ఇటీవల బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ అధ్యాయం ఇంకా సామాజిక మాధ్యమాల్లో నలుగుతూనే ఉంది. తన తల్లి సభ్యురాలిగా ఉన్న రైతు సంఘాలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిందని కంగనాపై కుల్విందర్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీంతో ఆమె ఉద్యోగం కోల్పోవడంతోపాటు అరెస్ట్ కూడా అయ్యింది. అయితే కుల్విందర్‌కు రోజురోజుకీ మద్దతు పెరుగుతున్నది. రైతుల కోసం నిర్భయంగా నిలబడిన మహిళకు తగిన గౌరవం దక్కాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కుల్విందర్ చర్య సహేతుకమైనదని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ ఆమెకు మద్దతు తెలిపాడు. అంతేకాదు ఉద్యోగం కోల్పోయిన ఆమెకు జాబ్ ఆఫర్ చేశాడు. తాను హింసను ప్రోత్సహించను కానీ, ఆ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని అర్థం చేసుకున్నానని విశాల్ ప్రకటించాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు కుల్విందర్‌పై ఏదైనా చర్య తీసుకుంటే.. ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశాడు.