అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. డిజైనర్ వేర్, మేకప్ రకరకాల పద్ధతులు ట్రై చేస్తారు. అయితే, ఎంత చేసినా మానసికంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడు మరింత అందంగా కనిపిస్తాం. దీనికి తోడు చర్మ సంరక్షణకు నడుం బిగిస్తే.. మీ అందం అందలమెక్కడం ఖాయం. అయితే, రక్తప్రసరణకు చర్మ సౌందర్యానికి లింకుంది. జీవనాడుల్లో రక్త సరఫరా సజావుగా సాగకపోతే చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. ముడతలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తాయి. సొంపైన చర్మానికి సుంతైన నిగారింపును కట్టబెట్టాలంటే.. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా ఈ చర్యలు చేపట్టండి.
వ్యాయామాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకుంటే శరీర ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. యోగా, రన్నింగ్‌తోపాటు హైఇంటెన్సిటీ ఉన్న వ్యాయామాలను వారంలో ఐదు రోజులు, నిత్యం 30 నిమిషాలపాటు చేయగలిగితే.. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. సిట్రస్ ఎక్కువగా లభించే పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను డైట్లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల కూడా చర్మం నిగారిస్తుంది. క్రమం తప్పకుండా నీటిని తాగుతూ ఉండటం చాలా అవసరం. లిక్విడ్ ఫుడ్ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.
బద్ధకం అనుకోకుండా రోజూ పదిహేను నిమిషాలపాటు ఫేషియల్ మసాజ్ చేసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. సున్నిపిండి, శనగపిండి, వరిపిండి తదితర సహజ ఉత్పత్తులను వాడితే మరీ మంచిది.