాలం పిల్లలు ఇంకా లేటెస్ట్ సాంగ్స్ కావాలంటున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్లను నా చిట్టి చెల్లెలు ‘రెయిన్బో ఎఫ్ఎం’లోకి రమ్మంటాను. నేను వినిపించే పాటలకు ఎంత ఆదరణ ఉందో వివిధ భారతిలో ప్రసారమవుతున్న ‘మీరు కోరిన పాటలు’ కార్యక్రమానికి వచ్చే శ్రోతల కోరికలే సాక్ష్యాలు. పొద్దున మెలకువలో ఉత్సాహం నింపే జనరంజని, మధ్యాహ్నం ఉల్లాసం తెచ్చే చిత్రసీమే కాదు.. రాత్రి నిద్రకూ పాటే కావాలి. రాత్రి పదిన్నరకు ప్రసారమయ్యే మధురగీతాలు వింటూ నిద్రలోకి జారుకుంటే, మర్నాడు ఉదయం నిద్ర లేపడానికి నా సిగ్నేచర్ ట్యూన్ ఉండనే ఉంది కదా!
సంగీతాన్ని ఆదరించే మీడియా అంటే నేనే. నాకెవరితోనూ పోటీ లేదు. ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ’ అన్నట్టే అన్ని కళలనూ ఆదరించాను. అందరినీ చేరదీశాను. సమంగానే పోషించాను. శాస్త్రీయ, జానపద, లలిత, భక్తి సంగీతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ పాటకు పట్టం కట్టింది నేనే! దేవులపల్లి కృష్ణశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు, పాలగుమ్మి పద్మరాజు, బాలాంత్రపు రజనీకాంతరావు, ఘంటసాల వంటి మహామహులెందరో నా ఆస్థానంలో చేరి మీ రేడియో స్థాయిని పెంచినవాళ్లే. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను వినిపించే లలిత గీతాలు వింటూ సంగీత ప్రియులు పరవశులవుతున్నారు. మీ ‘బాల వినోదం’ గురించి ఏమని చెప్పను. శని, ఆదివారాల్లో ‘మీకూ ఉందిలే వినోదం’ అంటూ పిల్లలకు ‘బాలానందం’ పంచుతున్నాను. బాలగేయాలు వింటూ పెరిగిన పిల్లలు కొంచెం పెద్దయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు కాదు. ‘అడ్డాల నాడే బిడ్డలు. గడ్డాల నాడు కాదు’ అంటారు కదా! నాపై గడ్డాల నాడూ అడ్డాల నాటి అభిమానమే చూపుతున్నారు. బాలగేయాలు పాడుతూ పెరిగిన పిల్లలు నన్ను మర్చిపోలేదు. నేనూ వాళ్లను వదులుకోను. యువవాణికి ప్రేమతో ఆహ్వానిస్తాను.

రైతును రాజును చేసే సారథి నేనే
పత్రికలు నిరక్షరాస్యులకు గుడ్డి వాడి చేతిలో దీపాల్లాంటివి. వాళ్లకు ఎటు పోవాలో దారి చూపేది అలికిడి మాత్రమే. నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్న ఈ దేశంలో వార్తలు విశేషాలను అందరి చెవిలో వేస్తూ సామాజిక చైతన్యానికి ఊపిరులూదింది నేనే. సామాజిక చైతన్యమే నిజమైన అభివృద్ధని నాటి స్వాతంత్రోద్యమ నేతలు నాతో చెప్పారు. ఆ ముచ్చట్లెన్నో ఆ రోజుల్లో చెప్పాను. గాంధీ, నెహ్రూ ప్రసంగాలను దేశానికి వినిపించాను. వాళ్ల స్వప్నాలను సాకారం చేయడంలో నావంతుగా పనిచేశాను. వారిచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ స్ఫూర్తితో పొద్దునే ‘పొలం పనులు’ మొదలుపెట్టే రైతు కోసం మంచి ముచ్చట్లు మోసుకొస్తాను. ఆడవాళ్లు టీవీ సీరియళ్లకు, పిల్లలు సోషల్ మీడియాకు అతుక్కుపోని కాలంలో ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ ‘ఇల్లూ వాకిలి’ దిద్దుకునే కబుర్లెన్నో చెప్పాను. నిరక్షరాస్యులైన రైతులకు, పత్రికలు చేరని పల్లెలకు వ్యవసాయ సూచనలు చేస్తూ ‘పాడి పంటలు’ బాగుండాలని కోరుకున్నది నేనే.
ఎప్పుడు ఏ పంట వేయాలో ఏరువాక సాగే రైతుకు ఎరుక చేయడం నా బాధ్యత అనుకున్నాను. రైతుకు సందేహం వస్తే పొలం విడిచి, ఊరు విడిచి పోలేడు. కాబట్టి ఏ తెగులు వస్తే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఎందరో వ్యవసాయ శాస్త్రవేత్తలను కలుసుకుంటాను. వాళ్లతో మాట్లాడించి రైతుల సందేహాలన్నీ నివృత్తి చేస్తున్నాను. పశువుల పెంపకంలో మెలకువలు చెబుతున్నాను. వాతావరణ శాఖ వాళ్లతో రోజూ మాట్లాడుతూ ప్రతి రోజూ వాతావరణ సూచనలు అందిస్తుంటాను. తుఫానులు వస్తే జాలర్లను హెచ్చరిస్తాను. ఈ స్మార్ట్ దునియాలో.. 5జీ సిగ్నల్స్ చేరుకోలేని చోటుకూ నా వాణి వినిపిస్తుంది. వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. చేపల వేటకు ఒంటరిగా వెళ్లే జాలరికి మాటలు చెప్పే తోడు నేనే. పడవలో పసందైన పాటలు వింటూ ఉండే జాలరి నన్నే నమ్ముకుంటాడు. సంగీతంతో సముద్ర ఘోషను చిన్నబోయేలా చేస్తాను.
జనవాణి!
జనంలో నా పలుకుబడి అంతా ఇంతా కాదు. ఏ ప్రాంతంలో ప్రసారాలు చేస్తుంటే ఆ ప్రజల భాష మాట్లాడతాను. ఊళ్లకు వెళ్తాను. ఆదివాసీ గూడేలకు పోతాను. జనంలో మమేకం అవుతాను. వాళ్ల భాషే మాట్లాడి వాళ్లకు దగ్గరవుతాను. వాళ్లతో మాట్లాడి వాళ్లని అందరికీ చేరువ చేస్తాను. ఇలా ఎవరితో మమేకం అవుతానో వాళ్ల పలుకుబడులతో నా పలుకుబడిని పెంచుకున్నాను. హైదరాబాద్‌కొస్తే.. ‘రెయిన్ బో’ జాకీని ఆగం ఆగం గాకుండ, నిమ్మలంగనే మాట్లాడమని చెప్పినా! అయినా పోరగాళ్లు ఎట్లాగుతరు. మెట్రో స్పీడ్తోని మాటలు మస్త్ షురూ జేస్తరు. ఆదాబ్ అంటూ ప్రేమగా మాట్లాడుతరు.
