Fashion | చూడు డ్యూడ్… జీన్సు టైట్ అయింది కదా అని పక్కన పెట్టేయక్కర్లేదు… లూజ్ అయిందని వేసుకోకుండా ఉండనూ అక్కర్లేదు. రోజులు మారాయ్. ఫ్యాషన్ ప్రపంచానికి చెప్పు.. అడ్జస్టబుల్ పిన్స్ వచ్చాయని! ఇక జీన్సులు అలమరాలో మూలన పడే ముచ్చటే లేదనీ… వదులైనా బిగుతైనా జీన్సు మనదేననీ!
నాలుగు రోజులు వర్కవుట్ సరిగ్గా చేయకపోతే బెలూన్లా ఉబ్బిపోతుంది పొట్ట. నీది కూర్చుని చేసే పని.. అంటూ అదేదో మనకు తెలియని విషయమన్నట్టు బయటికి వచ్చి మరీ చెబుతుంది. దీంతో కొత్తగా కొన్న జీన్సు కూడా టైట్ అయిపోతుంది. నచ్చిన ప్యాంటు మరికొన్ని సార్లు వేసుకునే అవకాశం పక్కకుపోతుంది. పోనీ కష్టపడి బరువు తగ్గాం.. అప్పుడూ వదులయిపోయిన ఫేవరెట్ జీన్సు పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఇవి ఒకరిద్దరు కాదు, ఆడామగా అన్న తేడా లేకుండా ఎంతో మంది ఎదుర్కొంటున్న ఇబ్బందులే. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు ఫ్యాషన్‌కి కేరాఫ్ అయిన డ్రెస్సులకు ఫ్యాషన్
పరిష్కారమే దొరికింది. అడ్జస్టబుల్ జీన్స్ పిన్స్, బటన్స్‌తో పాటు డెనిమ్ వెయిస్ట్ ఎక్స్టెండర్లూ ఇందుకోసం తయారవుతున్నాయి.
నడుం పట్టని ప్యాంట్లను వేసుకునేందుకు అనువుగా చేస్తాయి వెయిస్ట్ ఎక్స్టెండర్లు.. దాదాపు రెండున్నర మూడు సెంటీమీటర్ల దాకా పొడవుండే ఈ పట్టీల్లో ఒకవైపు బటన్‌తో పాటు రెండు లేదా మూడు కాజాలుంటాయి. మనకెంత అవసరమైతే అంతవరకూ ఉన్న కాజాలో ప్యాంటు బటన్ ఉంచి, ఎక్స్టెండర్కు ఉన్న బటన్‌ను ప్యాంటు కాజాకు పెట్టాలి. దాంతో నడుం చక్కగా వదులైపోతుంది. ప్యాంటును సౌకర్యంగా వేసుకోవచ్చు. నీలం, నలుపు, లేత నీలం.. ఇలా విభిన్న రంగుల్లో రకరకాల జీన్సులకు సరిపోయేలా పట్టీలు దొరుకుతున్నాయి. మామూలు ప్యాంట్లకు సరిపోయేవీ ఉంటున్నాయి. కొంచెమే టైట్ అయిన ప్యాంట్లకు పనికొచ్చేందుకు ఎలాస్టిక్ బటన్లూ లభిస్తున్నాయి. ఇక, ప్యాంటు వదులైనా సరే, దాన్ని కూడా ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేస్తాయి ‘అడ్జస్టబుల్ జీన్స్ పిన్స్, బటన్స్’. చెవి దుద్దు తరహాలో స్క్రూలాగా పెట్టుకోగలిగే వీటిలో పూసలూ, పువ్వులూ, టెడ్డీలు.. ఇలా విభిన్న డిజైన్లు వస్తున్నాయి. ఇవి కాక పూసలూ రాళ్లతో చీర పిన్ను మోడల్లోవీ ఇందుకోసం రూపొందుతున్నాయి. ఒక్క జీన్సుకే కాదు, గౌన్లు, టాప్‌లు, టోపీల్లాంటి వాటికీ వీటి వాడొచ్చు. ఇంకేం, కొత్త జీన్సు బదులు ఈ
అడ్జస్టర్లు కొనేసుకుంటే సరి!