సంతోషాన్ని పంచుకోవడానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాం. ఆత్మీయులు అందించిన కానుకల్ని తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటాం. దుస్తులు, ఆభరణాలు, పుస్తకాలు.. బహుమతులుగా మారిపోయి జ్ఞాపకాల్లో చేరిపోతాయి. కానీ మన మధ్య లేనివారి గుర్తులు మన వెంటే ఉండేలా చేస్తున్నవే ‘మెమరీ జువెలరీ’.
ఒక్కొక్కరూ ఒక్కోరకమైన ఆభరణాలను ఇష్టపడతారు. ఆ వ్యక్తులు శాశ్వతంగా దూరమయ్యాక వాళ్లు ధరించిన నగలను మార్చడమో, భద్ర పరచడమో చేస్తుంటాం. కొన్నిటిని వారి జ్ఞాపకాలుగా అలాగే ధరిస్తాం. ఎంత నగలు అయినా.. ఆత్మీయుల ఆనవాళ్లు కాలేవు. అందుకే దివంగతుల నుంచి సేకరించిన గోర్లు, వెంట్రుకలు, వేలిముద్రలు, దంతాలతోనూ రకరకాల ఆభరణాలను తయారు చేస్తున్నారు.
అంతేకాదు ఆ వ్యక్తుల అస్థికలనూ ఎపాక్సీ సాయంతో లాకెట్లు, ఉంగరాల్లో భద్రపరుస్తున్నారు. కొన్ని బంధాలు, కొందరి జ్ఞాపకాలు ఎప్పుడూ వెంటే ఉండేలా రూపుదిద్దుకున్న ఈ జువెలరీ యువతను ఆకట్టుకుంటున్నది. అలాగే, పసిపాపల గుర్తులను జోడిస్త్తూ.. బొడ్డుతాడు, వెంట్రుకలు, తల్లిపాలతోనూ రకరకాల నగలు తయారుచేస్తున్నారు. ఈ ఆభరణాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా బ్యాంకులు కూడా ఉన్నాయి. ఆ ఆభరణాన్ని అలంకరించుకున్న ప్రతిసారీ.. ఓ అరుదైన స్పర్శ పులకరింతకు గురిచేస్తుంది.