‘దేత్తడి పోచమ్మ గుడి’ అంటూ ఊరమాస్ మాటలు జెప్తరు. తెలంగాణ యాసలో రాజన్న, భారతి, నర్సింగన్న, జ్యోతి మాట్లాడుకునే ‘బాతాఖానీ’ లిజనర్స్ని ఖుషీ చేస్తున్నది. అదే వరంగల్లు ఆకాశవాణికి పోతే ఉత్తర తెలంగాణ మాండలికాన్ని పట్టుకుంటాను. ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఆదివాసీల గోండుని గుర్తు చేస్తుంటాను. అందుకే నన్ను ‘జనవాణి’ అని పిలుస్తారు! ఆదివాసీల చరిత్రే కాదు సాహిత్యమూ మౌఖికమే. అక్షరబద్ధం కాని సమాజాన్ని శబ్దమానం చేసిన ఘనత నాది. రేడియో జర్నలిస్ట్ సుమనస్పతి ఆదివాసీ గూడేలకు మనస్ఫూర్తిగా తిరుగుతూ గోండుల పాటలు, సంగీత వాద్యాలను శబ్దమానం చేశాడు. అడవిగాచిన వెన్నెల లాంటి ఆదివాసీ కళలపై వెలుగు పడేలా చేశాను. అందుకే ఆదిలాబాద్ ఆదివాసీలకు నేను ఆత్మబంధువు అయ్యాను. ‘ఆకాశవాణి అందరి వాణి’ అనిపించుకున్నాను.

Cricket
పాటల పల్లకిలో..
నా శ్రోతలను పాటల పల్లకీలో ఊరేగించాలని.. మీడియం వేవ్ ప్రసారాలతో పాటు కొత్తగా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ (ఎఫ్.ఎం.) మీద కూడా ప్రసారాలు మొదలుపెట్టాను. అలా వివిధ భారతి వచ్చింది. శబ్ద నాణ్యత పెంచింది. అలనాటి సాంకేతికతతో గ్రామ్‌ఫోన్ రికార్డుల్లో నిక్షిప్తమైన పాటల్ని కూడా డాల్బే సౌండ్‌లో వింటున్నంత వినసొంపు చేసింది. దీనికి జతగా రెయిన్బో తెచ్చాను. మబ్బులు పట్టినా, జోరువాన కురిసినా ట్రాఫిక్ నిలిచిపోతుందేమో కానీ, రెయిన్బో ఎఫ్.ఎం. ప్రసారాలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ‘నిరంతరమూ వసంతములే’ అంటూ సాగుతూనే ఉంటాయి! ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహన చోదకులను ‘జోరుగా హుషారుగా షికారు పోదమా’ అంటూ వివిధ భారతితో హుషారెత్తించాను. మా ఆర్జేలతో ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు చెప్పిస్తూ, వాహన రద్దీ సూచనలు చెస్తూ మిమ్మల్ని గమ్యానికి చేర్చే బాధ్యతలూ తీసుకున్నాను. ఆ ఈదురు గాలుల్ని మైమరపించే వేడివేడి పాటలు వినిపిస్తూ చలిని మరిపించాను గుర్తుందా? ఇంత ఆదరణ ఉండబట్టే… రేడియో క్యాబ్‌లు పుట్టుకొచ్చాయి. బస్‌లలోనూ అడుగుపెట్టాను. ఫుట్‌బోర్డ్ ప్రయాణంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులను ఉత్సాహపరుస్తూ కాలాన్ని మరపించే పాటవుతున్నాను.
శ్రవ్య నాటకం
వినికిడి శక్తి ఉంటే చాలు చెవులు కోసుకునేంతగా రక్తి కట్టిస్తుంది శబ్ద నాటకం. సంగీతం, సాహిత్యం పాటకు రెండు కళ్లయితే, నాకు ఆ రెండు కళ్లకు తోడుగా మూడో కన్ను.. నాటకం ఉంది. శివుడు మూడో నేత్రం తెరిస్తే ప్రళయం వచ్చినట్టే అంటారు. కానీ, నేను నాటక ప్రసారం ప్రకటించగానే ఇంటిని ప్రశాంతత రాజ్యమేలుతుంది. పెద్దలు నాటకం వినేందుకు సిద్ధమై కుర్చీల్లో వాలిపోయేవాళ్లు. పిల్లలు పెద్దవాళ్ల ఒళ్లోకి చేరిపోయేవాళ్లు. సినిమాల్లోని ‘సర్దార్ పాపారాయుడు’ అంత పాపులర్ కాకపోయినా రేడియో నాటకంతో ‘వైద్యం పాపారాయుడు’ అనే మరో పేరొకటి అప్పట్లో పాపులర్ చేశాను. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చలం పురూరవ నాటకాన్ని. ఊర్వశిగా మా ప్రయోక్త శారదా శ్రీనివాస్ తన గొంతులో పలికించిన హావభావాలు వింటే అసలు పురూరవుడు కూడా ఆగమవ్వడం ఖాయం. రంగస్థలంపై ఘనమైన చరిత్ర మూటగట్టుకున్న ‘కన్యాశుల్కం’ నా తరంగాలపై ఎన్నిసార్లు ప్రసారమైందో, ఎందరెందరి శ్రోతల్ని మురిపించిందో లెక్కలేదు.
