నమస్తే మేడం. మా అమ్మ వయసు74 సంత్సరాలు. గత కొన్నాళ్ల నుంచి దగ్గినా తుమ్మినా చీరలోనే మూత్రం పడుతున్నది. ఇటీవల దగ్గు కూడా విపరీతంగా వస్తున్నది. దీంతో దుస్తులు తడిసిపోయి, బాగా ఇబ్బంది పడుతున్నది. ఎందుకిలా జరుగుతుంది. దీనికి చికిత్స ఉంటుందా?
– ఓ పాఠకురాలు
ముట్లుడిగిపోయాక శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులు బాగా తగ్గిపోతాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉండే ఈస్ట్రోజెన్ రిసెప్టార్లు (ఈస్ట్రోజెన్ హార్మోన్ను పట్టి ఉంచే ప్రొటీన్ గ్రూప్) బలహీనపడతాయి. సాధారణంగా ఇవి ఈ హార్మోన్ను పట్టి ఉంచి అక్కడి కండరాలు దృఢంగా ఉండటానికి సాయపడతాయి. మూత్రాశయం లోపలి భాగంలో, బయట కూడా ఇవి ఉంటాయి. ఎప్పుడైతే శరీరంలో ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుందో, కటి ప్రాంతమంతా బలహీనపడుతుంది. దీంతో ఆయా భాగాల మీద పెద్దగా పట్టు ఉండదు. తుమ్మినా, దగ్గినా మూత్రం పడటం అన్నది దీని మూలంగానే జరుగుతుంది.
అందుకే మనం ఎప్పుడూ వ్యాయామం చేస్తూ ఉండాలి. నడక కూడా శరీరాన్ని దృఢపరిచేదే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. అవయాల మీద పట్టు కోల్పోకుండా ఉంటాం. ఇక, లావుగా ఉన్నా కూడా పొట్టలో కొవ్వు ఎక్కువై పోయి మూత్రాశయం మీద బరువు పడుతుంది. అప్పుడు కూడా ఇలా తుమ్మినా, దగ్గినా మూత్రం లీకయ్యే సమస్య వస్తుంది.
ఈస్ట్రోజెన్ బలహీన పడటం వల్ల గర్భాశయం కిందకి జారితే, దాని కిందే ఉండే మూత్రపు తిత్తి కూడా కిందకి జారుతుంది. దీని వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక్కడ, సమస్య ఏమిటి అన్నది తెలియాలంటే, గైనకాలజిస్టుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. దాన్ని బట్టి చికిత్స చేయవచ్చు. మాటిమాటికీ దగ్గు వస్తుందన్నారు. దగ్గినప్పుడు కూడా పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. దాని వల్ల కూడా ఇలా జరగవచ్చు. అసలు అంత దగ్గు ఎందుకు వస్తుంది అన్నది పల్మనాలజిస్టు దగ్గర చూపించండి.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్