బాల్యం నుంచి ప్రగతిశీల భావనలు కలిగిన కవి డా॥సి.నారాయణ రెడ్డి. ‘మారాలి మారాలి మారాలిరా/ కరుడు గట్టిన నేటి కరకు సంఘపు రంగు/ మారాలి మారాలి మారాలిరా’ అంటూ బాల్యంలోనే రాశారు. సినారె కవిత్వంలో ప్రగతిశీల మానవతావాదం, మానవాభ్యుదయ చైతన్యం, తాత్విక భూమిక కనిపిస్తాయి. కవిగా అభ్యుదయ, చైతన్య, విప్లవ భావాలను తన కవిత్వంలో చెప్పిన ఆయన.. తనకు అవకాశం కలిగినప్పుడు సినీగీతాల్లోనూ వాటిని పలికించారు. ‘పట్టిన పిడికిళ్లే.. పైకెత్తిన జెండాలై.. గర్జించిన కంఠాలే.. పూరించిన శంఖాలై.. యువతరం కదిలింది’ అంటూ ‘యువతరం కదిలింది’ చిత్రం కోసం రాశారు. తనే ఒకచోట ‘పేరేమో సింగిరెడ్డి నారాయణరెడ్డి/ కులం కీళ్ళు విరిచే నా కలానికి ఈ సన్మానం’ అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి 1992లో నిర్మించిన ‘లాల్ సలామ్’ చిత్రం కోసం ‘ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని’ పాటను రాశారు సినారె. ఈ కథకు ప్రేరణ చుండూరు దారుణ మారణ కాండ. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నారాయణమూర్తి వహించారు. సందర్భానుసారంగా ఈ సినిమాలో చక్కని గీతాన్ని పెట్టారు ఆయన. కమ్యూనిజం, ఎర్రజెండా పనైపోయిందన్న వాళ్లకు చెంపపెట్టుగా ఈ గీతాన్ని రాశారు సినారె.

పల్లవి:
ఎవడురా కూసింది
కమ్యూనిజం చచ్చిపోయిందని
ఎవడురా తెగవాగింది
ఎర్రజెండ ఒరిగిందని
తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం
రక్తం ఎర్రగ నిలిచినంత కాలం
అజేయం రా విప్లవం
దాన్నాపడం ఎవడబ్బతరం
నో.. నెవర్…॥ఎవడురా॥
ఈ చిత్రం కథ విషయానికివస్తే పెదబాబు కొడుకు చినబాబు హరిజనవాడలో ఉన్న లక్ష్మీ అనే అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆమె అన్న సుందరం పట్నంలో చదువుకుని అదే రోజు వస్తాడు. జరిగిన అన్యాయానికి రెచ్చిపోతాడు. అత్యాచారానికి గురైన లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో మరీ కదనసింహమైపోతాడు అన్న. తన చెల్లెలికి అన్యాయం చేసినవాడి కుంటుంబంపై కక్ష తీర్చుకుంటానని శపథం చేస్తాడు. పెదబాబు మనవరాలు శాంతి న్యాయవాది. ఆమె సుందరాన్ని ప్రేమించి అతని దగ్గరకు వెళ్లిపోతుంది.
