యంగ్ బ్యూటీ జాన్వి కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగినా.. సొంత ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అద్భుతమైన సినిమాల్లో నటించి.. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో తంగం పాత్రలో సహజత్వం ఉట్టిపడేలా నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ‘జాన్వి’ పంచుకున్న ముచ్చట్లు..
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా సంస్కృతే అంత! మీరు పబ్లిక్ ఫిగర్ అయినా, కాకపోయినా.. ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి, ఆ కామెంట్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తంగం పాత్ర నాకు చాలా విషయాలు నేర్చుకునేందుకు దోహదపడింది. ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం రావడం నా అదృష్టం. షూటింగ్ అంతా సరదాగా సాగింది. సెట్లో వాళ్లంతా నన్ను ప్రేమగా చూసుకున్నారు. మీ అందరి ప్రేమ, ఆదరణ పొందడం చాలా సంతోషంగా ఉంది.
నాకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు.. బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ. వీరిద్దరి గురించి వినడం, మాట్లాడటం నాకెంతో ఇష్టం. వీళ్లు మన సమాజం కోసం ఎంతో చేశారు. ఎంతోమందిలో స్ఫూర్తిని నింపారు. అందుకే.. ఈ ఇద్దరికి సంబంధించిన ఏ అంశమైనా నాకు ఆసక్తిగానే ఉంటుంది.
నా చిన్నప్పటి నుంచే సోషల్ మీడియా నన్ను చాలా నెగెటివ్‌గా చూపించింది. 13 ఏళ్లప్పుడు మొదటిసారి అమ్మానాన్నతో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అప్పుడు తీసిన నా ఫొటోలను కొంతమంది అశ్లీల వెబ్సైట్లలో పెట్టారు. దాంతో నేను చాలా ఇబ్బందిపడ్డాను.
ఒక విషయంలో ఈరోజు పొగిడిన వాళ్లే.. అదే విషయంపై రేపు తిడతారు. ముక్కూ, మొహం తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు!? మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.
జిమ్ బయట ఫొటోలు దిగాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే జిమ్ చేసే టైమ్‌లో ఎవరైనా బిగుతుగా ఉండే దుస్తులే వేసుకుంటారు. అలాంటి దుస్తుల్లో తీసిన ఫొటోలు వైరల్ అయితే.. నాకు అలాంటి డ్రెస్సులే ఇష్టమని అందరూ భావించే అవకాశం ఉంటుంది.
జుట్టు లేకుండా నటించాల్సి వస్తే.. నేను అస్సలు ఒప్పుకోను. ఎంత కష్టమైన భరిస్తాను కానీ, జుట్టు మాత్రం కట్ చేసుకోను. నా తొలి సినిమా ‘ధడక్’ కోసం జుట్టు కత్తిరించుకున్నా. అప్పుడు అమ్మ కోప్పడింది. ఏ రోల్ కోసమైనా జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాటే నాకు శాసనం. అందుకే, జుట్టు లేకుండా ఉండే పాత్రలు చేయను.
నా సినిమాల ఎంపికలో నాన్న నిర్ణయమే ఫైనల్. ఆయన నిర్ణయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాన్న నన్ను ఇప్పటివరకు ఫలానా సినిమాలో నటించమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను చేసిన ప్రతి సినిమా.. నా ఇష్టంతోనే ఒప్పుకొన్నా.