పడమటి సంధ్యారాగాన్ని తూర్పు దాకా వినిపించేలా చేసేవీ.. ఇక్కడి మువ్వల సవ్వడిని అక్కడికి ప్రతిధ్వనింపజేసేవీ సంస్కృతి, కళలే. విదేశాల్లో పుట్టి పెరిగినా,తెలుగు పిల్లల్లో మనం భారతీయులమనే భావన తప్పక ఉంటుంది. దాన్ని కొనసాగించేందుకు తనదైన రీతిని ఎంచుకుంది.. మేధా వరేణ్యలక్ష్మి కొణికి. అమెరికాలో అడుగులు నేర్చుకుని, తెలంగాణ గడ్డమీద అరంగేట్రం చేసిన ఈ తెలుగు అమెరికన్… తన సాధనా సంగతుల్ని పంచుకుందిలా..
Jwala Narasimha
అమ్మ, నాన్న తెలుగు నేల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం హ్యూస్టన్‌లో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నా. నా ఐదారేండ్ల వయసులో.. స్నేహితులు, బంధువుల పిల్లలు భారతీయ నృత్యాలను నేర్చుకోవడం చూసి నేనూ నేర్చుకుంటానని అమ్మను అడిగాను. అప్పటి దాకా నేను చూసిన డ్యాన్సులకు భిన్నంగా ఉండటం వల్ల నన్ను ఆకట్టుకొని ఉండొచ్చు. అలా ఆరేండ్లప్పుడు భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించా. కానీ ఆ మాస్టారు మరో ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఏడాదిలోపే సాధన ఆపేయాల్సి వచ్చింది. తర్వాత కూచిపూడి నృత్యాన్ని నేర్చుకునే వీలు కలిగింది.
గురువు ప్రధానం
Jwala Narasimha
మన ఆసక్తితో పాటు, నాట్యాన్ని ఇష్టంగా నేర్పే గురువు దొరకడమూ అదృష్టమే. అప్పుడే సాధన సక్రమంగా సాగుతుంది. మన నాట్యం నలుగురూ మెచ్చేలా వన్నెలీనుతుంది. అలాంటి గురువు పదేండ్ల క్రితం నాకు దొరికారు. ఆయనే రాఘవ (వేదాంతం వెంకటరామ రాఘవయ్య) మాస్టారు. కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయిన కూచిపూడి గ్రామానికి చెందిన వారు. ఉద్యోగ నిమిత్తం అమెరికా వచ్చినా, వంశపారంపర్యంగా అబ్బిన కళను వదిలిపెట్టకుండా.. నలుగురికీ నేర్పుతున్నారు రాఘవ మాస్టారు దంపతులు. తన తండ్రిగారితో పాటు కూచిపూడి నాట్యంలో లబ్ధప్రతిష్ఠులైన పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యంలాంటి దిగ్గజాల దగ్గర మాస్టారు నృత్యసాధన చేశారు. అలా రాఘవ మాస్టారు సారథ్యంలో కూచిపూడి నేర్చుకుంటూ అమెరికాలోని పలు కార్యక్రమాల్లో గజ్జెకట్టి కాలు కదిపాను. హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ వారి నాట్య సభల్లో కల్యాణ శ్రీనివాసం, శ్రీరామకథాసారంలాంటి రూపకాల ప్రదర్శనలో భాగమయ్యాను. చిన్నప్పటి నుంచే అమెరికాలోని చిన్మయ మిషన్‌కు వెళ్లేదాన్ని. అక్కడ భారతీయ సంస్కృతి గురించి చెబుతారు.
భగవద్గీత బోధిస్తారు. రామాయణాది ఇతిహాసాలు పరిచయం చేస్తారు. అక్కడ నా కింది తరగతుల విద్యార్థులకు నేను రామాయణ కథలు చెబుతాను. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పురాణ కథలతో పాటు యోగా, మెడిటేషన్ లాంటివి నన్ను ఆకర్షిస్తాయి. సంగీతమన్నా ఇష్టమే. వయొలిన్ తరహాలో ఉండే వయోలా పరికరాన్ని చక్కగా వాయిస్తా. నా కళా సాధనకు మా అమ్మానాన్నలతో పాటు మా తాతయ్య వనం జ్వాలా నరసింహారావు గారు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆయన శ్రమజీవి. ఈ వయసులోనూ సాహిత్య సంబంధంగా ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. తాతయ్య నుంచి నేను కష్టపడేతత్వాన్ని అలవరచుకున్నాను. నాట్యం మెడిటేషన్ లాంటిది. ధ్యానం చేస్తున్నప్పుడు పొందే ప్రశాంతతను నృత్యాన్ని సాధన చేసేప్పుడూ అనుభూతిస్తాం. అందుకే, నేను నాట్య సాధనను అమితంగా ఆస్వాదిస్తాను.
Jwala Narasimha
సాధన నిరంతరం
తెలంగాణ ప్రాంతం కళల్ని ప్రేమిస్తుంది. అందుకే ఈ గడ్డ మీద అభిమానం, నా సొంత వాళ్లున్నారన్న అనురాగంతో హ్యూస్టన్ నుంచి వచ్చి హైదరాబాద్ రవీంద్రభారతిలో అరంగేట్రం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఉషా పరిణయం నృత్య రూపకాన్ని ఇక్కడ ప్రదర్శించాను. ‘నేను చివరిదాకా పూర్తిగా చూసిన తొలి అరంగేట్రం నీదే…’ అంటూ అక్కడికి వచ్చిన వాళ్లలో ఒకరు ఇచ్చిన ప్రశంస ఎంతో సంతోషాన్ని కలిగించింది. నాట్యాన్ని కెరీర్‌గా ఎంచుకుంటానా లేదా అన్నది మరికొంత కాలం గడిస్తే కానీ చెప్పలేను కానీ, ఈ సాధన మాత్రం నిరంతరం కొనసాగిస్తానని మాత్రం చెప్పగలను. ఒకసారి ఆస్వాదించడం మొదలు పెడితే వదిలిపెట్టలేకపోవడమే భారతీయ నృత్యరీతుల్లోని గొప్పతనం!
– వీరగోని రజనీకాంత్గౌడ్