చరణం:
లెనిన్ విగ్రహం కాదురా
కూల్చేస్తే ముక్కలైపోదురా
లెనిన్ అంటే అట్టుడుగు జనం రా
పడిలేచే ప్రళయాగ్నిరా
ఆకలితో నిరుపేదల పేగులు
అరిచినంత కాలం
శ్రమ జీవుల కళ్లల్లో
కన్నీరొలికినంత కాలం
ఆగదు విప్లవ చైతన్యం
పోరాడుతుందిరా జనసైన్యం
ఎస్ ఫర్ ఎవర్ ॥ఎవడురా ॥
కవిగా లెనిన్ పట్ల సినారెకు మిక్కిలి గౌరవం. అది ఈ గీతంలో మనం చూడొచ్చు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత రష్యాతోపాటు అనేకచోట్ల మొదటి రష్యా ప్రభుత్వాధినేత లెనిన్ విగ్రహాలను తొలగించారు, కూల దోశారు. 1992లో సినారె రాసిన గీతంలో లెనిన్ స్ఫూర్తిని చాటుతూ ముక్కలు కావడానికి లెనిన్ అంటే కేవలం ఒక విగ్రహం కాదని, లెనిన్ అంటే పడిలేచే ప్రళయాగ్ని అన్నారు. ఇంకా నిరుపేదల చైతన్యం ఆగనంత కాలం, శ్రమజీవుల కళ్లల్లో కన్నీరు వచ్చినంత కాలం.. విప్లవ చైతన్యం ఆగదు అన్నారు. విప్లవ చైతన్యమనే విత్తును మార్క్స్ నాటగా, లెనిన్ దానిని చెట్టుగా పెంచారని, అది వీరుల రక్తంతో వేయి కొమ్మలుగా విస్తరించిందని పేర్కొన్నారు. అటువంటి చెట్టు పళ్లను కోసేదెవరురా అంటూ ప్రశ్నిస్తారు సినారె. ఇంకా అంతర్లీనంగా అటు కమ్యూనిజం పట్ల, ఇటు దళితులపట్ల ‘ఎవడైనా బరితెగించి వస్తే’ ఏంజరుగుతుందో
చెబుతారు.
చరణం:
ఈ విత్తు మార్క్స్ నాటిందిరా
ఈ చెట్టు లెనిన్ పెంచిందిరా
వీరుల రక్తంతో తడిసి
ఇది వెయ్యి కొమ్మలయ్యిందిరా
ఈ కొమ్మలు నరికేదెవరురా
ఈ పళ్లను దోచేదెవడురా
ఎవడురా.. ఎవడు.. ఎవడు?
చరణం
ఎవడైనా బరితెగించి వస్తే
ఎదురుగ నిలిచి సవాలు చేస్తే
దళితుల ఊపిరి ఎప్పెనగా
నిర్భాగ్యుల గుండెలు నిప్పులుగా॥దళితుల॥
చెమటోడ్చే కండలు బండలుగా
బతుకీడ్చే పేదలు దండులుగా
ఉరిమిపడి.. తిరగబడి..
భూస్వాములను, బూర్జువాలను
భూస్థాపితం చేసేస్తాం!
విప్లవానికి తిరుగులేదని
ఎర్రజెండాకు ఎదురులేదని
విశ్వమంతటా ఘోషిస్తాం!
శ్రమ శక్తిదే గెలుపని శాసిస్తాం ॥2॥
భూస్వాముల బూర్జువా మనస్తత్వాలు, తాడిత పీడిత పేద ప్రజానీకపు ఆర్తనాదాలు కేంద్రబిందువుగా నడిచే సినిమాల్లో నిజంగా కథనం ఉండదు. ఉన్నదంతా ధనిక పేద వర్గాల వర్గ వైషమ్యం, పేదల తిరుగుబాటు. చివరికి ఈ తిరుగుబాటుదారులు తీవ్రవాదులుగా, నక్సలైట్లుగా, డైనమెట్లు పేల్చే స్థితికి ఎదిగి పోవడం, రక్తం ఏరులై పారడం మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలోనూ ఇంతే. దానిని ‘భూస్వాములను భూర్జూవాలను/ భూస్థాపితం చేసేద్దాం’ అంటారు సినారె. శ్రమశక్తిని గురించి గొప్పగా ఎలుగెత్తి ‘శ్రమశక్తిదే గెలుపని శాసిస్తాం’ అంటారు. విప్లవం, కమ్యూనిజం, ఎర్రజెండాల గురించి తన అభిప్రాయాన్ని, ఆలోచనను, గౌరవాన్ని ఇంత ఘాటుగా పంచకున్నారు కవి సినారె!
…? పత్తిపాక మోహన్