ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది అల్యూమినియం పాత్రలను పక్కన పెట్టేస్తున్నారు. వీటిలో వంట చేసుకోవడం తగ్గిస్తున్నారు. అదే సమయంలో.. అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా, ఆఫీస్ లంచ్ బాక్స్.. పిల్లల టిఫిన్ ప్యాక్ చేయడానికి వీటినే ఆశ్రయిస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్ బాక్స్‌లలో ఆహారాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. అయితే, అల్యూమినియం పాత్రలో వండటం కన్నా.. ఇలా ‘ఫాయిల్స్’లో ఆహారాన్ని ప్యాక్ చేయడం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్యూమినియం పాత్రలతో పోలిస్తే.. ఫాయిల్స్ చాలా పలుచగా ఉంటాయి.
వేడివేడి ఆహారపదార్థాలు, ఆమ్ల గుణం కలిగిన కూరగాయలను ప్యాక్ చేసినప్పుడు రసాయన చర్యకు గురవుతాయి. వీటిల్లోంచి ప్రమాదకర రసాయనాలు విడుదలై.. ఆహారంలో కలిసిపోతాయి. అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులకు అల్యూమినియం ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందట.
ఈ ఖనిజం శరీరంలోకి ఎక్కువగా చేరడం వల్ల కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్ఛ వ్యాధులు, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం మొదలైన సమస్యలు తలెత్తుతాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్లెరోసిస్ వంటి నాడీ సంబంధ సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ముఖ్యంగా టమాట, నిమ్మలాంటి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలను అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేయవద్దని సూచిస్తున్నారు.