నేటి ఆధునిక ప్రపంచంలో ‘స్మార్ట్‌ఫోన్’ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మనుషుల సమయానికి.. ఆరోగ్యానికీ తీవ్రనష్టం కలుగజేస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. తాజాగా ‘లైట్ ఫోన్3’ మార్కెట్లోకి విడుదలైంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ఫోన్లకు భిన్నంగా.. ఈ సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది న్యూయార్క్‌కు చెందిన ‘లైట్’ సంస్థ. ఆధునిక సాంకేతికతను కొనసాగిస్తూనే.. సాధ్యమైనంత తక్కువగా ఫోన్‌ను ఉపయోగించుకునేలా ఈ ‘లైట్ ఫోన్3’ తయారైంది. స్మార్ట్ఫోన్లలో ఉండే అన్నిరకాల ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి.
కానీ, వినియోగదారుల సమయాన్ని మింగేసే కొన్ని యాప్‌లు ఉండవు. 3.92 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే కలిగిన ‘లైట్ఫోన్3’.. లైట్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జెన్2 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీపీ స్టోరేజీని ఏర్పాటుచేశారు. 1800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. వెనక భాగంలో 50 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు ముందుభాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటుచేశారు. కెమెరాకోసం ప్రత్యేకంగా ‘షటర్ బటన్’ను ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలో మంచి ఆదరణ పొందుతున్న ‘లైట్ ఫోన్3’ ధర రూ. 33,500. thelightphone.com నుంచి బుక్ చేసుకోవచ్చు.
చదవడం ఇక తేలికే..
ఆన్లైన్లో పుస్తకాలు, నవలలు ఎక్కువగా చదివేవారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిండిల్. ఈ అమెజాన్ ఐకానిక్ ఉత్పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నది. తాజాగా అనేక అధునాతన అప్డేట్లను అందిస్తూ.. ‘కిండిల్ స్ర్కైబ్’ పేరుతో మరో సరికొత్త ‘ఈ రీడర్’ను తీసుకొచ్చింది అమెజాన్. ఇందులోని 10.2 అంగుళాల గ్లేర్ ఫ్రీ, ఫ్రంట్ లైట్ స్క్రీన్.. హైక్వాలిటీ రీడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ‘కిండిల్ స్ర్కైబ్’లో ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అప్డేట్ చేసింది.
16జీబీ, 32జీబీ, 64జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తున్నది. కొత్త కిండిల్ స్ర్కైబ్ తయారీకి అమెజాన్ సుమారు 48 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తోపాటు 100శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించింది. కనెక్టివిటీ కోసం ఇందులో వైఫైని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే.. వారం రోజుల వరకూ వాడుకోవచ్చు. బరువు.. కేవలం 433 గ్రాములు మాత్రమే. ఒక్కచేత్తో హ్యాండిల్ చేయవచ్చు. ‘కిండిల్ స్ర్కైబ్’తోపాటు ప్రీమియం పెన్ను కూడా అందిస్తున్నది. ఏడాది వారంటీతో వస్తున్న కిండిల్ స్ర్కైబ్ ధర. రూ. 35,000. amazon.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
పార్టీ ఇన్.. వండర్ ఆన్!
ఔట్‌డోర్ పార్టీలలో హవా అంతా.. ‘బ్లూటూత్ స్పీకర్’లదే! ఆ హవాను మరింత కొనసాగించేలా మార్కెట్లోకి దూసుకొచ్చింది.. ‘వండర్‌బూమ్ 4’. కాలిఫోర్నియాకు చెందిన అల్టిమేట్ ఇయర్స్ (ఈయూ) తయారుచేసిన ఈ బ్లూటూత్ స్పీకర్.. 360 డిగ్రీల సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఐపీ67 రేటింగ్‌తో వస్తున్న ఈ స్పీకర్ 30 నిమిషాలపాటు నీళ్లలో నానిపోయినా చక్కగా పనిచేస్తుంది. తేలికగా, దృఢంగానూ ఉంటుంది.
డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. కేవలం 95 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ స్పీకర్‌ను సులభంగా వెంటతీసుకెళ్లొచ్చు. స్పీకర్‌పై పెద్ద సైజులో ప్రింట్ చేసిన వాల్యూమ్ బటన్లు.. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 14 గంటలపాటు నిర్విరామంగా పాటలు వినొచ్చు. ఇంకా ఎక్కువ సౌండ్‌తో పార్టీని ఎంజాయ్ చేయాలనుకుంటే.. రెండు బ్లూటూత్ స్పీకర్లను కనెక్ట్ చేస్తే సరిపోతుంది. 31శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారైన ‘వండర్‌బూమ్ 4’ ధర.. రూ. 9,500. ultimateears.com తోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తాయి.
సైక్లింగ్ కింగ్..
ఉరుకుల పరుగుల జీవితంలో.. నగరవాసుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీనికి విరుగుడు రోజూ వ్యాయామం చేయడమే! ముఖ్యంగా రోజూ సైక్లింగ్ చేస్తే.. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగవుతుందనీ, మానసిక కుంగుబాటు, ఒత్తిడి, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయని నిపుణుల మాట. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత వ్యాయామ ఉత్పత్తుల ‘జ్విఫ్ట్’.. ‘వాహూ’ పేరుతో సరికొత్త స్మార్ట్ స్పైన్ సైకిల్‌ను తీసుకొచ్చింది.
ఇండోర్‌లో సైక్లింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వ్యక్తి ఎత్తుకు అనుగుణంగా.. ఈ బైక్‌లోని ప్రతి భాగాన్నీ సర్దుబాటు చేసుకోవచ్చు. కాబట్టి, ఇంట్లోని పెద్దవాళ్లు మొదలుకొని.. చిన్నపిల్లల వరకూ ప్రతిఒక్కరూ సులభంగా సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇందులో ‘జ్విఫ్ట్ సైజింగ్ గైడ్ కార్డ్’ను ఏర్పాటుచేశారు. ఇది రైడింగ్ పొజిషన్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడానికి సాయపడుతుంది. కేవలం సైక్లింగ్ మాత్రమే కాకుండా.. మరెన్నో వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోగలిగే ఈ స్మార్ట్ స్పైన్ సైకిల్ ఖరీదు.. రూ. 1,16,000. zwift.comద్వారా కొనుగోలు చేయవచ్చు.