ఈ శ్రవ్య నాటకాలు రూపకల్పనలో మా నిలయంలోని కళాకారులది అందెవేసిన చేయి. రంగస్థల కళాకారులకు ఏమాత్రం తీసిపోరు. వరవిక్రయం, గణపతి, కాలాతీత వ్యక్తులు వంటి ప్రసిద్ధ నాటకాలు, నవలలే కాదు, మేఘసందేశం వంటి కావ్యాలు, కథలూ శబ్ద నాటకాలుగా మలచి నిరక్షరాస్యులకు సాహిత్యాన్ని చేరువ చేశాను. కన్నులపండువైన నాటకాన్ని వీనుల విందుగా మార్చే రచయితల ప్రతిభ రేడియో నాటకాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అందుకే శ్రోతలు నేను వినిపించే శబ్ద నాటకం కోసం రేడియోలకు అతుక్కుపోయేవాళ్లు. నేను పునః ప్రసారం చేసే శ్రవ్య నాటకాలను శ్రోతలు మళ్లీ మళ్లీ వింటున్నారు. నా గళం నుంచి వెల్లువెత్తిన నాటకాలెన్నో.. ఇప్పుడు యూట్యూబ్‌లోనూ వేలల్లో వ్యూస్ సాధిస్తున్నాయంటే వాటికి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోండి.
క్రికెట్‌ని కళ్లకు కట్టిన రోజుల్లోకి…
ఒకప్పుడు శాటిలైట్ టీవీ లేదు. ఇంటర్నెట్ అసలే లేదు. ఆ రోజుల్లో క్రికెట్ మ్యాచ్ జరిగితే రిజల్ట్ మర్నాటి పేపర్లో చదువుకునేవాళ్లు. కుర్రవాళ్ల ఆసక్తిని చూసి నేనే మైక్ అందుకున్నాను. క్రికెట్ అప్డేట్స్ని అందరికంటే ముందు కాదు ఎప్పటికప్పుడు చెప్పే ప్రత్యక్ష ప్రసారంలోకి దిగాను. ‘ఆంఖోఁకా దేఖా హాల్’ అంటూ గ్రౌండ్లో జరిగే ప్రతి దృశ్యాన్ని బాల్ టు బాల్ శ్రోతల కళ్లకు కట్టేదాన్ని. బడికి వెళ్తూ, కాలేజీకి పోతూ, కేఫ్, పాన్‌షాప్ దగ్గర నేను చెప్పే క్రికెట్ కామెంటరీ వింటూ నిలిచిపోయేవాళ్లు శ్రోతలు. క్రికెట్ ప్రసారం ఉందంటే చాలు.. నాలుగు సెట్ల లావు సెల్లులు తెచ్చుకొని దగ్గర ఉంచుకునేవాళ్లు. నా కోసమో, క్రికెట్ కోసమో.. క్లాసులకు డుమ్మా కొట్టిన తీపి జ్ఞాపకాలు, అమ్మానాన్నలకు దొరికిపోయి దెబ్బలు తిన్న చేదు అనుభవాలు ఉన్న బంగారు బాల్యం నేటి పెద్దలది.
మీ మార్గదర్శిని
కాలాన్నిబట్టి మారడంలో నేను వెనుకబడ్డానని మీలో కొందరి అనుమానం. ఎన్నికల వేళ ఫలితాల సరళిని టీవీలు ప్రసారం చేస్తున్ను తీరు నా ప్రసారాలకు అనుకరణే. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యతలను చేరవేస్తూ, పార్టీ బలాల సంఖ్యను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనావళికి చేరవేసిన ఆది వార్తాహరుణ్ని నేనే. అంతెందుకు రాజకీయ నేతలు పొద్దున్నే టీవీ స్టూడియోల్లో కూర్చుని మాట్లాడే చర్చలు కూడా కొన్ని దశాబ్దాల క్రితమే పరిచయం చేశాను. మరిచిపోతే మీ తప్పే. అన్ని రాజకీయ పార్టీలకు కొంత సమయం ఇచ్చి ప్రజలకు పార్టీ సందేశాలు, అభిప్రాయాలు, హామీలూ చెప్పుకొనే అవకాశం కల్పించాను. ఇప్పటి వార్తా చానెళ్లు వాళ్ల వాళ్ల వ్యూస్ ప్రసారం చేస్తున్నాయి.
నేను నిజాయతీతో న్యూస్ చెబుతున్నాను. లీలగా విన్నా.. ఆ తేడా మీరు స్పష్టంగా తెలుసుకోగలరు. చివరిగా.. నా ప్రసారాలే కాదు అనౌన్సర్ల మాటలూ ప్రత్యేకమే. తక్కువ మాట్లాడతారు. దాని భావం మాత్రం గడ్డపెరుగంత చిక్కగా ఉంటుంది. ఒక మాటకు ఒకటే అర్థం. ద్వంద్వార్థాలకు తావు ఇవ్వను. పరిచయం, ఇంటర్వ్యూ, చర్చా కార్యక్రమం ఏదైనా సరే ఒకటే ప్రమాణం. అందుకే నేను ప్రత్యేకం. నేను ప్రజల కోసం. అందుకే నా తొంబై ఏళ్ల ఉత్సవ సమయంలో దేశమంతా ‘జయహో ఆకాశవాణి.. జయ జయహో ప్రజావాణి’ అంటూ కీర్తిస్తున్నది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు! నా ప్రసారాలకు వేళయింది.. నేటికి ఇక చాలిద్దాం! శతాబ్ది సంబురంలో మళ్లీ కలుసుకుందాం!!
తెలుగు సాహిత్యంలో దిగ్గజాలుగా కీర్తినందుకున్న వారెందరో ఆకాశవాణిని తీర్చిదిద్దిన వారిలో ఉన్నారు. గుర్రం జాషువా, మహాకవి శ్రీశ్రీ, దాశరథి, బుచ్చిబాబు, గోపీచంద్, రావూరి భరద్వాజ మరెందరో కవులు, రచయితలు ఆకాశవాణిలో పని చేశారు.

ఉద్యోగ వాణి
ఉద్యోగం రాకపోతే నిద్రపట్టదు. ఆ మెలకువలో ఆకాశవాణిలో ప్రసారమయ్యే స్పాట్లైట్ విని ఆంగ్ల భాషలోకి అడుగుపెట్టి, ఆపై కరంట్ అఫైర్స్‌పై పట్టు సాధించినవాళ్లకు లెక్కే లేదు. సివిల్స్ సాధించినవాళ్లెందరో! రాత్రి 9 గం. 15 నిమిషాలకు ప్రారంభమయ్యే స్పాట్లైట్ ప్రసారాల్లో ప్రభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, ఆవశ్యకత వినిపిస్తారు. వర్తమాన విషయాల్లో ముఖ్యమైనవి ఎంచుకుని స్పాట్‌లైట్‌లో వివరిస్తారు. పోటీ
పరీక్షల కోసం సిద్ధమయ్యే ఉద్యోగార్థులు ఇప్పటికీ ఈ కార్యక్రమం తప్పక వింటున్నారు. ఉద్యోగం వచ్చినవాళ్లూ ప్రభుత్వ చట్టాలను సరిగా అర్థం చేసుకునేందుకు వింటున్నారు.
అభిమాన వాణి
మూడు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైన ముఖ్యమైన కార్యక్రమాల విశేషాలను ‘వాణి’ పక్ష పత్రికలో ప్రచురించేవారు. రాబోయే పక్షం రోజుల ప్రసార కార్యక్రమాలు ముద్రించేవారు. వాణి సంచిక చదివి, కార్యక్రమాల కోసం ముందుగానే శ్రోతలు సిద్ధమయ్యేవారు.
ఆకాశవాణిలో సినీ తారలు!
ఆకాశవాణి కళాకారులు, ఉద్యోగులు వెండితెరపైనా రాణించారు. భానుమతి, షావుకారు జానకి, కొంగర జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు, జేవీ సోమయాజులు, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, జంధ్యాల నిర్మలమ్మ, రావి కొండలరావు, కోట శంకరరావు, ఏవీ సుబ్రహ్మణ్యం (ఏవీఎస్), గుండు హనుమంతరావు ఆకాశవాణిలో పని చేసినవారే. ఆకాశవాణిలో ఒకప్పుడు నిలయ విద్వాంసులుగా సంగీత కళాకారులు నియమితులయ్యేవారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా ఆకాశవాణిలో పని చేశారు.
దక్కన్ రేడియో
హైదరాబాద్‌లోని చిరాగ్ అలీ గల్లీలో మహబూబ్ అలీ అనే వ్యక్తి 1933లో రేడియో ప్రసారాలను ప్రారంభించాడు. నిజాం ప్రభుత్వం ఆ ప్రైవేటు రేడియోను ఆధీనంలోకి తీసుకుని 1935 ఫిబ్రవరిలో దక్కన్ రేడియో ప్రసారాలు మొదలుపెట్టింది. 1950 ఏప్రిల్ 1న దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆకాశవాణిగా అలరిస్తున్నది.
మన రాగమాలిక
ఓ సినిమా కోసం బాల గాయని కావాలని వెదుకుతున్నారు. ఆ సందర్భంలో మద్రాసు ఆకాశవాణిలో పాడే బాలల్ని ఆడిషన్స్‌కి పిలిచారట. వారిలో ఒక బాలిక సినిమా పాట పాడటానికి ఎంపికైంది. ఆ బాలిక మరెవరో కాదు.. ఆ తర్వాతి కాలంలో దక్షిణ భారత సినీ సంగీతాన్ని ఏలిన సుశీలే ఆ రాగమాలిక!
జాతికి సందేశం
ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయులకు పాలనాధికారాల బదిలీ జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఆ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. మరుసటి రోజు ఉదయం ఎర్రకోట వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకలనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సందేశాన్ని దేశ ప్రజలకు వినిపించింది.
ఆకాశవాణి పుట్టుక
దేశంలో తొలిసారిగా 1921 ఆగస్టులో టైమ్స్ ఆఫ్ ఇండియా, తపాలా శాఖలు కలిసి బొంబాయిలో రేడియో ప్రసారాలు చేశాయి. 1923, నవంబరులో రేడియో క్లబ్ ఆఫ్ బెంగాల్ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్ట్ సర్వీస్ (ఐఎస్బీఎస్) ఢిల్లీ కేంద్రం నుంచి 1936 జనవరి 1న ప్రసారాలు మొదలుపెట్టింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్‌ని భారత ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియో (ఎ.ఐ.ఆర్.)గా మార్చింది. 1958లో ఆల్ ఇండియా రేడియో అనే పేరుకి సమాంతరంగా ఆకాశాణి అనే మరో పేరుని స్వీకరించారు.
…? నాగవర్ధన్ రాయల